బాల్య వివాహాలరహిత భారత్‌పై అవగాహన
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు బాల్య వివాహాలు లేని సమాజం నిర్మించడానికి 100 రోజుల అవగాహన సదస్సులో భాగంగా మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటురులో మహిళా పోలీసులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ బాల్య వివాహాలు లేని సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆషా (అవైర్‌నెస్, సపోర్ట్, హెల్ప్ అండ్ యాక్షన్)–2025 కొత్త కార్యాచరణను రూపొందించిందని తెలిపారు. ఈ పథకం ప్రకారం బాల్య వివాహాలను నిరోధించడంలో ఒకే విధమైన, సమర్థ, చట్టబద్ధమైన స్పందనను అందించడమే ఈ ‘ఆషా’ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జిల్లా స్థాయిలో ఒక యూనిట్ ను ఏర్పాటు చేసి ఈ యూనిట్ ద్వారా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, పోలీసులు, న్యాయ సేవాధికార సంస్థలు కలిసికట్టుగా పని చేస్తాయని తెలిపారు. మన రాజ్యాంగం, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ సెక్షన్ – 12–సి ప్రకారం 18 ఏళ్ల లోపు పిల్లలందరికీ వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉందన్నారు. బాల్య వివాహ బాధితులకు, వేధింపులకు గురైన పిల్లలకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా ప్యానెల్ లాయర్స్ ను నియమిస్తామని తెలిపారు. సీడబ్ల్యూసీ, జేజేబీ సంస్థలు పిల్లలకు అవసరమైన చట్టపరమైన సేవలు ఉచితంగా అందుతాయన్నారు. అలాగే పిల్లల హక్కుల రక్షణ కోసం చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణంలో న్యాయం జరిగేలా చూడటం మన లక్ష్యమని తెలిపారు. ఆషా యూనిట్ కొత్త నిబంధలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మిషన్ సమన్వయ కర్త టి. శ్రీవాణి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి సీహెచ్. విజయ్ కుమార్, ప్యానెల్ అడ్వకేట్ కొత్త నిబంధనల గురించి మహిళా పోలీసులకు అవగాహన కల్పించారు.


