
సందర్భం
‘ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వంద లాది గ్రామాలలో వేలాది రైతుల నుండి వ్యవసాయ శాస్త్రవేత్త డా‘‘ రిఛారియా 22,000 లకు పైగా వరి వంగడాలను, 1,800లకు పైగా ఆకుకూరలను సేకరించి వాటి జర్మ్ ప్లాస్క్‌ను రాయ్‌పూర్‌లోని ‘ఇందిరా గాంధీ జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం’లో 1950, 1960లలో భద్రపరిచారు. ఇందులో తక్కువ నీటితో పండేవి, తక్కువ గడ్డినిచ్చేవి, ఎక్కువ గడ్డినిచ్చేవి, సువాసనలు వెదజల్లేవి, పొడవైన– పొట్టి రకాలు, ఏ కాలంలోనైనా పండే అనేక వంగడాలు ఉన్నాయి.
అయితే మన దేశ దళారీ పాలకుల కుమ్మక్కుతో ఈ వరి వంగడాల జర్మ్ ప్లాస్క్‌ను అమెరికా తదితర దేశాల బహుళజాతి కంపెనీలు దొంగిలించుకు పోయాయి. మనీలాలోని ‘ఇంటర్నేషనల్ రైస్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్’ (ఐఆర్‌ఆర్‌ఎ)లలో అభివృద్ధి చేశామని చెప్తూ ఇలా దొంగిలించుకు పోయిన వంగడాలను వివిధ పేర్లతో (ఐఆర్–36, ఐఆర్–72 తదితర) బహుళజాతి కంపెనీలు భారత్ లాంటి అనేక దేశాల్లో అమ్ముకుని భారీగా లాభాలు గడిస్తున్నాయి.
విత్తనాల కోసం భారతదేశ రైతులు ప్రతి సంవత్సరం బహుళజాతి కంపెనీలపై ఆధారపడేలా చేస్తు న్నారు...’ ఈ మాటలు విదేశీ జర్నలిస్టు అల్ఫ్ బ్రెనన్ కు 2022లో ఇచ్చిన ఒక సుదీర్ఘ ఇంటర్వ్యూలో మావోయిస్టు కేంద్ర ప్రధాన కార్యదర్శి బసవరాజువి. ఈ దేశ ప్రజల పరంపరాగత జ్ఞానం పట్ల, దేశీయత పట్ల, వనరుల పట్ల ఆయన వైఖరిని సూచించే మాటలు ఇవి.
దేశభక్తి అనే ఒక్క మాటతో ఈ రోజు అందరినీ శిలువ ఎక్కించి పరీక్షిస్తున్నారు. కానీ నిజంగానే దేశం పట్ల ప్రేమ ఉంటే ఎలా ఆలోచించాలో బసవరాజు చేసిన ఈ సూక్ష్మ పరిశీలన తెలియజేస్తోంది. జాతీయత పేరుతో మావోయిస్టు నిర్మూలనను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న తరుణంలో ఏది దేశభక్తి, ఏది ప్రజల మీది ప్రేమ అనే చర్చ జరగలవసి ఉన్నది.
మావోయిస్టుల ఆలోచనలు విదేశీయమని కొందరు చెబుతుంటారు. మావోయిస్టుల వల్ల ఈ దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, అభివృద్ధికి వాళ్లు ఆటంకంగా ఉన్నారని అంటున్నారు. కానీ కొద్దిగా ఈ దేశ రాజకీయార్థిక వ్యవహారాలను పరిశీలిస్తే ఎవరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నదీ అర్థమవుతుంది. గతంలో కంటే తీవ్రంగా అభివృద్ధి అనే మాట ఇప్పుడు చలామణీలోకి వచ్చింది. కానీ ఇది ఎవరి అభివృద్ధి అనేది అతి ముఖ్యమైన ప్రశ్న.
ఏడాదిన్నరగా మావోయిస్టు నిర్మూలన పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ‘ఆపరేషన్ కగార్’ కేవలం సైనిక చర్య కాదు. అభివృద్ధి నమూనా కేంద్రంగా సాగుతున్న రాజకీయార్థిక యుద్ధం. సరిహద్దుల కోసం పక్క దేశ ప్రజలపై యుద్ధం చేసే భారత ప్రభుత్వం అభివృద్ధి నమూనా విషయంలో జరుగుతున్న సంఘర్షణను అంతర్యుద్ధంగా మార్చేసింది. తన దేశ ప్రజల మీదే దండయాత్ర చేస్తోంది. యుద్ధాల్లో ఆయుధాలు, విమానాలు, డ్రోన్ లు చేసే వికృత ధ్వనుల వెనుక రాజకీయార్థిక విధ్వంసాలు ఉంటాయి.
కగార్ పేరుతో అదే జరుగుతోంది. అందుకే మావోయిస్టు ప్రభా విత మధ్య భారత రాష్ట్రాల్లో హత్యాకాండ ఆపాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆదివాసుల జీవించే హక్కు, రాజ్యాంగం ఇచ్చిన రక్షణ చట్టాల చర్చగానే ఇది ముగిసి పోవడం లేదు. ఈ రక్తపాతం వెనుక ఉన్న పాలకుల అభివృద్ధి నమూనా ఉంది. ఈ ఏడాదిలోనే వందలాది మంది ఆదివాసుల హత్య వెనుక ఉన్న అభివృద్ధి–విధ్వంసాల సంఘర్షణకు మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాళ కేశవరావు హత్య ఒక పరాకాష్ఠ.
ఒకప్పుడు మావోయిస్టులు, వాళ్ల అభిమానులు మాత్రమే పాలకుల అభివృద్ధి నమూనాను మౌలికంగా విమర్శించేవాళ్లు. ప్రజలే కేంద్రంగా అభివృద్ధి నమూనా ఎట్లా ఉండాలో చెప్పేవాళ్లు. ఈ దేశ ప్రజల అవసరాలే కేంద్రంగా అభివృద్ధి నమూనా ఉండాలని విశ్లేషించేవాళ్లు. ఈ దేశ వనరులు ఇక్కడి ప్రజల కోసమే వినియోగించాలనే వాళ్లు. చిన్న చిన్ని సవరణలు ఎన్ని చేసినా అది ప్రజలకు పనికి రాదని, చాలా మందికంటే భిన్నమైన వైఖరిని ప్రకటించేవాళ్లు. విప్లవం ద్వారా మౌలిక మార్పు వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని అనేవాళ్లు.
ఇదే విమర్శ ఇప్పుడు దేశంలోనే ఒక ప్రధాన విమర్శగా ఎదిగింది. ఈ దేశం పిడికెడు మంది కార్పొరేట్లది కాదని, అసంఖ్యాక ప్రజలదనే అవగాహన అనేక రకాలుగా ప్రచారంలోకి వచ్చింది. కార్పొరేటీకరణ ఉద్ధృతంగానే సాగుతూ ఉండవచ్చు. కానీ దాని మీద విమర్శ పదునెక్కుతోంది. అనేక రూపాల్లో ప్రజా పోరాటాలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశభక్తి, జాతీయత అనే భావనలను ఆ పక్క పాలకులు ప్రచారంలో పెట్టే కొద్దీ... ఈ పక్క నుంచి రోజువారీ జీవిత సంక్షోభంలోంచి ప్రజా ప్రయోజనాల చర్చ వేగవంతం అవుతున్నది.
మావోయిస్టు ఉద్యమం ఈ విషయాలను చర్చించడంతో సరి పెట్టుకోలేదు. వాళ్లకు బలం ఉన్న ప్రాంతాల్లో మిలిటెంట్ ఉద్యమాలను నిర్మిస్తోంది. మిగతా ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్న వేర్వేరు ప్రజా పోరాటాలకు మద్దతు ఇస్తున్నది. వాటిలో తనకు వీలైన పద్ధతిలో పాలుపంచుకుంటోంది. ఈ దేశంలో మౌలిక స్థాయిలో జరగాల్సిన అభివృద్ధి నమూనా చర్చను ప్రజా ఆచరణలోకి మళ్లిస్తున్నది.
ఇది ముఖ్యంగా కేంద్ర పాలకులకు ఆగ్రహం తెప్పించింది. పైకి మావో యిస్టు ఉద్యమం గురించి అప్పుడప్పుడు శాంతి భద్రతల సమస్యగా చెప్పినా... ఇది తాను ఎంచుకొన్న అభివృద్ధి నమూనాకు ఆటంకం అని గ్రహించింది. అడవుల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఉండే అశేష పీడిత ప్రజానీకానికీ, కార్మికులకూ, నానాటికీ పెరుగుతున్న మధ్య తరగతికీ ప్రస్తుత ప్రభుత్వం నడుపుతున్న అభివృద్ధి నమూనా ప్రమాదకరమనే చైతన్యం పెరగడంలో మావోయిస్టుల పాత్ర ఉన్నది.
కాబట్టి మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించకపోతే తాను ఎంచుకున్న కార్పొరేట్ అభివృద్ధి నమూనాను అమలు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వానికి స్పష్టమైంది. కొన్ని తేడాలతో గత ప్రభుత్వాలది కూడా ఇదే వరుస. వాళ్లు చూసిన దారిని మరింత నిర్దాక్షిణ్యంగా, అమానవీయంగా నేటి ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఈ మేరకు వివిధ ప్రజా పోరాటాలు ఉద్ధృతమయ్యాయి.
వ్యవస్థ మౌలిక మార్పులో కీలకమైన ఉత్పత్తి సంబంధాల చర్చను, కొత్త దోపిడీ రూపాల సమస్యను మావోయిస్టు ఉద్యమం కేంద్ర స్థానంలోకి తీసుకొని వచ్చింది. కార్పొరేట్ పెట్టుబడి, దాని వనరుల దాహం, శ్రమశక్తిని కొల్లగొడుతున్న పద్ధతుల మీద విమర్శను ప్రజల కామన్ సెన్స్‌లో భాగం చేసింది. కాబట్టి కార్పొరేట్ ఇండియాను సాధించడానికి మావోయిస్టు రహిత భారత్ ఒక షరతుగా మారిపోయింది.
వ్యక్తిగా నంబాళ కేశవరావు భౌతిక కాయం అరమోడ్పు కన్నులతో ఈ నేలలో కలిసిపోవచ్చు. కానీ ఆయన చూపు, మేధ,హృదయం, చైతన్యం మాత్రం పాలకుల అభివృద్ధి నమూనాను గురి చూస్తూనే ఉంటాయి.
పాణి
వ్యాసకర్త ‘విరసం’ కార్యవర్గ సభ్యుడు