వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన హయాంలో రైతులకు కొండంత అండగా నిలిచారు. రైతుకు భరోసా దగ్గర్నుంచీ రైతు మద్దతు ధర వరకూ అన్నింటా తోడుగా ఉన్నారు. ముందెన్నడూ లేని విధంగా తొలిసారిగా రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు.. కొన్ని నిర్దేశిత పంటలకు గనక ధర పడిపోతే... జగన్ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ నిధి సాయంతో వాటిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. పొగాకుతో సహా ప్రధాన వ్యవసాయ వాణిజ్య పంటలైన జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వేరుశనగ, పత్తి, పసుపు, ఉల్లి, టమాటా తదితర పంటలకు మార్కెట్ జోక్యంతో కనీస మద్దతు ధరలు దక్కేలా చేసింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.(What YS Jagan Did For Farmers)
కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని మిర్చి, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, చీనీ పంటలకు దేశంలో కనీస మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వమేదైనా ఉందీ అంటే... అది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే.
రైతులకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతో...
వారి పంటలను దారుణమైన పరిస్థితుల్లో కూడా తక్కువకు అమ్ముకోరాదన్న ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా గత జగన్ ప్రభుత్వం కొన్ని పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించింది. సహజంగా మద్దతు ధరలు ప్రకటించేది కేంద్రమే. కాకుంటే చాలా పంటలను కేంద్రం కొనుగోలు చేయదు. అలాంటి పంటలు వేసే రైతులకూ గిట్టుబాటు ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మూడున్నరేళ్ల కిందట ఇతర పంటలకు ఉదారంగా గిట్టుబాటు ధరలు ప్రకటించింది. అంతకన్నా ఎక్కువ ధరలుంటే రైతులు మార్కెట్లోనే విక్రయించుకుంటారు. ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ అనుకోని విపత్కర పరిస్థితులు తలెత్తి కొన్ని ప్రత్యేక పంటలకు గనక మార్కెట్లో ధర పడిపోతే... వారిని ఆదుకోవటానికి రాష్ట్రం ప్రకటించిన కనీస మద్దతు ధర ఉంటుంది.
2014 నుంచి 2019 వరకూ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో వివిధ పంటల కొనుగోలు కోసం చేసిన ఖర్చు కేవలం రూ.3,322 కోట్లు. మరి వైఎస్ జగన్ ప్రభత్వం మూడున్నరేళ్లలోనే ప్రభుత్వం వివిధ పంటల కొనుగోలు కోసం ఎంత వెచ్చించిందో తెలుసా? అక్షరాలా ఏడువేల నూటయాభై ఏడు కోట్లు. ఐదేళ్లలో ధాన్యం కొనుగోలు కోసం చంద్రబాబు ప్రభుత్వం వెచ్చించిన మొత్తం రూ.43,134 కోట్లయితే... మూడేళ్లలోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 48,793 కోట్లు వెచ్చించింది. అంటే సగటున చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి రూ.8,600 కోట్లు ధాన్యం సేకరణకు వెచ్చిస్తే... ఈ ప్రభుత్వం సగటున ఏడాదికి రూ.16,200 కోట్లు వెచ్చించింది.
విత్తనాలు, పురుగు మందులు దగ్గర నుంచి..
రైతుకు విత్తనాలు, పురుగు మందులు అందించే దగ్గర నుంచి... వారి నుంచి పంట కొనుగోలు చేసేందుకు కూడా వీలుగా గ్రామ స్థాయిలో ఏకంగా 10,778 ఆర్బీకేలను ఏర్పాటయ్యాయి. పైపెచ్చు ఆర్బీకేల ద్వారానే కొనుగోలు చేయటం... రైతుల నుంచి మాత్రమే కొనేలా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ తీసుకోవటం... కొనుగోళ్లలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యమివ్వటం... నాణ్యతకు పెద్దపీట... నేరుగా రైతు ఖాతాల్లోకే నగదు జమ అనే పంచ సూత్రాలూ నిక్కచ్చిగా అమలు చేశారు. . దీన్నిబట్టి వైఎస్ జగన్ ఎంత విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారో వేరుగా చెప్పాల్సిన పనిలేదు.(YS Jagan Reforms In Agriculture)
అప్పుడు కనీస మద్దతు ధరకన్నా మార్కెట్ ధర భేష్..
గత వైఎస్సారసీపీ ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగా ప్రస్తుతం ఎమ్మెస్పీ ధరల కంటే మిరప, పత్తి, పసుపు, వేరుశనగ, మినుము, మొక్కజొన్న పంటలకు మిన్నగా మార్కెట్‌లో ధర పలికింది. దీంతో వాటిని కొనుగోలు చేయాల్సిన అవసరం పెద్దగా రాలేదు. తొలి మూడేళ్లలో ధరలు పడిపోయినపుడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1789 కోట్ల విలువైన పత్తిని సైతం వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ రకమైన భరోసా ఇవ్వటంతో మార్కెట్లో ధరలు స్థిరంగా నిలిచాయి.
మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఏది?
వ్యవసాయరంగాన్ని ఉద్ధరిస్తున్నామన్నట్టుగా 10వేలమందితో టెలికాన్ఫరెన్స్ పెట్టామని గొప్పగా వారి ఎల్లో మీడియాలో రాయించుకుంటున్న చంద్రబాబు సర్కార్.. అదే నోటితో కనీసం 10 మంది కలెక్టర్లకు ఫోన్ చేసి వారికి తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు మంచి రేట్లు వచ్చేలా చేయమని ఎందుకు చెప్పలేకపోయారన్నది ప్రధానంగా చూడాలి.
ఇక ధరలు పతనమై, దీన స్థితిలో ఉన్న రైతన్నను ఆదుకుంటూ ధరల స్థిరీకరణకు వెంటనే డబ్బులు మంజూరుచేసి, రైతుల్ని ఆదుకునే చర్యలను ఎందుకు చేపట్టడంలేదనేది ఆ చంద్రబాబు సర్కారుకే తెలియాలి.
ఇప్పుడు కూడా ధాన్యం, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి ధరలు దారుణంగా పడిపోయినా, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీనీ, మామిడి ధరలు పడిపోయినా పట్టనట్లే వ్యవహరించింది చంద్రబాబు సర్కార్.
ఈ 18 నెలల కాలంలో దాదాపు 16 సార్లు ప్రకృతి విపత్తుల వల్ల రైతులు నష్టపోతే కనీసం ఒక్కసారైనా ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్న దాఖలాలు లేవు. రైతులకు ఏ కష్టం వచ్చినా, ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు స్పందించి ఆదుకున్న సందర్భం కూడా ఎక్కడా రాలేదు.
రైతులు, వారి తరఫున వైఎస్ జగన్ పోరాటాలు చేస్తే, దాన్ని డైవర్ట్ చేయడానికి ఎదురుదాడి చేయడం.. రైతుల పరామర్శకు వెళ్తే అన్యాయంగా కేసులు పెడతారు. రైతులను ఆదుకోవడానికి హడావిడి ప్రకటనలు చేయడం తప్పితే, ఆచరణ వరకూ వచ్చేసరికి ఏమీ లేదు. మిర్చి, పొగాకు, మామిడి, ఉల్లి పంటల విషయంలో చంద్రబాబు వ్యహరించిన తీరు దీనికి నిదర్శనం.
నష్ట పరిహారం ఊసే లేదు..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు కల్పించిన భద్రత, భరోసా, గ్యారంటీలను పూర్తిగా తొలగించడమో నిర్వీర్యం చేయడమే చంద్రబాబు సర్కారు పెట్టుకున్న పని. ఉచిత పంటల బీమా లేదు.. తుపాను సహా ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన, బీమా పరిధిలో లేని లక్షల మంది రైతులకు నష్టపరిహారం ఎప్పుడు చెల్లిస్తారో కనీసం ఊసైనా చెప్పడం లేదు.
ఉచిత పంటల బీమాను రద్దుచేశారు, తుపాను సహా ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన, బీమా పరిధిలో లేని లక్షల మంది రైతులకు ఏంచేస్తారో చెప్పడంలేదు. పోనీ వారికి ఇన్సూరెన్స్ లేకపోయినా మీరే పంట నష్టపరిహారం ఎప్పుడు చెల్లిస్తారో మాటమాత్రమైనా చెప్పలేకపోతున్నారు.
రైతులకు ఇవ్వాల్సిన రూ.600 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడిస్తారు? పోనీ నిన్నటి తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడంలేదు. మంచి విషయాల కోసం చంద్రబాబు కనీసం ఆలోచన కూడా చేయరన్నది ప్రస్తుతం మనకు కళ్లకు కనిపిస్తున్న వైనం.
కర్షక బంధువు వైఎస్ జగన్..
అప్పుడు.. ఇప్పుడు రైతులకు బాసటగా నిలవాలన్నది వైఎస్ జగన్ సంకల్పం. (How YS Jagan Helped Farmers) ప్రభుత్వంలో ఉండగా రైతులకు ఎంత మేలు చేసిన వైఎస్ జగన్.. ఇప్పుడు కూడా అదే సంకల్పంతో పోరాడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా రైతులకు జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తూనే ఉన్నారు. రైతుకు కష్టమొస్తే అక్కడకు వెళ్లి వారికి భరోసా, ధైర్యాన్ని ఇస్తున్నారు వైఎస్ జగన్. పులివెందుల వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటనలో అరటి పంటలను నష్టపోయిన రైతులను జగన్ పరామర్శించనున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా దాన్ని అధిగమించి రైతులకు అండగా నిలుస్తూ కర్షక బంధువు అనిపించుకుంటున్నారు వైఎస్ జగన్.


