వైఎస్ జగన్ హయాంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటు
13 కొత్త జిల్లాలు, 25 రెవెన్యూ డివిజన్లు... విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు
చంద్రబాబు నియోజకవర్గం కుప్పంను రెవెన్యూ డివిజన్ చేసిన వైఎస్ జగన్
శాస్త్రీయంగా జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణపై వక్రీకరణలు
ప్రసుత్తం స్వార్థం కోసం కొత్త జిల్లాలతో రాజకీయం
2014–19 మధ్య ఈ అంశాన్ని పట్టించుకోని సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిపై అతి వ్యామోహంతో ఇతర ప్రాంతాలను గాలికి వదిలేసిన సీఎం చంద్రబాబు... గత వైఎస్ జగన్ హయాంలో పక్కాగా జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణను చెదరగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పట్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సరిగా జరగలేదంటూ వాటిని సొంత రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చేందుకు చూస్తోంది. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి ప్రతిపాదనలు సైతం రూపొందించారు.
నిజానికి రాష్ట్ర విభజన తర్వాత పాలనను గాడిలో పెట్టడానికి 2014–19 మధ్యనే జిల్లాలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉన్నా పట్టించుకోలేదు. తెలంగాణలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినా చంద్రబాబు ఆ ఊసే లేకుండా ఐదేళ్లు పాలన సాగించారు. అప్పుడు ఎక్కడికక్కడ డిమాండ్లు రావడంతో వైఎస్ జగన్ తాము అధికారంలోకి వస్తే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. గెలిచాక ప్రణాళిక ప్రకారం హామీ నెరవేర్చి రాష్ట్రానికి సమగ్ర స్వరూపం తెచ్చారు.
వాస్తవాలు దాచి రాజకీయ క్రీడ
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా శాస్త్రీయంగా జిల్లాలు ఏర్పాటవగా, పునర్వ్యవస్థీకరణ అస్తవ్యస్తంగా జరిగిందనే అబద్ధాన్ని ప్రచారంలో పెట్టి ఆ ముసుగులో రాజకీయ ప్రయోజనాల కోసం మరికొన్ని కొత్త జిల్లాలపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పలు జిల్లాల్లో సరిహద్దుల మార్పునకు సిద్ధమవుతున్నారు. కొత్తగా మదనపల్లె, మార్కాపురం జిల్లాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశమై.. టీడీపీకి రాజకీయ ప్రయోజనం ఉండేలా మార్పులు ఉండాలని తొలుత ఇచ్చిన నివేదికను తిరస్కరించారు. ఆయన రాజకీయ అజెండాకు తగినట్లుగా కమిటీ కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. తాజా పునరి్వభజన వల్ల చంద్రబాబుకు ఆయన పార్టీకి తప్ప రాష్ట్రానికి, ప్రజలకు, పరిపాలనకు ఎటువంటి ప్రయోజనం ఉండదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
2022 ఏప్రిల్‌లో 13 జిల్లాలను
26గా విభజించారు. 25 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను... అరకు పరిధి ఎక్కువగా ఉండడంతో దాన్ని రెండుగా చేశారు. ఉన్నతాధికారులతో కమిటీలు వేసి విస్తృత అధ్యయనం చేశారు. పూర్తి శాస్త్రీయంగా ఆయా ప్రాంతాల భౌగోళిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలకు రూపం ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన 17,500 సూచనలు, సలహాలు, అభ్యంతరాలను పరిశీలించి, 284 అంశాలుగా విభజించి తగినట్లుగా నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త 13, పాత 13 జిల్లాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం సగటున 18 నుంచి 20 లక్షల జనాభా ఉండేలా చూశారు. సాధ్యమైనంత వరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాలోనే ఉంచారు. ప్రతి జిల్లాలోనూ కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు చేశారు. దీంతో రెవెన్యూ డివిజన్లు 51 నుంచి 76కి పెరిగాయి.
⇒ ఈ ప్రక్రియ జరిగినప్పుడే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీన్ని మన్నించి కుప్పంను రెవెన్యూ డివిజన్ చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరును విజయవాడ జిల్లాకు పెట్టారు. తమకు తరతమ బేధాలు లేవని నిరూపించారు. చంద్రబాబు ఎక్కువ కాలం అధికారంలో ఉన్నా... ఎన్టీఆర్‌ను, ఆయన పేరును రాజకీయంగా ఉపయోగించుకోవడమే తప్ప గౌరవం దక్కే ఒక్క పని కూడా చేయలేదు. వైఎస్ జగన్ మాత్రం ఎన్టీఆర్‌ను గౌరవించారు.
⇒ కొత్త జిల్లాలకు ఆయా ప్రాంతాల ప్రాశస్త్యం, స్థానిక సంప్రదాయాలు, సంస్కృతుల ఆధారంగా పేర్లు పెట్టారు. అరకుకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, అమలాపురానికి అంబేడ్కర్ కోనసీమ, నర్సరావుపేటకు పల్నాడు, రాజంపేటకు అన్నమయ్య, విజయవాడకు ఎన్టీఆర్, హిందూపురం పార్లమెంటుకు శ్రీ సత్యసాయి జిల్లాగా నామకరణం చేశారు. ఇవన్నీ అందరికీ ఆమోదయోగ్యంగా చెలామణీ అవుతున్నాయి. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలు పాడేరు, పార్వతీపురం, నరసరావుపేట, బాపట్ల, రాయచోటి, పుట్టపర్తి అభివృద్ధి కేంద్రాలుగా మారాయి.


