భద్రతా మండలిలో చోటుకు బదులు... | K P Nair Special Story On India United Nations - Sakshi
Sakshi News home page

భద్రతా మండలిలో చోటుకు బదులు...

Published Fri, Feb 16 2024 12:18 AM

Sakshi Guest Column On India United Nations By KP Narayan

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశ హోదా కోసం భారత్‌ పావు శతాబ్ద కాలంగా విఫలయత్నం చేసింది. మండలి విస్తరణ జరిగినా చోటు దొరక్కపోతే మళ్లీ మరో పాతికేళ్ళు వృథా అవుతుంది. అందుకే ఆ ప్రయత్నాలను కొనసాగిస్తూనే, ప్రత్యామ్నాయంగా భిన్న దేశాల కూటములతో కలిసి పనిచేయాలన్న కచ్చితమైన నిర్ణయం భారత్‌ తీసుకుంది. ప్రపంచ సమస్యలపై ఎజెండాను రూపొందించడానికి ప్రయత్నిస్తోంది. ‘ఐఎస్‌ఏ’, ‘సీడీఆర్‌ఐ’ లాంటి సమూహాల స్థాపనకు చొరవ తీసుకోవడమే కాకుండా, వాటి కార్యాలయాలను ఢిల్లీలో ఏర్పాటు చేయించడంలో విజయం సాధించింది. క్వాడ్, ఐ2యూ2 లాంటి సమూహాలతో కూడా సాగుతూ భారత్‌ ప్రాభవాన్ని పెరిగేలా చూడటం మన దౌత్య పురోగతికి సంకేతం.

దౌత్యపరంగా ప్రపంచంలోనే అత్యున్నత వేదిక అయిన భద్రతా మండలిలో శాశ్వత స్థానం కోసం భారత్‌ ఇక ఎదురుచూడటం లేదు. ఐక్యరాజ్యసమితి (ఐరాస)కి చెందిన అత్యంత ముఖ్యమైన ఈ విభాగంలో సమాన ప్రాతినిధ్య లక్ష్యం దిశగా పావు శతాబ్ద కాలంగా చేస్తూ వచ్చిన ప్రయత్నాలు పెద్ద పురోగతిని సాధించలేదు. భద్రతా మండలి విస్తరణలో కూడా మరో పాతికేళ్ళ కాలం భారత్‌ వంటి ఆశావహులను పక్కదారి పట్టించవచ్చనేది ఇప్పుడు కేంద్రప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. 

అందుకే, అంతుచిక్కని ఐక్యరాజ్యసమితి సంస్కరణల లక్ష్యం కోసం ఎదురుచూడకుండా ప్రపంచ వేదికపై తన పాద ముద్ర వేయ డానికి, చిన్న చిన్న దేశాల సమూహాలతో కలిసి పనిచేయాలని నరేంద్ర మోదీ  ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకుంది. భారత్‌ 37 బహు పాక్షిక సమూహాలలో చేరింది. అంతేకాకుండా, భద్రతా మండలికి బదులుగా ప్రపంచ సమస్యలపై ఎజెండాను రూపొందించడానికి ప్రయత్నిస్తోంది.

విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్‌ ఫిబ్రవరి 8న రాజ్యసభలో మాట్లాడుతూ, ఈ బహుపాక్షిక సమూహాలు ‘‘వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, రక్షణ సహకారం సహా అనేక రంగాలలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి భారత్‌కు వీలు కల్పిస్తాయి. ఇలాంటి ఫలితాలు భారత్‌ జాతీయ అభివృద్ధి ఎజెండాకు దోహదం చేస్తాయి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తాయి, మన ప్రజల శ్రేయస్సును మెరుగుపరుస్తాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తెస్తాయి’’ అని చెప్పారు.

ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయన్స్‌ (ఐఎస్‌ఏ) అనేది భారత్‌ ఆలోచన. 2015లో ప్యారిస్‌లో జరిగిన 21వ వాతావరణ మార్పు సదస్సులో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హొలాండే అందించిన మద్దతు ఈ భావనను ఫ్రాంకో–ఇండియన్‌ ఉమ్మడి ప్రయత్నంగా మార్చింది. ఇది మోదీ ప్రభుత్వ మొట్టమొదటి బహుపాక్షిక చొరవ. కాబట్టి, ఇది ప్రారంభం కావడానికి కాస్త సమయం పట్టింది. అయితే ఐఎస్‌ఏ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీటీ)లో ఉన్నందున ఇది భారత ప్రతిష్ఠను మరింతగా పెంచింది. అనేక దశాబ్దాలుగా మన దేశమే సమస్యగా ఉండటం కాకుండా, వాతావరణ మార్పుపై సమస్య–పరిష్కర్తగా మారేట్టు చేసి, భారత ఖ్యాతిని పెంచింది.

సీడీఆర్‌ఐ విషయానికి వస్తే, దానికి ఐఎస్‌ఏ లాగా అంత పేరు లేదు. ఇది 2019లో ఏర్పడిన కొత్త, ముఖ్యమైన భాగస్వామ్యం. ఇది వాతావరణానికి తట్టుకోగల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి... బహుపాక్షిక ఏజెన్సీలు, అభివృద్ధి బ్యాంకులు, ప్రైవేట్‌ రంగం, విద్యాసంస్థలతో కలిసి పనిచేయడానికికీ ప్రభుత్వాలను ఒక చోటికి తీసుకువస్తుంది. 2016లో జరిగిన విపత్తు నష్టభయం తగ్గింపుపై జరిగిన ఆసియా మంత్రుల సదస్సులో మోదీ అటువంటి కూటమి ఆలోచనను ప్రతిపాదించారు. అయితే ఈ ఆలోచనను దాని భాగస్వాములు ఆమోదించడానికీ, సీడీఆర్‌ఐని రూపొందించడానికీ మరో మూడేళ్లు పట్టింది. సీడీఆర్‌ఐ ప్రధాన కార్యాలయం కూడా న్యూఢిల్లీలో ఉంది.

అనేక దశాబ్దాలుగా, జెనీవా, నైరోబీ, వియన్నా వంటి మెట్రోలకు లాగే తన నగరాల్లో ఒకదానిని ఐక్యరాజ్యసమితి నగరంగా ప్రకటించాలని భారత్‌ ఆకాంక్ష. పైన పేర్కొన్న నగరాలు న్యూయార్క్‌కు అనుబంధ, ద్వితీయ ప్రధాన కార్యాలయంగా పని చేస్తాయి. ఇక్కడ ఐరాస వార్షిక జనరల్‌ అసెంబ్లీ వంటి అతి ముఖ్యమైన కార్యకలాపాలు సాగుతాయి. అయితే, భారత్‌ కోరుకున్నట్లు  జరగలేదు. తన ప్రధాన నగరాల్లో ఒకదానిలో ప్రాంతీయ ఆర్థిక సంఘాన్ని నెలకొల్పేలా ఐరాసను భారత్‌ ఒప్పించలేకపోయింది. అడిస్‌ అబాబా, బ్యాంకాక్, బీరూట్, జెనీవా, శాంటియాగోలకు ఈ ఘనత లభించింది.

అందువల్ల, భారత్‌లో సీడీఆర్‌ఐ, ఐఎస్‌ఏ కార్యాలయాలను నెలకొల్ప టానికి వ్యవస్థాపక సభ్యదేశాలను ఒప్పించటం గొప్ప విషయం. నేడు ఈ రెండు సంస్థలు పెద్ద సంఖ్యలో భారతీయులకు ఉపాధి కల్పిస్తు న్నాయి. న్యూఢిల్లీకి మకాం మార్చి, ఈ సంస్థలలో పని చేయడానికి విదేశాల నుంచి కూడా నిపుణులను రప్పించారు. జాతీయ రాజధాని ప్రాంతం ఈ సంస్థల నుండి అనుబంధ ప్రయోజనాలను పొందుతుంది. వారి ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ కార్యక్రమాల ద్వారా సమావేశాలు, ప్రదర్శనలకు న్యూఢిల్లీ ఒక ముఖ్యమైన వేదికగా ఎదుగుతుంది.

భారత్‌ సభ్యురాలిగా ఉన్న అతి ముఖ్యమైన బహుళజాతి సమూహం ఏదంటే నిస్సందేహంగా క్వాడ్రిలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌. దీనిని సరళంగా క్వాడ్‌ అని పిలుస్తున్నారు. ఇది భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలను ఒకచోట చేర్చింది. క్వాడ్‌కు భారత్‌లో సంశ యవాదులు మాత్రమే కాకుండా కొన్నిసార్లు తీవ్రమైన వ్యతిరేకులు కూడా లేకపోలేదు. కానీ భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ‘వై భారత్‌ మ్యాటర్స్‌’ పుస్తకంలో, క్వాడ్‌ గురించి చాలా ముఖ్యమైన కానీ తరచుగా నిర్లక్ష్యం చేయబడిన అంశాన్ని పేర్కొన్నారు.

భారత్‌కు ‘ఇటీవలి కాలంలో చాలా స్పష్టంగా అభివృద్ధి చెందిన సంబంధం ఆస్ట్రేలియాతోనే’ అని రాశారు. జైశంకర్‌ ప్రకారం, ఈ క్వాడ్‌ సభ్యదేశంతో పెరుగుతున్న సంబంధాలు ఇతర క్వాడ్‌  సభ్యదేశాలైన జపాన్, అమెరికాలతో సంబంధాలలో అంతరాన్ని తగ్గించాయి. అధికారిక అంచనా, ప్రజల అవగాహన రెండింటిలోనూ జపాన్, అమెరికాతో భారత్‌ సంబంధాలు చాలా ముఖ్యమైనవి.

జైశంకర్‌ వాదనను అంగీకరించినట్లయితే, బహుపాక్షిక క్వాడ్‌ నిజానికి సాధారణంగా అంగీకరించిన దానికంటే పెద్ద ద్వైపాక్షిక ప్రయోజనాన్ని అందిస్తోంది. గత సంవత్సరం, క్వాడ్‌ మొదటిసారిగా ఐరాస భద్రతా మండలి సంస్కరణపై అంతర్‌–ప్రభుత్వ చర్చలకు మద్దతు ఇచ్చింది. ఐక్యరాజ్యసమితిని వాస్తవానికి ఏర్పాటు చేయడా నికి కారణమైన ప్రశంసనీయమైన లక్ష్యాలను అణచివేసే ప్రయత్నా లను అడ్డుకోవడానికి కలిసి పనిచేయడానికి అంగీకరించింది. జైశంకర్‌ ప్రకారం, క్వాడ్‌ ‘రెండు దశాబ్దాలుగా కీలక సంబంధాలలో భారత దేశం సాధించిన పురోగతి సమాహారం’.

ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలతో కూడిన ‘ఐ2యూ2’ కూటమి కూడా పూర్తిగా భారత్‌కు మాత్రమే ప్రయోజనం చేకూర్చింది. యూఏఈ పెట్టుబ డులు, ఇజ్రాయెల్‌ నీటిపారుదల సాంకేతికతతో మధ్యప్రదేశ్‌లో ఫుడ్‌ పార్కుల నెట్‌వర్క్‌ స్థాపన జరిగింది. రెండో ఐ2యూ2 ప్రాజెక్ట్‌ అమె రికా నిధులతో గుజరాత్‌లో విద్యుదుత్పత్తి కోసం సౌరశక్తిని ఉపయో గించాలని భావిస్తోంది. అయితే, పశ్చిమాసియాలో పెరుగుతున్న సంఘర్షణ దృష్ట్యా కొత్త ఐ2యూ2 ప్రాజెక్ట్‌లు ముందుకు సాగడానికి చాలా సమయం పట్టనుండటం విచారకరం.

ఇలాంటి మరెన్నో సమూహాలకు కేంద్రంగా ఉంటున్న భారత్‌తో బహుళజాతి కార్యక్రమాలు, త్రైపాక్షికత పెరుగుతుండటం అనేవి భారతీయ దౌత్య పురోగతికి సంకేతం. భారత్, ఫ్రాన్స్, యూఏఈ తమ ‘ఫోకల్‌ పాయింట్స్‌ గ్రూప్‌’ను 2022లో ఏర్పాటు చేశాయి. ఇది రక్షణ, విపత్తు నిర్వహణ నుండి ప్రాంతీయ అనుసంధానం, ఆహార భద్రత వరకు అనేక రంగాలలో పురోగమిస్తోంది. ఈ మోడల్‌ మాదిరి గానే భారత్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కాలానుగుణంగా ‘ఫోకల్‌ పాయింట్ల సమావేశాలను’ నిర్వహిస్తున్నాయి. అంత మాత్రాన ఇదంతా భద్రతా మండలి శాశ్వత సభ్యత్వానికి వీడ్కోలు చెప్పడం కానే కాదు. కానీ ఫ్రెంచ్‌వారన్నట్లు ‘మనం మళ్లీ కలిసేవరకు’ కొనసాగుతాయని అర్థం.

కె.పి. నాయర్‌ 
వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకుడు
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Advertisement
 
Advertisement