అభిప్రాయం
‘సొంత గుడిసె వేసుకోలేనోడు ఊరంతటికీ వేస్తాడా’ అని ఆఫ్రికాలో ఒక సామెత ఉంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల పరాభవంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఆ ఫలి తాలు ‘ఆశ్చర్యకరంగా’ ఉన్నాయన్నారు. కానీ అంతకన్నా భిన్నంగా ఉంటేనే ఆశ్చర్య పోవాలి. అక్కడ ఆ పార్టీ 2020లో 70 సీట్లకు పోటీ చేసి, కేవలం 19 గెల వగా... ఈసారి 61కి గానూ 6 స్థానాలు గెలిచింది.
మహాగఠ్‌బంధన్ మొత్తంగానే ఓడినప్పటికీ, ఆ కూటమిలోని జాతీయ పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అయినందున దాని గురించి ప్రత్యేకంగా చర్చించటం అవసరమవుతున్నది. రెండేళ్ల క్రితం సగం దేశంలో ‘భారత్ జోడోయాత్ర’ జరిపిన రాహుల్ గాంధీ ఇపుడు బిహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ సాగించి, దేశమంతటా ప్రజా స్వామ్య ప్రియులలో కనీసం కొందరికి కొన్ని ఆశలు కల్పించారు. కానీ, 2004లో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించినప్పటి నుంచి ఈ 21 సంవత్సరాలలో ఆయన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలిగింది ఏమీ లేదు.
నాయకత్వానికి సవాలు
రాహుల్ గాంధీ రాజకీయ ప్రవేశం చేసిన 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావటంలో తన పాత్ర ఏమీ లేదు. అంతకుముందటి వాజ్‌పేయి ప్రభుత్వం చేసిన ‘ఇండియా షైనింగ్’ ప్రచారాన్ని ప్రజలు మెచ్చనందున బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ఓడిపో యింది. తర్వాత కాంగ్రెస్ నాయకత్వాన యూపీఏ కూటమి రెండవ సారి 2009లో అధికారానికి రావటంలో కొన్ని సంక్షేమ పథకాలు, ఆర్థిక పరిస్థితి పెరుగుదల పాత్ర వహించాయి. ఆ వెనుక 2014లో కాంగ్రెస్ ఓటమిలోనూ రాహుల్ బాధ్యత లేదు. వివిధ కుంభకోణాల వల్ల అది జరిగింది. ఆ విధంగా గుర్తించవలసిందేమంటే, రాహుల్‌కి నాయకత్వ పరీక్ష అంటూ మొదలైంది 2014 నుంచి! అప్పటినుంచి గత 11 సంవత్సరాలుగా ఆయన ఏమి చేశారన్నది ప్రశ్న.
వాస్తవానికి అంతకుముందు కూడా రాహుల్ గాంధీ కొన్ని పరి మితమైన పరీక్షలను ఎదుర్కొన్నారు. కాంగ్రెస్‌కు మొదటినుంచీ ఉత్తర ప్రదేశ్ ప్రధాన కార్యక్షేత్రం, బలమైన కేంద్రం. అక్కడ రైతుల పార్టీలు, దళితుల పార్టీలు, సోషలిస్టు పార్టీలు బలపడి వివిధ సామాజిక వర్గాలు దూరమైనందువల్లనే కాంగ్రెస్‌కు పునాది లేకుండా పోయిందని తనకు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రొఫెసర్లు బోధపరచటంతో, వారి సూచనల ప్రకారం యూపీలో కాంగ్రెస్ పునరుద్ధరణకు రాహుల్ గాంధీ నడుం కట్టారు. సోదరి ప్రియాంక ఆయనకు తోడయ్యారు.
ఆ రాష్ట్రాన్ని నేడు గెలిస్తే రేపు దేశాన్నంతా గెలవగలమన్నది ఆయన నిర్ణయించుకున్న లక్ష్యం. అందుకు తల్లి దీవెనలు కూడా పొందారు. కానీ, ఉత్తర ప్రదేశ్‌లో పార్టీ బలోపేతం అనే మొదటి పరిమిత పరీక్షలో ఆయన విఫల మయ్యారు. రెండవ పరిమిత పరీక్ష 2007లో పార్టీ ప్రధాన కార్య దర్శిగా నియమితుడై, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలకు ఇన్‌ఛార్జ్ కావటం రూపంలో ఎదురైంది. అందుకు సంబంధించి మొదట తగినంత హడావిడి చేసిన ఆయన, ఆ సంస్థలను పునర్ని ర్మించలేకపోయారు.
వైఫల్యాలపై అధ్యయనం శూన్యం
ఇటువంటి పదేళ్ల పరిమిత వైఫల్యాల నేపథ్యం నుంచి, 2014 వచ్చేసరికి రాహుల్ గాంధీపై పార్టీ బాధ్యతలు పూర్తిగా వచ్చి పడ్డాయి. అప్పటికి కాంగ్రెస్ కేంద్రంలో, పలు రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. సోనియా గాంధీ తన సమర్థతను పలు సందర్భా లలో రుజువు చేసిన దశ గడచిపోయింది. పార్టీ సాంకేతికంగా చీల లేదు గానీ పలువురు సీనియర్లు బీజేపీలో చేరటమో, మృతి చెంద టమో, వార్ధక్యం వల్ల క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమించ టమో మొదలైంది.
పార్టీ నుంచి వివిధ సామాజిక వర్గాలు దూరం కావటం రాహుల్ రాజకీయ ప్రవేశం కన్నా చాలా కాలం క్రితం నుంచే మొదలు కాగా, ఈసరికి బాగా వేగం పుంజుకున్నది. పార్టీ మరికొన్ని రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. సోనియా తరచు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ పరిణామాలన్నింటి జమిలి స్థితి... ఆయన తీవ్రమైన పరీక్షలను ఎదుర్కోవలసి రావటం. పార్టీ నాయకులకు ఒకప్పుడు ఉండిన సలహాదారులు, సహాయకులు, వర్కింగ్ కమిటీ సభ్యులు హేమాహేమీలు కాగా, ఈ దశ వచ్చేసరికి దాదాపు అందరూ పనికిరానివాళ్లు, స్వార్థపరులు వచ్చి చేరారు. రాహుల్ గాంధీకి అది మరొక పెద్ద కొరతగా మారింది.
ఇటువంటివి చెప్పుకొన్నప్పుడు రాహుల్‌పై కొంత సానుభూతి కలగవచ్చు. కానీ అటువంటి అవసరమేమీ లేదు. ఆ మాట అనేందుకు తగిన కారణాలున్నాయి. పైన చెప్పుకొన్నట్లు 2004–14 మధ్య పదేళ్ల కాలంలో ప్రతికూల పరిస్థితులు పరిమితమే అయి, తన పరీక్షలు కూడా పరిమితమే అయి, తన మాటకు పార్టీలో ఎంత మాత్రం ఎదురు లేకుండా ఉండినప్పటికీ, ఆయన తన నాయకత్వ సమర్థతను రుజువు చేసుకోలేక పోయారు. పార్టీ పరిస్థితి క్రమంగా క్షీణిస్తూనే పోయింది.
పార్టీ ఆయా వర్గాలకు ఎటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ విధానాల వల్ల; అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి ఆచరణ వైఫల్యాల వల్ల దూరమవుతూ వస్తున్నది? ఆ పరిస్థితి మారాలంటే ఏమేమి చేయాలి? అనే అధ్యయనాలు, ప్రణాళి కలు ఆయనకు ఎప్పుడూ లేకపోయాయి. మౌలికంగా అవి ఉండి ఉంటే, 2014లో కాంగ్రెస్ ఓడి బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించే పరిస్థితి ఎదురైనప్పుడు, ఇతరత్రా పైన పేర్కొన్న లోటుపాట్లు ఉండినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం ‘సొంత గుడిసె’ వేసేందుకు సమ కట్టగల స్థితిలో ఉండేవారు.
యూపీఏ ఉన్నట్టేనా?
అది రాహుల్ గాంధీలో మౌలికంగా లేనందువల్లనే 2014 నుంచి ఇప్పటివరకు ‘సొంత గుడిసె’ వేయలేక పోవటమే గాక, ‘ఊరంతటికీ వేసే ప్రయత్నాలు’ సహజంగానే నెరవేరటం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ వరుసగా మూడవసారి ఓడిపోయింది. కేవలం మూడు రాష్ట్రాలలో అధికారాన్ని నిలుపుకొన్నది. యూపీఏ కూటమి గత లోక్‌సభ ఎన్నికలలో మంచి ఫలితాలను సాధించి కూడా కేవలం తన వల్ల అంతలోనే గందరగోళంగా మారింది.
దాని అజెండా ఏమిటో అర్థం కావటం లేదనీ, ఎన్నికల తర్వాత తిరిగి ఒక్క సమా వేశమైనా జరగలేదనీ, ఇక తమకు దానితో నిమిత్తం లేదనీ, ఒంట రిగా పోటీ చేయగలమనీ, రాహుల్ అధికారంతో వ్యవహరిస్తున్నా రనీ కొందరు భాగస్వాములు ప్రకటించగా... అసలు ఆ కూటమి అన్నదే ఇక లేదని సీపీఎం నాయకుడు ప్రకాశ్ కారత్ వంటివాడు స్పష్టం చేశారు.
ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీ నుంచి స్పందనలు లేక పోగా, కొందరిని బయటకు పంపేట్లు తానే వ్యవహరించారు. కొత్తగా ఒక్క పార్టీ అయినా దగ్గరకు రాలేదు. అట్టహాసపు యాత్ర లేవో చేస్తున్నా, ఆ నినాదాలు ఒక స్థాయిలో మంచివే అయినా, సాధారణ ప్రజల సమస్యలకు, వాటికి సంబంధం ఉండటం లేదు.
ఈ విధమైన 21 సంవత్సరాల (2004–25) నేపథ్యాన్ని, 11 సంవత్సరాల (2014–25) నేపథ్యాన్ని పరిగణించినప్పుడు, రాహుల్ గాంధీ ‘సొంత గుడిసె’ను గానీ, ‘ఊరికి గుడిసె’ను గానీ వేయలేక పోవటంలో ఆశ్చర్యం లేదు; హరియాణా, మహారాష్ట్ర,ఢిల్లీతో మొదలైన పరాభవం ఇపుడు బిహార్‌లోనూ కొనసాVýæడంలో ఆశ్చర్యపడేది ఏమీలేదు.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


