సాయుధ పోరాటంలో తొలి అమరుడు | Guest Column Article On The Occasion Of Doddi Komuraiah's Death Anniversary | Sakshi
Sakshi News home page

సాయుధ పోరాటంలో తొలి అమరుడు

Jul 3 2026 1:19 PM | Updated on Jul 3 2026 1:19 PM

Guest Column Article On The Occasion Of Doddi Komuraiah's Death Anniversary

ఇన్‌ బాక్స్‌

దొడ్డి కొమురయ్య

తెలంగాణ సాయుధ పోరాటం దొడ్డి కొమరయ్య ప్రాణత్యాగంతోనే మొదలయ్యిందనడం అతిశయోక్తి కాదు. అప్పటి గ్రామీణ తెలంగాణలో జీవితం అంటేనే వెట్టిచాకిరి. భూమి మీద హక్కు దొరలది, శ్రమ మాత్రం రైతులది. కడవెండిలో దేశ్‌ముఖ్‌ రాపాక రాంచంద్రా రెడ్డి, అతని తల్లి జానమ్మ ఆధిపత్యం ప్రజల జీవితాలను కట్టుబానిసత్వంలోకి నెట్టాయి. ఈ అన్యాయాలపై గళమెత్తినవాడు కొమురయ్య అన్న దొడ్డి మల్లయ్య. ఆ గళం చుట్టూ ప్రజలు కూడబలుక్కునేసరికి, అది ఉద్యమంగా మారింది.

ఆంధ్రమహాసభ ప్రభావంతో కడవెండి గ్రామం ఒక చిన్న విప్లవ కేంద్రంగా మారింది. ‘భూమి, భుక్తి, వెట్టి విముక్తి’ అనే నినాదం మార్మోగింది. యువతరం చైతన్యవంతమైంది. దేశ్‌ముఖ్‌ వర్గం ఉద్య మాన్ని అణిచివేయడానికి అరెస్టులు, దాడులు ప్రారంభించింది. 1946 జూలై 4న జరిగిన ఘటన తెలంగాణ చరిత్రను శాశ్వతంగా మార్చింది. ఆ రోజు గడ్డం నర్సింహారెడ్డి నేతృత్వంలో గూండాల గుంపు గ్రామంపై దాడి చేసింది. కానీ భయపడకుండా ప్రజలు ఐక్యంగా ర్యాలీ చేశారు.

ఆ ర్యాలీ ముందు వరుసలో నిలిచిన యువకుడు దొడ్డి కొమరయ్యకు దేశ్‌ముఖ్‌ తొత్తులు పేల్చిన తూటా తగిలింది. అక్కడే నేలకూలాడు. అతడి రక్తం తెలంగాణ రైతాంగ పోరాటానికి ఎరుపు రంగు పూసింది. ప్రజలు రోడ్లపైకి వచ్చారు. దొడ్డి కొమరయ్య పేరు ఒక నినాదంగా మారింది. అతని బలిదానం తెలంగాణ రైతాంగ ఉద్యమానికి దిశానిర్దేశం చేసింది. వేలాది గ్రామాలు నిరంకుశ పాలన నుంచి విముక్తమయ్యాయి. లక్షలాది ఎకరాలు... భూమిలేని పేదలకు పంచిపెట్టడానికి కారణ మయ్యింది. ప్రపంచ విప్లవాల చరిత్రలో తెలంగాణ పోరాటాన్ని అమరం చేసింది. అతను ఈ రోజు కూడా జీవిస్తున్నాడు, ప్రతి ప్రతిఘటనలో, ప్రతి నినాదంలో, ప్రతి సమానత్వ స్వప్నంలో! – మామిండ్ల రమేష్‌ రాజా, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి (జూలై 4న దొడ్డి కొమురయ్య వర్ధంతి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement