రామన్‌ మెచ్చిన ‘భౌతిక’ ప్రతిభ | Dr Suri Bhagavantam Jayanti Special Article | Sakshi
Sakshi News home page

సివి రామన్‌ మెచ్చిన ‘భౌతిక’ ప్రతిభ

Oct 13 2026 8:10 PM | Updated on Oct 13 2026 8:12 PM

Dr Suri Bhagavantam Jayanti Special Article

డాక్ట‌ర్‌ సూరి భగవంతం

సంద‌ర్భం

అది 1928వ సంవత్సరం. కోల్‌కతాలోని ‘ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది కల్టివేషన్‌ ఆఫ్ సైన్స్‌’ పరిశోధనశాలలో ఒక యువకుడు ప్రవేశించాడు. వయసులో చిన్నవాడైనా, అతడు అడిగే ప్రశ్నలు లోతైన పరిజ్ఞానాన్ని, అతని ఆలోచనలు స్పష్టతను ప్రతిబింబించేవి. నోబెల్‌ బహుమతి గ్రహీత సర్‌ సి.వి.రామన్‌ మార్గదర్శకత్వంలో పనిచేస్తూ, ఆ యువ పరిశోధకుడు త్వరలోనే తన గురువును ఎంతగానో మెప్పించాడు. ‘ఫోటాన్‌ స్పిన్‌ యాంగ్యులర్‌ మొమెంటమ్‌’ (కాంతి కణాల భ్రమణం)ను ప్రయోగపూర్వకంగా నిరూపించి భౌతికశాస్త్రంలో సంచలనం సృష్టించాడు. ఆ యువకుడే డాక్ట‌ర్‌ సూరి భగవంతం. తరువాతి కాలంలో భారతదేశపు అగ్రశ్రేణి శాస్త్రవేత్తగా, దేశ రక్షణ పరిశోధనా రంగానికి (డీఆర్‌డీఓ) మూలస్తంభంగా నిలిచారు.

రష్యన్లనూ వశపరచిన శాస్త్ర రచన!
సూరి భగవంతం (Suri Bhagavantam) 1909 అక్టోబరు 14న నాటి కృష్ణా జిల్లా అగిరిపల్లిలో జన్మించారు. హైదరాబాదులోని సిటీ కాలేజి హైస్కూల్, నిజాం కాలేజీల్లో విద్యాభ్యాసం పూర్తిచేసి, ఆ తర్వాత రామన్‌ మార్గదర్శకత్వంలో కాంతి విక్షేపణంపై లోతైన పరిశోధనలు చేశారు. 1932లో కేవలం 22 ఏళ్ల వయసులోనే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా చేరారు. 1938 నాటికి ప్రొఫెసర్‌గా, 1941 నాటికి (31 ఏళ్లకే) యూనివర్సిటీ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎస్‌. వెంకటరాయుడుతో కలిసి ఆయన రాసిన ‘థియరీ ఆఫ్‌ గ్రూప్స్‌ అండ్‌ ఇట్స్‌ ఫిజికల్‌ అప్లికేషన్స్‌’ అనే గ్రంథం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ పుస్తకం రష్యన్‌ భాషతో సహా పలు విదేశీ భాషల్లోకి అనువాదమైంది. 1948–49 మధ్య లండన్‌లోని భారత హైకమిషన్‌లో ‘సైంటిఫిక్‌ లైజన్‌ ఆఫీసర్‌’గా పనిచేసి అంతర్జాతీయ విజ్ఞాన ప్రపంచంతో సంబంధాలను విస్తరించుకున్నారు.

ఇదీ చ‌ద‌వండి: వ‌రస‌గా 4 ఏళ్లు తెలంగాణ‌లో చ‌ద‌వ‌నందుకు..

1952లో, 42 ఏళ్ల వయసులో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉప కులపతిగా నియమితులయ్యారు. విద్యా, పరిశోధన రంగాలను ప్రోత్సహిస్తూ, జాపాల్‌–రంగపూర్‌ పరిశీలనాకేంద్రం (అబ్జర్వేటరీ) అభివృద్ధికి, 48 అంగుళాల టెలిస్కోప్‌ ఏర్పాటుకు పునాది వేశారు. 1957లో బెంగళూరులోని ప్రతిష్టాత్మక ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ సైన్స్‌’ (ఐఐఎస్‌సీ) డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం దేశ రక్షణ పరిశోధనా రంగంలో మొదలైంది. 1961 జులై 1న రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా, డీఆర్‌డీఓ డెరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్, డీఎమ్‌ఆర్‌ఎల్‌లతో పాటు విశాఖపట్నంలోని ఎన్‌ ఎస్‌టీఎల్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటుకు, బలోపేతానికి ఆయన వేసిన పునాదులే ఆ తర్వాత భారత క్షిపణి, లోహ పరిశోధనా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు బాటలు పరిచాయి.

నేటి తరానికి స్ఫూర్తిదాయకం
ఆయనకు తెలుగు, సంస్కృత భాషలపై అద్భుతమైన పట్టు ఉండేది. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఆయన సైన్స్‌ సేవలను కొనసాగించారు. ‘కోస్టెడ్‌’ వంటి అంతర్జాతీయ వేదికల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సైన్స్ అండ్‌ టెక్నాలజీ ఫలాలను తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేశారు. 1989 ఫిబ్రవరి 6న డాక్ట‌ర్‌ భగవంతం కన్నుమూశారు. ప్రతిభకు అవకాశం తోడవ్వాలి... కానీ ఆ ప్రతిభ సమాజానికి, దేశానికి ఉపయోగ పడినప్పుడే దానికి సార్థకత లభిస్తుందనేది ఆయన జీవితం నేటి తరానికి ఇచ్చే సందేశం. ఆశయానికి దేశభక్తి తోడైతే తరతరాలకు ఉపయోగపడే వ్యవస్థలను నిర్మించవచ్చని నిరూపించిన మహనీయుడాయన.

- గుండా శ్రీనివాస్‌ 
వ్యాసకర్త సీనియర్‌ అధికారి, పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌టేకింగ్ ఫెలో మెంబర్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ 
ఇండియా

(అక్టోబ‌ర్ 14న‌ డాక్ట‌ర్‌ సూరి భగవంతం జయంతి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement