అక్టోబరు 8.. బహుముఖ ప్రజ్ఞాశాలి అడివి బాపిరాజు జయంతి
‘బావా బావా పన్నీరు’ పాట ఓ తరాన్ని ఊపేసింది. దీన్ని రాసింది అడివి బాపిరాజు. ఆయనని ఒక్క పదంలో కుదించలేము, ఒక్క కళకు పరిమితం చేయలేము. ఆయన తెలుగువారి రవీంద్రనాథ్ టాగూర్. కథ, కవిత, సంగీతం, నాటకం, చిత్రకళ, నవల... ఇలా సకల రంగాల్లోనూ ఆయన తన అపారమైన ప్రజ్ఞను ప్రదర్శించారు.
బాపిరాజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో 1895 అక్టోబర్ 8న జన్మించారు. మద్రాస్ లా కాలేజ్‌లో బి.ఎల్ పట్టాను పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించారు. 1934 నుండి 1939 వరకు బందరు నేషనల్ కాలేజీలో అధ్యాపకునిగా పనిచేశారు.
1944లో హైదరాబాదు నుండి వెలువడే తెలుగు దినపత్రిక ‘మీజాన్’ సంపాదకునిగా పనిచేశారు. తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నారు. ‘నవ్య సాహిత్య పరిషత్’ స్థాపించిన వారిలో బాపిరాజు ఒకరు. ఆయన చిత్రించిన చిత్రాలలో ‘సముద్ర గుప్తుడు’, ‘తిక్కన’ ప్రసిద్ధమయ్యాయి. విశ్వనాథ సత్యనారాయణ గేయ సంపుటి ‘కిన్నెరసాని పాటలు’ బాపిరాజు చిత్రాలతో వెలువడింది. 1922లో సహాయ నిరాకరణ ఉద్యమంలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. తన జైలు జీవితానుభవాలను ‘తొలకరి’ నవలలో పొందుపరచారు. ‘నవరంగ’ సంప్రదాయ రీతిలో బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రించారు. బాపిరాజు చిత్రించిన ‘శబ్ద బ్రహ్మ’ చిత్రం డెన్మార్క్ ప్రదర్శనశాలలో ఉంది.
బాపిరాజు నవల ‘నారాయణరావు’కు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది. ‘తుఫాను’, ‘కోనంగి’ వంటి సాంఘిక నవలలు సరే; ‘హిమబిందు’ వంటి చారిత్రక నవలల వైపు కూడా దృష్టి సారించారు. ఆ దారిలో ఆయన చేసిన ఉత్కృష్ట రచన ‘గోన గన్నారెడ్డి’. కాకతీయ పరిపాలనను నేపథ్యంగా తీసుకుని, విశేష పరిశోధనతో మరుగునపడ్డ గాథను ముందుకు తెచ్చి తెలుగువారికి ఆయన పరిచయం చేసిన అద్భుతమైన వీరుడు గోన గన్నారెడ్డి. ‘అంజలి’, ‘తరంగిణి’, ‘రాగమాలిక’ వంటి కథాసంపుటాలు, ‘గోధూళి’, ‘శశికళ’ వంటి కవితా సంపుటాలు; జలవర్ణ చిత్రాలు, తైలవర్ణ చిత్రాలు... క్షణం విశ్రాంతి ఎరగక ఆయన సృజనలోకంలో మునిగితేలారు. 1952 సెప్టెంబరు 22న ఈ లోకాన్ని వీడారు.
– ఎం. రాంప్రదీప్, జేవీవీ సభ్యులు, తిరువూరు


