సాహు మహారాజ్
శూద్ర, అతి శూద్ర కులాల అస్తిత్వమే భారతదేశ అస్తిత్వమనీ, ఆ వర్గాల విముక్తే దేశ విముక్తి అనీ, వారి హక్కులే పౌరసమాజం హక్కులనీ కొల్హాపూర్ సంస్థానాధీశుడు సాహు మహారాజ్ తేల్చి చెప్పారు. ఆయనే దేశంలో తొలి సారిగా కింది కులాలకు రిజర్వేషన్లను ఇచ్చి బహుజన రిజర్వేషన్ల పితామహు డిగా చరిత్రలో నిలిచిపోయారు.
మహాత్మా జ్యోతిబాఫూలే ఆలోచనలకు ఆచరణాత్మక ప్రయోగశాలగా కోల్హాపూర్ సంస్థానాన్ని ఆయన తీర్చిదిద్దారు. బుద్ధుడు, కబీర్, జ్యోతిబాఫూలేల ఆలోచనలు ఆయన్ని బాగా ప్రభావితం చేశాయి. డా‘‘ బాబాసాహెబ్ అంబేడ్కర్ చదువుకు సాయం చేయడంతోపాటు ఆయన స్థాపించిన ‘మూక్ నాయక్’ పత్రికకు కూడా వెన్నుదన్నుగా నిలిచారు. అంబేడ్కర్ ఆలోచనలతో దేశంలో దళిత బహుజన సూర్యోదయం జరుగుతుందని 106 ఏళ్ల క్రితమే 1920 మార్చి 22న జాగిర్థారీ మాగాణంలో జరిగిన ‘దక్కన్ అçస్పృశ్య సమాజ సమ్మేళన సభ’లో సాహూజీ ప్రకటించారు. 1918లోనే వెట్టిపని చేసే తలారీ వ్యవస్థను రద్దుచేసి రాజదర్బా రుల్లో దళితులకు ఉద్యోగాలిచ్చే ఉత్తర్వులిచ్చారు. మహర్లకు ఇనాంగా ఇచ్చిన భూములకు వారి పేరుననే పట్టాలు ఇచ్చారు.
మరాఠాల బావిలో మంచినీళ్లు తోడుకున్నందుకు దళితుడు గంగారాం కాంబ్లేపై దొంగతనం నేరం ఆరోపించి నడివీధిలో కొరడా దెబ్బలు కొట్టి అవమానించిన విషయం సాహూజీ దృష్టికిరాగానే... దళితుణ్ణి కొట్టిన వ్యక్తిని పిలిపించి అతనివీపు ఎర్రబడేటట్లు కొరడాలతో కొట్టించారు. గంగారాం కాంబ్లే ఆత్మగౌరవాన్ని కాపాడటమే కాకుండా ఆర్థికంగా అతను నిల దొక్కుకునేందుకు హోటల్ పెట్టేందుకు సాయంచేశారు. ఆ హోటల్‌కు తానే స్వయంగా వెళ్లి టీ తాగివచ్చారు. కులాధిపత్య గోడలు బద్దలు కొడుతూ కులాంతర వివాహాలను ప్రోత్సహించారు. ‘వితంతు వివాహచట్టం’ తెచ్చారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 8 దశాబ్దాలు కావస్తున్నా సగం దేశానికి చట్ట బద్ధ రిజర్వేషన్లు లేవని ఎగుస్తున్న ఉద్యమాలకు ఆయన ఆలోచనలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. సగానికిపైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవటం వల్లనే వారి ప్రాతినిధ్యం పార్లమెంటు, అసెంబ్లీలలో అతితక్కు వగా ఉంది. రాజ్యాంగ సవరణచేసి బీసీలకు జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఉద్యమాలు రగులుకుంటున్న సందర్భంలో సాహూజీని స్మరించుకుంటూ భారత పాలకులు బీసీల చట్టబద్ధ రిజర్వేషన్లకోసం రాజ్యాంగ సవరణ చేయాలి. 1902 జూలై 26న దేశ చరిత్రలో మొదటిసారిగా వెనుకబడిన వర్గాలకు 50% రిజర్వేషన్లు ఆయన కల్పించారు. బీసీ విప్లవానికి పాటుపడేవారు సాహూజీ స్ఫూర్తితో ముందుకు అడుగులు వేయాలి. – జూలూరు గౌరీశంకర్, బహుజన ఉద్యమకవి (జూన్ 26న ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి)


