బాబు వారి అవినీతి చరితము | Sakshi
Sakshi News home page

బాబు వారి అవినీతి చరితము

Published Sat, Nov 11 2023 5:03 AM

Chandrababu Corruption - Sakshi

కోర్టు తీర్పుల వలన లభించిన ప్రోత్సాహంతో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్ర బాబు నాయుడు మరీ బరితెగించాడు. భార్య, కొడుకు పేర్లతో వందల కోట్ల రూపాయల విలువగల భూ క్రయ, విక్రయాలు కొనసాగించాడు. చివరకు రెండెకరాల ఆస్తి మాత్రమే కలిగిన వృద్ధురాలైన తన తల్లి అమ్మణ్ణమ్మను కూడా ఈ అవినీతి జాబితాలోకి లాక్కొచ్చాడు. ఆమె హైటెక్‌ సిటీ దగ్గర 35 లక్షలకు 5 ఎకరాల భూమిని కొని, దానిని ఆస్తిపరుడైన మను మడికి కానుకగా ఇచ్చిందంటే నమ్మే విషయమేనా?

కోల్పోయిన ‘ట్రస్ట్‌’
1995లో ముఖ్యమంత్రి పదవి చేపట్టి వారం రోజులు పూర్తి కాకుండానే మాదాపూర్‌లో ఒక ప్రభుత్వ అధీన సంస్థకు చెందిన 140 ఎకరాల భూమి, ఆ తరువాత అదే సంస్థకు చెందిన మరో 18 ఎకరాల భూమిని ఎల్‌ అండ్‌ టీ కంపెనీకి స్వాధీనం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించడం వెనుక పెద్ద గూడుపుఠాణియే జరిగింది. ఆ కంపెనీ అధిపతి రామకృష్ణకూ, చంద్రబాబు నాయుడికీ ఉన్న సాన్నిహి త్యంతో అదే ఎల్‌ అండీ టీ కంపెనీ భాగస్వామ్యం గల ప్రయివేటు సంస్థకు కాకినాడ రేవును అప్పగించాడు. 1,500 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు ఎల్‌ అండ్‌ టీ కంపెనీకి అందాయి. దాని ఫలితంగా బంజా రాహిల్స్‌లో ‘హుడా’ వారు మార్కెట్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలనుకున్న స్థలాన్ని స్వాధికారికంగా తనకు తనే అప్లికేషన్‌ పెట్టుకొని, ఆ స్థలాన్ని పొంది, ఇదే ఎల్‌ అండ్‌ టీ కంపెనీ రామకృష్ణ గారి దయతో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనాన్ని నిర్మించిన మాట వాస్తవం కాదా?

బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12 ‘వెంకటేశ్వర కో–ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ’ పేర ఉన్న భవనం, పంజాగుట్టలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ ప్రధాన కార్యాలయ భవనం, లెక్కల్లో చూపని ఆస్తులు. ప్రైవేట్‌ పవర్‌ ప్రాజెక్టుల కుంభకోణాలలో చంద్రబాబు సహాయం పొందిన ఒక కంపెనీ యాజమాన్యం పంజాగుట్ట భవన పునర్నిర్మాణానికి 2, 3అంతస్తులు పెంచటానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇంకా ఇతర ఆస్తులు: నల్లగొండ జిల్లా ఎమ్‌.డి.ఎల్‌. యల్లారెడ్డి గూడలో 19 సెంట్ల భూమి, ఎసి.ఓ. కొత్తగూడ, శేరిలింగంపల్లి మండలం ఆర్‌ఆర్‌ వద్ద 19 ఎకరాల భూమి, తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌ సమీపంలోని టెన్నార్‌ కుప్పం గ్రామంలో 2.23 ఎకరాలు, మాదాపూర్‌లోని శ్రీరామ అగ్రికల్చరల్‌ ఫామ్‌లో 3.28 ఎకరాలు, వివిధ కంపెనీలలో రూ. 1 కోటీ 12 లక్షల 31 వేలు – ఇవన్నీ అతను ప్రకటించిన ఆస్తులే. ఇవి కాక శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి, మాదాపూర్‌ ప్రాంతాల్లో సుమారు 25, 30 రిజిస్ట్రేషన్‌ పత్రాల ద్వారా చంద్రబాబు అతని కుటుంబ సభ్యులు, సమీప బంధువులు వ్యాపార లేదా అవినీతి వాటాదారులు ఎన్నో స్థలాలను కొన్నారు. ఈ భూముల విలువ పెంచటానికి చంద్రబాబు ప్రజాధనంతో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి ఆ స్థలాల ధరలను పెంచుకున్నాడు. 

ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను తన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి భూతాల గృహంగా మారిన రామకృష్ణ స్టూడియోను అద్దెకు తీసుకోవ టానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో, ప్రభుత్వం తరఫున ఉన్న రేట్ల కంటే రెట్టింపు కిరాయికి తీసుకొని నెలకు 12 లక్షల ప్రభుత్వ ధనాన్ని చెల్లించాడు. ఏ మాత్రం సౌకర్యాలు లేని ఆ స్టుడియోలోకి ‘స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌’ కార్యాలయాన్ని బలవంతంగా బదిలీ చేయించి అధికారులు, సిబ్బంది, విజిటర్స్‌ను ఎన్నో ఇబ్బందులకు గురిచేశాడు.

వెయ్యి పేజీల పుస్తకమే!
ఆ సమయంలో వివిధ పథకాలకు కేటాయించిన నిధుల్లో ఎక్కువ శాతం మాయమైపోయి ప్రజలకు, నిరుపేద దళిత విద్యార్థులకు అర కొరగా మాత్రమే లభించాయి. పనికి ఆహార పథకం కింద బియ్యం, స్టేషనరీ కొనుగోలులో కోట్లాది రూపాయలు గల్లంతయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్‌ బ్రూవరీస్‌ ప్రభుత్వ సంస్థకు మద్యం విక్రయించే ఉత్పత్తి దారులు, ఇతర రాష్ట్రాల్లో అమ్మే ధర కంటే ఏపీలో ఎక్కువ ధరకు పెంచి, ఆ లాభాల్లో చంద్రబాబుకు వాటా ఇచ్చేవారు. విద్యుత్‌ సంస్థల్లో కూడా అధిక ధరలకు అవకాశం ఇచ్చి వారిచ్చే లంచాలకు ఆశపడేవాడు. ఇక ఇతని బినామీలుగా మురళీ మోహన్, సీఎం రమేశ్‌ ప్రసిద్ధి చెందారు.

ఇతని దారుణాలు ఇంకా చాలా ఉన్నాయి. అబ్బో... ‘నారా’వారి అవినీతి చరిత్ర 1,000 పేజీల పుస్తకం అవుతుంది. దేవాలయ భూములు కోట్ల రూపాయల విలువ చేసేవి లక్షల రూపా యలకు అక్రమంగా విక్రయం అవుతున్నట్లు ఆనాడు చిన్నజీయర్‌ స్వామి వంటి వారే ఆరోపించారు. ఈ అక్రమ సంపాదనంతా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు విరాళాల రూపంలో అందేది. అలాగే సిమెంట్‌ ఉత్పత్తి దారులు, స్టీలు, ఇసుక, కంకర వ్యాపారులకు ధరలు అధికంగా పెంచు కోవటానికి అనుమతినిచ్చి వారినుండి పెద్ద స్థాయిలో ముడుపులు తీసుకునేవాడు. చివరకు వ్యవసాయదారుల నోట్లో మట్టికొట్టే విధంగా ఎన్నో కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్మే సంస్థలకు అనుమతినిచ్చి వారి నుండి భారీగా డబ్బు వసూలు చేసేవాడు.

దానివలన మోసపోయిన రైతులు సరిగా పంటలు పండక అప్పులపాలై చివరకు కొన్ని వేలమంది ఆత్మహత్యలకు పాల్పడితే నామమాత్రపు పరిహారాన్ని ప్రకటించి దానిని కూడా ‘కడతేరని కష్టాలు కాదు, కడతేరితే ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం’ అంటూ అమానవీయంగా ప్రకటన చేయించాడు. ఇతని హయాంలో అంటే 1998–99లో ఒక్క వరంగల్‌ జిల్లాలోనే 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కార్పొ రేట్‌ వ్యవసాయం పేరుతో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశాడు. ఇతని హయాంలోనే ఎంతోమంది చేనేత కార్మికులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. కరెంటు లేక, పొలాలకు నీళ్ళందక లక్షల హెక్టార్లలో పైరులు ఎండిపోయాయి. అడిగినవాళ్ళను కాల్పించి తప్పించాడు. అందుకే ‘తెలంగాణ వాదం’ మరొక్కసారి ఊపిరి పోసుకుని ఉద్యమించింది.

తన కోసమే జనమనే అహంకారం
ఇప్పటికీ ఇతనికి కనువిప్పు జరగలేదు. ‘తన కోసమే జనం తప్ప, జనం కోసం తాను కాదనే’ అహంకారాన్ని పెంచుకున్నాడు. ఎన్ని పరాభవాలు జరిగినా ఇప్పటికీ అతని అవివేకపు కార్యక్రమాలు మానలేదు. ఇతడి వలన తెలుగుజాతి, తెలుగుదేశం పార్టీ పరువు దిగజారిపోయాయే తప్ప దేశ చరిత్రలో గొప్ప స్థానం పొందిన పథకం ఒక్కటీ రూపొందలేదు. పైగా, తెలుగు రాష్ట్రం మీద కొంచెం కూడా అవగాహన లేని ఇతడు విదేశాల మీద మోజుతో ప్రతి విదేశీ పథ కాలను ప్రస్తావించేవాడు. ఉదాహరణకు మాన్యుఫాక్చరింగ్‌ పరిశ్రమకు జర్మనీ, జపాన్‌లను, ఇన్ఫర్మేషన్‌కు ఇజ్రాయేల్‌ను అస్తమానం పొగుడుతూ సొంత రాష్ట్రాన్ని మట్టికరిపించాడు.

ఎప్పుడు ఇతను అధికా రానికొచ్చినా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచటమే. ఆర్థికంగా, రాష్ట్రాన్ని దివాళా తీయించడం, అప్పులు చెల్లించలేనంత ఆర్థిక దుఃస్థితిలో ఉంచటం పరిపాటిగా మారింది. విపరీతమైన ధనకాంక్షతో హద్దుమీరి ప్రజాధనాన్ని లూటీ చేసి విదేశాలలో వ్యాపారాల మీద పెట్టుబడులు పెట్టాడు. 2004లో ఇతను దిగిపోయే నాటికి అతని ఆస్తులు లక్ష కోట్లకు చేరినాయని అంచనా. ఇక 2014లో ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని ఎలా లూటీ చేశాడో మొత్తం అవినీతి చరిత్రంతా ఆంధ్రప్రదేశ్‌ ‘సీబీసీఐడీ’ వారు సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందుంచారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి గారు అసెంబ్లీలో వాటి వివ రాలను ప్రెజెంట్‌ చేయడం జరిగింది.

అవినీతి, అక్రమాల్లో ఆరితేరినవాళ్లంతా అనుయాయుల రూపంలో, అధికారుల రూపంలో ఇతని వెంటే ఉంటారు. వాళ్ళు పట్టుబడినా శిక్షలు ఉండవు. దొంగ నోట్లు ముద్రించిన రామకృష్ణ గౌడ్, కృషి బ్యాంక్‌ ద్వారా ప్రజల్ని మోసం చేసిన వెంకటేశ్వరరావు, విద్యార్థి స్కాలర్‌ షిప్పులను మాయం చేసిన వారు, పేదవాడి పనికి కూలీగా ఇచ్చిన బియ్యాన్ని లారీలు లారీలు అమ్ముకున్న పెద్ద మనుషులు, హత్యల్లో, బాంబు పేలుళ్లలో ప్రసిద్ధి చెందినవారంతా ఇతని అనుచరగణమే.
ఏ శిక్షలూ ఉండవు. డబ్బు సంపాదించు, ఎన్నికల్లో గెలువు... ఇక వేరే పాపపుణ్యాల సంగతి నీకెందుకు – ఇదే ఆయన పార్టీ వారికి ఇచ్చిన గొప్ప సందేశం.

అదొక చీకటి యుగం
అలాగే ఇతని 2020 విజన్‌ గమనిస్తే తెలుగు రాష్ట్రాల పరిస్థితులు భౌగోళిక స్థితులు ఏ మాత్రం అవగాహన లేనట్లు కన్పిస్తుంది. మొత్తం ఇతని పరిపాలనా కాలమంతా విదేశీ పొగడ్తలతోనే సరిపోయింది. స్వార్థపరత్వం, పదవీ లాలస, అవినీతి... ఇతని సహజ లక్షణాలు. 14 సంవత్సరాల ఇతని పాలనా కాలమంతా ఆంధ్ర రాజకీయ చరిత్రలో ఒక చీకటి యుగంగా పరిగణించవచ్చు. ప్రతి వ్యవస్థలో తన వ్యక్తులను ప్రవేశపెట్టి, కోర్టులను సైతం పక్కదారి పట్టించి, వచ్చిన కేసులన్నీ విచారణకు రాకుండానే కొట్టి వేయించుకోవడం ఇతనికే సాధ్యపడిన గొప్ప కళ. జస్టిస్‌ బీఎస్‌ఏ స్వామి గారు తాను రాసిన ‘ఎ కాస్ట్‌ క్యాప్చర్స్‌ ఏపీ
జ్యుడీ షియరీ’ అనే పుస్తకంలో చంద్రబాబుకూ, న్యాయమూర్తులకూ ఒక మాజీ న్యాయమూర్తిæ అనుసంధానకర్తగా వ్యవహరించారు అని రాశారు. దీనిని బట్టే అర్థమౌతున్నది కదా, ఇతని కేసులన్నీ ఎందుకు పక్కదారి పట్టాయో! ఇతని హయాంలో మీడియాకు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వబడ్డాయి.ఒక్క ‘ఆంధ్రజ్యోతి’కే 750కోట్లు ఇచ్చాడంటేనే మీడియానెంతగా జేబులో పెట్టుకున్నాడో అర్థమౌతున్నది.

ఇతని దరిద్రపు పాలనలో ఎన్నో పెద్ద పరిశ్రమలు మూత బడ్డాయి. పేద విద్యార్థులు పై చదువులకు దూరమయ్యారు. ఇతను ప్రోత్సహించిన ప్రయివేటు విద్యాసంస్థలు ఇతనికి ముడుపులు చెల్లిస్తూ భారీ ఫీజులు పెంచి విద్యార్థులను పీడించాయి. చివరకు కోలా కృష్ణమోహన్‌ వంటి ‘యూరో లాటరీ’ మోసగాడి నుండి కూడా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు 10 లక్షల విరాళం తీసుకున్నాడంటే ఎంత దిగజారుడు మనస్తత్వమో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటివరకు రాసిందంతా 2004 ఎన్నికల ముందు వరకు ఈ దేశంలో సంపాదించిన అక్రమాస్తులను గురించి. ఇంకా సింగపూర్, మలేషియా, మారిషస్, దుబాయ్, స్విట్జర్లాండ్, అమెరికాలో ఉన్న ఆస్తుల వివరాలన్నీ వేరే. ఇన్నాళ్ళకైనా అతని పాపాలు, అవినీతి చిట్టాలు బయటకు రావటానికి కారణమైన కేంద్ర సంస్థలు ఐటీ, ఈడీలకూ, రాష్ట్ర సీఐడీ వారికీ, ధైర్యంతో ఎన్నికలను కూడా లెక్క చేయకుండా ఈ కేసుల్ని బయటకు తీసుకురావటంలో సహకరించిన ముఖ్యమంత్రి, గౌరవ నీయులు జగన్‌ మోహన్‌ రెడ్డి గారికీ ఈ రాష్ట్ర ప్రజలు కృతజ్ఞతలు చెప్పుకోవలసి ఉంది. 2014 నుండి 2019 వరకు అతడు చేసిన అవినీతి పనులు, సంపాదించిన దాదాపు 6 లక్షల కోట్ల ధనం మీద ఇప్పుడు విచారణ మొద లైంది గనుక ప్రజలందరికీ అవి అందుబాటులో ఉన్నాయని రాయటం లేదు. ప్రజలందరూ అర్థం చేసుకోగలరు. 

-వ్యాసకర్త ఆంధ్రపదేశ్‌ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌ 

ఇదీ చదవండి: నేడు రాష్ట్రానికి మోదీ

Advertisement
 
Advertisement
 
Advertisement