న్యాయపీఠంపై మహిళా తేజం | Women selected for Telangana High Court junior civil judge posts | Sakshi
Sakshi News home page

న్యాయపీఠంపై మహిళా తేజం

May 3 2025 3:24 AM | Updated on May 3 2025 10:08 AM

Women selected for Telangana High Court junior civil judge posts

‘నాన్న జడ్జి. చెల్లి కూడా జడ్జే. వారే నాకు స్ఫూర్తి’ అంటుంది నిఖిషా. జడ్జి కావాలనేది కీర్తన హైస్కూల్‌ నాటి కల. ‘మా కుటుంబం, బంధువులలో న్యాయవాదులు, జడ్జీలు ఎవరూ లేరు. అందుకే జడ్జి కావాలనుకున్నాను’ అంటుంది మధులిక. ‘పట్టుదల గట్టిగా ఉంటే తొలి ప్రయత్నంలోనే బ్రహ్మాండంగా విజయం సాధించవచ్చు’ అంటుంది సాహితి....

తెలంగాణ హైకోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్ట్‌లకు ఎంపికైన విజేతలు వీరు. న్యాయమూర్తి కావాలనుకోవడానికి వారికి స్ఫూర్తి వేర్వేరుగా ఉండవచ్చు. అయితే పడిన కష్టం మాత్రం ఒక్కటే. ‘న్యాయవ్యవస్థలో ఉన్నత స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి’ అని జాతీయ స్థాయిలో నివేదికలు నొక్కి చెబుతున్న నేపథ్యంలో ఈ మహిళల విజయం... ఆశా కిరణం  – అరవింద్‌ గండ్రాతి, ‘సాక్షి’ నెట్‌వర్క్‌

1. ఎన్నో సవాళ్లు... అయినా సరే...
న్యాయవాది కావాలనేది నా చిన్నప్పటి కల. జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టుకు ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. మధ్యతరగతి కుటుంబాల్లో ప్రత్యేకంగా స్టడీ రూమ్స్‌ లేకపోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఏకాంతంగా చదువుకునే అవకాశం ఉండదు. లైబ్రరీలలో రాత్రి ΄÷ద్దుపోయే వరకు చదువుకునే వీలు అమ్మాయిలకు ఉండదు. మెటీరియల్‌ కలెక్ట్‌ చేసుకోవడం నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రిపేర్‌ కావడం వరకు...పేద, మధ్యతరగతి అమ్మాయిలకు ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే లక్ష్యాన్ని మాత్రమే చూస్తే ఆ సమస్యలు కనిపించవు. – గంగిశెట్టి ప్రసీద, వరంగల్‌ సిటీ

2. పుట్టెడు దుఃఖంతో... తిరుగులేని పట్టుదలతో...
తెలంగాణ ఉద్యమంలో నర్సంపేట పట్టణం నుండి ముందు వరుసలో ఉండి ఉద్యమాన్ని నడిపించారు నాన్న. 2020లో నాన్న హత్యకు గురయ్యారు. నా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నా కాళ్లపై నేను నిలబడి అమ్మకు అండగా ఉండాలనుకున్నాను. నాన్న ఆలోచనలకు అనుగుణంగా ఎల్‌ఎల్‌బీలో చేరినప్పటి నుంచి జడ్జి కావాలనే పట్టుదలతో చదివాను. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం సంతోషంగా ఉంది. – అంబటి ప్రణయ, నర్సంపేట, వరంగల్‌

3. తొలి ప్రయత్నంలోనే... 
‘లక్ష్యం ఏర్పర్చుకున్నప్పుడు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చినా పట్టుదలను వదలవద్దు. జూనియర్‌ సివిల్‌ జడ్జి పరీక్షల కోసం  ప్రిపేర్‌ అయ్యేవారు సొంత నోట్స్‌ తయారు చేసుకోవడమే ఉత్తమం. ఇది ఒక హ్యాపీ మూమెంట్‌. నా పేరెంట్స్‌కు ఒక గిఫ్ట్‌.
– సాహితి, నంగనూరు, సిద్దిపేట జిల్లా (తొలి ప్రయత్నంలోనే, 26 ఏళ్ల వయసులో జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్ట్‌కు ఎంపికైంది)

ఇదీ చదవండి: నా డ్రీమ్స్‌.. కరియర్‌ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా

4.ఉద్యోగం కాదు... బాధ్యత
మా కుటుంబంలో ఎవరూ న్యాయవాదులు, జడ్జిలు లేరు. అదే నన్ను న్యాయమూర్తి కావాలనే లక్ష్యం వైపు నడిపించింది. కొంతకాలం న్యాయవాదిగా చేసిన అనుభవం జేసీజే పరీక్షలో తోడ్పడింది. జడ్జి పోస్ట్‌ అనేది ఉద్యోగం కాదు. విలువైన బాధ్యత.  – డాకన్నగారి మధులిక తేజ, హైదరాబాద్‌

5. చిన్ననాటి కల... తొలి ప్రయత్నంలోనే 
చిన్ననాటి నుంచి జడ్జి అవ్వాలనేది నా కల. నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది.  హైకోర్టు, కరీంనగర్‌ కోర్టుల్లో న్యాయవాదిగా పలు కేసులు వాదించాను. రెండేళ్ల క్రితం నుంచి జేసీజే పరీక్షలకు సిద్ధమయ్యాను. ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండా క్రమపద్ధతిలో పరీక్షల కోసం ప్రిపేర్‌ అయ్యాను. – కట్ట కీర్తన, ఆరెపల్లి, కరీంనగర్‌

జడ్జిల కుటుంబం...
తండ్రి కె. ఖుషా హైదరాబాద్‌ సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టు చీఫ్‌ జడ్జి. చెల్లి భావన మహబూబ్‌నగర్‌లో 4వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి. తాజాగా అక్క నిఖీషా జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్ట్‌కు ఎంపికైంది. తండ్రి, ఇద్దరు కూతుళ్లతో వారిది జడ్జిల కుటుంబంగా మారింది. ఐటీ ఉద్యోగం వచ్చినా చట్టంపై అవగాహన ఉండాలని న్యాయమూర్తి కె. ఖుషా తన కూతుళ్లను న్యాయ విద్య చదివించారు.

అసలైన లక్ష్యం అదే...
కోవిడ్‌ లాక్‌డౌన్  సమయంలో నిఖీషా వర్క్‌ ఫ్రం హోమ్‌ ఉద్యోగంలో చేరింది. ఐటీ రంగంలో అనుభవం కోసం ఉద్యోగంలో చేరింది. అయితే ఆ ఉద్యోగం ఆశించిన స్థాయిలో సంతృప్తి ఇవ్వలేదు. ఆ సమయంలోనే ‘నేను చేయాల్సిన ఉద్యోగం ఇది కాదు’ అనుకుంది. ‘నాన్నలాగే న్యాయమూర్తి కావాలి’ అని తనలో నిద్రాణంగా ఉన్న లక్ష్యంపై దృష్టి పెట్టింది.

మానసిక స్థైర్యం...  హరే కృష్ణ మంత్రం
మెయిన్స్ ఎగ్జామ్స్‌ సమయంలో నిఖీషా తల్లి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇంటర్వ్యూకు ముందు నాన్నకు బై΄ాస్‌ సర్జరీ జరిగింది. కవలబిడ్డలకు అప్పటికి సంవత్సరం కూడా నిండలేదు. ఇలా ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా మానసికంగా కుంగిపోకుండా లక్ష్యాన్ని పదేపదే గుర్తు తెచ్చుకునేది. ‘హరే కృష్ణ మంత్రం జపిస్తూ మానసిక స్థైర్యాన్ని పొందాను. విజయం సాధించాను. మా కుటుంబం నుంచి నేను కూడా న్యాయమూర్తిగా అడుగుపెడుతున్నందుకు ఎంతో గర్వం ఉంది’ అంటుంది నిఖీషా. 

చదవండి : నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్‌ షూస్‌ : ఎవరీ అందాల రాణి?

Advertisement
 
Advertisement
Advertisement