
యంగ్ టాలెంట్
బెంగళూరులో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే ప్రకృతి, మూగజీవులపై పలు డాక్యుమెంటరీలను చిత్రీకరించాడు శ్రీహరి వర్మ(Sagi Sree Hari Varma). మూగజీవులు స్వేచ్ఛగా జీవించడానికి ఎలాంటి పరిస్థితులు కల్పించాలో వివరిస్తూ ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ రూపొందించాడు. మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ ‘పీపుల్స్ ఫర్ యానిమల్స్’ సంస్థలో వాలంటీర్‌గా చేరి మూగ జీవులపై డాక్యుమెంటరీ రూపొందించాడు. మూగ జీవులపై చిత్రీకరించిన షార్ట్ ఫిలిమ్స్‌ను రష్యాలోని విజీఐకె ఫిల్మ్ స్కూల్‌కు పంపిచాడు.
రష్యా ప్రశంసలు
రష్యా ప్రభుత్వం తమ దేశ ప్రగతి, సంస్కృతి, అభివృద్ధిని చాటిచెప్పే షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఐదుగురు యువ దర్శకులను ఎంపిక చేయగా మన దేశం నుంచి శ్రీహరి వర్మకు మాత్రమే ఆ అరుదైన అవకాశం దక్కింది. ఫిఫా వరల్డ్ కప్ పోటీలకు సంబంధించి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను కళ్ళకు కట్టినట్టుగా ‘గో మారడోవియా’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించి రష్యా ప్రతినిధుల నుండి ప్రశంసలు పొందాడు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ‘స్కూల్ ఆఫ్ సినిమా టెక్ ఆర్ట్స్’లో చేరి దర్శకత్వ నైపుణ్యాలపై సంవత్సరం పాటు శిక్షణ పొందాడు. హాలీవుడ్ సినిమా చిత్రీకరణపై అవగాహన పెంచుకున్నాడు. శిక్షణా సమయంలోనే ఐక్యరాజ్య సమితి శాంతి స్థాపన దళాలు (పీస్‌కీపింగ్ ఫోర్సెస్) పై డాక్యుమెంటరీ రూపొందించాడు.
(Prasadam Recipes : వరమహాలక్ష్మీ దేవికి శుచిగా, రుచిగా ప్రసాదాలు)
ఇదీ చదవండి: ఖరీదైన పెళ్లి : 11.5 కిలోల వెడ్డింగ్ గౌను, గోల్డ్‌బాక్స్ రిటన్ గిఫ్ట్స్
ఫస్ట్ ఇండియన్
షార్ట్ ఫిలిమ్స్‌తో మొదలైన శ్రీహరివర్మ ప్రస్థానం ఆస్కార్స్ గోల్డ్ ఫెలోషిప్ వరకు వెళ్ళింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ ప్రతిభావంతులైన దర్శకులను తీర్చిదిద్దేందుకు ఆస్కార్స్ గోల్డ్ ఫెలోషిప్ అందజేస్తుంది. దీని కోసం ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా 20 మంది ప్రతిభావంతులను ఎంపిక చేస్తుంది. ఈ ఫెలోషిప్‌కు 2019లో ఎంపికైన తొలి భారతీయుడుగా అరుదైన గౌరవం దక్కించుకున్నాడు శ్రీహరివర్మ. ఫెలోషిప్‌లో భాగంగా యువ దర్శకులు, ప్రముఖ హాలీవుడ్ దర్శకులతో కలసి పనిచేసే అవకాశం పొందాడు. గేమ్ ఆఫ్‌లైఫ్, హెడ్ అండ్ ఫిగర్స్, అమెరికన్ డ్రీమర్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు టెడ్ మెల్ఫీ దగ్గర శిక్షణ పొందాడు.
చదవండి: తండ్రి కల.. తొలి ప్రయత్నంలోనే ఐఆర్‌ఎస్.. ఐఏఎస్ లక్ష్యం
సినీ–మదమారెలో అవకాశం
ఇటలీలో జరిగిన ఇటాలియన్ ఫిల్మ్ మేకింగ్ ప్రోగ్రామ్ (సినీ మదమారె)లో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీహరివర్మకు అవకాశం లభించింది. ప్రతి ఏటా వివిధ దేశాల నుండి యువ దర్శకుల ప్రతిభను గుర్తించడానికి ఇటాలియన్ ప్రభుత్వం ఈ అవకాశం కల్పిస్తుంది. సిని మదమారెలో శ్రీహరి వర్మ 4 విభిన్న షార్ట్ ఫిలిమ్స్‌ను చిత్రీకరించాడు.
విశాఖ నగరం, మర్రిపాలెంకు చెందిన సాగి శ్రీహరివర్మ షార్ట్ ఫిలిమ్స్‌తో ప్రారంభించి ప్రతిష్ఠాత్మక ఆస్కార్స్ గోల్డ్ ఫెలోషిప్, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ఫిల్మ్ స్కూల్‌లో స్థానం సాధించి శభాష్ అనిపించుకున్నాడు. ఇటీవల ఇటలీలో జరిగిన వేసవి చలన చిత్ర నిర్మాణ కార్యక్రమం (సినీ మదమారె)లో పాల్గొని తన సత్తా చాటాడు...