
ప్యాషన్ యాక్ససరీల్లో లెదర్ బ్రాండెడ్ వస్తువులది ఒక ప్రత్యేక స్థానం. అలాంటి లెదర్ కారణంగా ఎన్నో జంతువులు చనిపోతున్నాయనే విషయం తెలిసిందే. పైగా ఇది పర్యావరణ అనుకూలమైంది కూడా కాదు. దీనికి చెక్‌పెట్టేలా పర్యావరణ హితంగా ఆహార వ్యర్థాలను నివారించే దిశగా ఒక సరికొత్త లెదర్‌ని తీసుకొచ్చారు ప్రితేష్ మిస్త్రీ. ఈ సరికొత్త ఆవిష్కరణతో లెదర్ ప్లేస్‌లో బయోలెదర్‌ని తీసుకొచ్చి..జంతువులకు హాని కలగకుండా కాపాడటమే గాక పర్యావరణ హిత ఫ్యాషన్ ఉపకరణాలకు నాంది పలికారు. ఆయనకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే..
ముంబైకి చెందిన ప్రితేష్ మిస్త్రీకి కాలేజ్‌లో ఇంజనీరింగ్ చదివే సమయంలో ఈ ఆలోచన తట్టింది. అయితే తన చివరి సంవత్సరం ప్రాజెక్టులో భాగంగా ఈ దిశగా ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు. ఆ ఆవిష్కరణ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఆయన బయోలెదర్ కోసం టమాటా వ్యర్థాలనులను వినియోగించారు.
దాని నుంచి తయారు చేసిన లెదర్‌తో బూట్లు, బ్యాగ్లు వంటివి కూడా రూపొందించారు. వీటిని టీబీసీ బ్రాండ్ ఉత్పత్తులుగా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. వాటికి అత్యంత ఆదరణ లభించడమే గాక అందరి ప్రశంసలందుకుంది. అంతేగాదు 2021 పెటా వేగన్ ఫ్యాషన్ అవార్డుల్లో కూడా ఈ టీబీసీ బయోకంపెని ఉత్పత్తులు ఉత్తమ ఆవిష్కరణగా నిలిచాయి.
టమాటాలే ఎందుకు..
టమాటాలను ప్రాథమిక ముడి పదార్థంగా ఉపయోగించి పాలియురేతేన్, పాలీ వినైల్ క్లోరైడ్ వంటి ప్లాస్టిక్ చోటివ్వకుండా బయోలెదర్ సృష్టించాలన్నది మిస్త్రి లక్ష్యం. జంతువులకు కూడా హాని కలిగించకుండా చేయాలన్నది ప్రధాన అజెండా. ఇక అందుకోసం ఈ టమాటాలనే ఎందుకు ఎంచుకున్నారంటే..భారతదేశం ఏడాదికి 44 మిలయన్ల టన్నుల టమాటాలను ఉత్పత్తి చేస్తున్న రెండో అతిపెద్ద దేశం కావడంతో ఈ కూరగాయను ఎంచుకున్నాడు మిస్త్రీ.
అదీగాక ఏటా వాటిలో 30 నుంచి 35% వరకు టమాటాలు వృధా అయిపోతున్నాయి. కాబట్టి ఆ సమస్యకు చెక్‌పెట్టి..పర్యావరణ హితంగా బయోలెదర్ తయారు చేయాలని భావించాడు. అందులోనూ టమాటాలో స్కిన్, విత్తనాలు, పెక్టిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది లెదర్ తయారీకీ అత్యంత అనుకూలం అని తెలిపారు మిస్త్రీ. అలాగే జంతువుల చర్మం నుంచి చేసే లెదర్ తయారీ ఫ్యాక్టీరీల నుంచే వచ్చే కాలుష్యాన్ని కూడా ప్రత్యక్షంగా చూడటంతో ఇలా పర్యావరణ హితంగా, ఆహార వ్యర్థాలను నివారించే బయో లెదర్ తయారు చేయాలనుకున్నట్లు తెలిపారు.
అయితే తాము లెదర్ తయారు చేయగలిగాం కానీ, దాని, ఆకృతి, మనిక పరంగా నెలల తరబడి శ్రమిస్తే గానీ మంచి నాణ్యమైన బయో లెదర్‌కి బీజం పడలేదని వివరించారు. అలాగే సహజ రంగులనే ఉపయోగించేలా కేర్ తీసుకుంటామని చెప్పారు. తమ టీబీసీ కంపెనీ టమాటాలు బాగా పండే గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాలలోని ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల సాయంతో పొలాల నుంచి నేరుగా టమాటా వ్యర్థాలను సేకరిస్తారట. దాన్ని లెదర్ తయారీకి వీలుగా ఉండే వనరుగా మారుస్తారట.
ఆ తర్వాత మొక్కల ఆధారిత బైండర్‌లు, సహజ ఫైబర్‌ల సాయంతో మన్నికైన బయోలెదర్‌ని తయారు చేస్తామని తెలిపారు. ఆకృతి కోసం విషరహిత క్యూరింగ్ చేస్తామని చెప్పారు. అలా 2024 మే నాటికి బయోలెదర్‌తో తయారు చేసిన వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించామని తెలిపారు. ఇంటీరియర్ డిజైన్, ఆటోమెటివ్ పరిశ్రమలకు పనికొచ్చేలా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పైగా ఈ లెదర్ ఆహ్లాదకరమైన వాసనను వెదజల్లుతుందని చెప్పారు. నిజంగా ఇది అలాంటి ఇలాంటి ఆవిష్కరణ కాదు కదా..పర్యావరణం మెచ్చే లెదర్ ఉత్పత్తులు కదూ..!.
(చదవండి: డిజిటల్ డ్యామేజ్..! అంతకంతకు మయోఫియా వ్యాధులు..)