
ప్రస్తుత స్క్రీన్ వినియోగ దోరణులు ఇలాగే కొనసాగితే 2050 నాటికి దాదాపు 50% మంది పిల్లలు
మయోపియాకు ప్రభావితమవుతారని ఆప్తాల్మిక్ – ఫిజియోలాజికల్ ఆప్టిక్స్ అంచనా. వినోదం నుంచి విద్య వరకూ డిజిటల్ స్క్రీన్‌లు వినియోగించడం అనేది నగర రోజువారీ జీవితంలో భాగమవుతోంది. దీంతో చిన్నారుల్లో కంటి సంబంధిత మయోపియా నుంచి డిజిటల్ కంటి ఒత్తిడి, నిద్రలోపాలు, ప్రవర్తనా మార్పుల వరకూ పలు అనారోగ్య సమస్యలు భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు,
క్యూరియస్ జర్నల్ పరిశోధన ఫలితాలను ఉటంకిస్తూ ఇటీవల ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో 50% కంటే ఎక్కువ మంది డిజిటల్ కంటి ఒత్తిడి లక్షణాలను కలిగి ఉన్నారు. వీటిలో అలసట, తలనొప్పి, నిద్ర ఆటంకాలు, మానసిక పరమైన ప్రవర్తనా సమస్యలు ఉన్నాయి. ఇవి దీర్ఘకాలిక ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించిన ఆందోళనలు పెంచుతున్నాయి.
కఠిన పరిమితులు అవసరం..
‘ప్రారంభంలోనే ఆరోగ్యకరమైన స్క్రీన్ అలవాట్లను పెంపొందించడం పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి కీలకం’ అని వైద్యులు చెబుతున్నారు. ‘కఠినమైన స్క్రీన్ సమయ పరిమితిని నిర్ణయించడం అనే అంశానికి తల్లిదండ్రులు కూడా మద్దతు ఇవ్వగలగడం ఆరోగ్యకరమైన మార్పుకు ఒక మార్గం.
విద్యావేత్తలకు స్క్రీన్‌లు అవసరమైనప్పుడు, 20–20–20 నియమాన్ని అనుసరించండి. ప్రతి ఇరవై నిమిషాలకు, ఇరవై సెకన్ల విరామం తీసుకోండి. డిజిటల్ కంటి ఒత్తిడిని తగ్గించడానికి 20 అడుగుల దూరంలో ఉన్న దేనినైనా చూడండి. బ్లూ లైట్ ఫిల్టర్ మోడ్ ఉపయోగించడం కూడా కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది’ అంటూ సూచిస్తున్నారు.
స్క్రీన్ టైం ప్రభావం..
‘ఎక్కువసేపు స్క్రీన్ టైం వాడటం వల్ల పాఠశాల వయసు పిల్లలకు మయోపియా లేదా సమీప దృష్టి లోపం కలుగుతోంది. ఈ మయోపియా వేగంగా అభివృద్ధి చెందడం వల్ల మెల్లకన్ను, పొడి కంటి వ్యాధి, కంటి డిజిటల్ ఒత్తిడి ప్రమాదం ఎక్కువవుతుంది’ అని కంటి వైద్య నిపుణులు అంటున్నారు.
‘స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి విభిన్న రకాల ముప్పును కలిగిస్తుంది. ఫ్రీ రాడికల్స్ కారణంగా రెటీనాకు నష్టం కలిగించడం, మెలటోనిన్‌ను అణచివేయడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. తద్వారా మొత్తం ఆరోగ్యం ప్రభావితం అవుతుందని వివరిస్తున్నారు.