
భారీగా పతనమైన టమాటా, ఉల్లి ధరలు
కిలో టమాటా రూ.2, క్వింటా ఉల్లి రూ.150
తీవ్ర ఆందోళనలో రైతులు
ఇలాగైతే తాము బతికేదెలా? అంటూ ఆవేదన
పత్తికొండ/కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలో టమాటా, ఉల్లి ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కష్టసమయంలో ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం సైతం పత్తా లేకుండా పోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎంతో శ్రమించి పండించిన పంటను తామే పశువులకు వదిలేయాల్సిన పరిస్థితి రావడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు.
కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతంలో ప్రధాన పంట అయిన టమాటా ధర దారుణంగా పతనమైంది. కనీసం కూలీల ఖర్చులు కూడా రావట్లేదు. పత్తికొండ మార్కెట్‌కు రైతులు తెచ్చిన 162 క్వింటాళ్ల టమాటా పంటకు గురువారం సాయంత్రం వేలం నిర్వహించగా.. కిలో రూ.2 మాత్రమే పలికింది. దీంతో రైతులు తీవ్ర మనస్తాపం చెందారు. ఇలాగైతే తాము బతికేదెలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోత ఖర్చులూ రాక..
కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి బస్తాలు భారీగా పేరుకుపోతుండగా.. కోత ఖర్చులు కూడా రాకపోతుండడంతో అనేకమంది రైతులు పొలాల్లోనే పంట దిగుబడులను వదిలేస్తున్నారు. గురువారం మార్కెట్‌కు 14,083 క్వింటాళ్ల ఉల్లి పంట రాగా.. వ్యాపారులు క్వింటా కేవలం రూ.150 చొప్పున 4,755 క్వింటాళ్లను కొనుగోలు చేశారు. గిట్టుబాటు ధరలు రాకపోతుండడంతో రైతులు నష్టాలను మూటగట్టుకొని తీవ్ర ఆవేదనతో వెనుతిరుగుతున్నారు.