ఒక్కటే పంట..ఐదు ఆదాయాల పెట్టు! | Thornless cactus is also suitable for saline soils And Good Income | Sakshi
Sakshi News home page

Sagubadi: ‘5ఎఫ్‌ మోడల్‌’ పంట అంటే ..! ఐదు రకాలుగా ఆదాయమా..?

Sep 24 2025 9:54 AM | Updated on Sep 24 2025 11:48 AM

Thornless cactus is also suitable for saline soils And Good Income

చాలా రకాల పంటలు రైతుకు ఒకే ఆదాయాన్ని ఇస్తుంటాయి. కానీ, 5 రకాలుగా ఆదాయాన్నిచ్చే పంట ఒకటుంది. మరో విశేషం ఏమిటంటే...దీన్ని సాగు చెయ్యటానికి సారం కోల్పోయిన, కరువు ప్రాంతాల్లో బంజరైనా భేషుగ్గా పనికొస్తుంది. ఆ పంట పేరు ముళ్లు లేని బ్రహ్మజెముడు (స్పైన్‌లెస్‌ కాక్టస్‌). క్షీణించిన భూమిలో ‘5 ఎఫ్‌ మోడల్‌’ పంటగా కాక్టస్‌ను పండించడం అంటే.. ఎడారీకరణను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే రైతు కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని సృష్టించటం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నిస్సారమైన  కరువు ప్రాంత భూముల్లో దీన్ని సాగు చేస్తున్నారు. ఇంతకీ ‘5ఎఫ్‌ మోడల్‌’ పంట అంటే ఏమిటి?.. చదవండి...

ముళ్లులేని బ్రహ్మజెముడు ఒకటే పంట.. 5 ప్రయోజనాలు చేకూర్చుతోంది. రైతులకు బహుళ ఉత్పాదనలు, బహుళ ఆదాయ మార్గాలను అందిస్తున్నది. ఆ ఐదు ‘ఎఫ్‌‘లు ఏవంటే.. ఫుడ్, ఫాడర్, ఫ్యూయల్, ఫర్టిలైజర్, ఫ్యాషన్‌! ఈ ఐదు ఆంగ్ల పదాలు ఎఫ్‌తో ప్రారంభం అవుతాయి కాబట్టి ‘5ఎఫ్‌ మోడల్‌ పంట’ అని దీనికి పేరొచ్చింది. ఆహారం, పశుల మేత, ఇంధనం, ఎరువులు, ఫ్యాషన్‌ రంగాల్లో ముళ్లులేని బ్రహ్మజెముడు పంట ఉపయోగపడుతోంది. ఆ విధంగా కరువును ΄పారదోలుతోంది!

1. ఆహారం: దీని పండ్లను కాక్టస్‌ పియర్‌ (ఓపుంటియా ఫికస్‌–ఇండికా) అంటారు. ఈ పండ్లు తియ్యగా, జ్యూసీగా ఉంటాయి. తాజాగా తినవచ్చు లేదా జామ్‌లు, జ్యూస్‌లు, సిరప్‌లుగా ్ర΄ాసెస్‌ చేయవచ్చు. ముళ్లులేని బ్రహ్మజెముడు మొక్కల ఆకులను ముక్కలుగా కత్తిరించి కూర వండుకొని తీసుకుంటారు.

2. పశువుల మేత: ముళ్లులేని బ్రహ్మజెముడు మొక్కల ఆకులను క్యాక్టస్‌ ప్యాడ్లు లేదా క్లాడోడ్‌లు అంటారు. ఇవి పశువులకు పచ్చి మేతగా ఉపయోగపడతాయి. నమ్మకమైన, తక్కువ ఖర్చుతో సమకూర్చుకోగల పచ్చి మేత. ముఖ్యంగా ఇతర రకాల మేతకు కొరత ఉన్న కరువు పీడిత ప్రాంతాల్లో ఇవి పశువులకు ప్రాణం నిలిపేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇందులో నీరు అధికపాళ్లలో ఉంటుంది.

3. ఇంధనం: ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులను (కాక్టస్‌ బయోమాస్‌ను) బయోగ్యాస్‌ ఉత్పత్తికి మూల వనరు (ఫీడ్‌ స్టాక్‌)గా ఉపయోగిస్తున్నారు. 10% ఆవు పేడతో 90% కాక్టస్‌ బయోమాస్‌ను ఉపయోగించడం వల్ల 65% వరకు మీథేన్‌ కంటెంట్‌తో బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయవచ్చని ఒక పైలట్‌ అధ్యయనం నిరూపించింది. ఈ గ్యాస్‌తో వంటకు, ఇతర ఉపయోగాలకు స్వచ్ఛమైన శక్తి వనరుగా పనికొస్తుంది.

4. ఎరువులు: బయోగ్యాస్‌ ఉత్పత్తి తర్వాత మిగిలిపోయే పోషకాలతో కూడిన స్లర్రీని సేంద్రియ ఎరువుగా ఉపయోగించి నేలను సారవంతం చేసుకోవచ్చు. పంట ఉత్పాదకతను మెరుగుపరుచుకోవచ్చు. ఇది ఖరీదైన రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుంది. పొలంలో పండే మొక్కల ఆకులతోనే ఎరువుగా వాడటం ద్వారా వృత్తాకార ఆర్థిక వ్యవస్థను సృష్టించుకోవచ్చు.

5. ఫ్యాషన్‌: బూట్లు, బ్యాగులు, ఇతర ఉపకరణాల కోసం బయో–లెదర్‌ (మొక్కలకు సంబంధించిన తోలు) ఉత్పత్తి చేయడానికి ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులను ఉపయోగించవచ్చని మన దేశంలోని భూ వనరుల శాఖ, ఇతర పరిశోధకులు నిరూపించారు. 3 కిలోల దీని ఆకుల ద్వారా 3 చదరపు అడుగుల కంటే ఎక్కువ బయో–లెదర్‌ను ఉత్పత్తి చేయగలదని ఒక పైలట్‌ అధ్యయనంలో తేలింది.

ఎడారిగా మారిపోతున్న ప్రదేశాలు, కరువు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతాల్లో భూములు నిస్సారమైపోయి ఉంటాయి. అయితే, అటువంటి కఠిన పరిస్థితుల్లో మనుగడ సాగించగలిగే జాతుల పంటలను గుర్తించి, పరిశోధనలు చేయటం.. ఆయా పంటలను సాగు చేయించటంలో తోడ్పాటునందించటం ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమం. ఇటువంటి పని చేస్తున్న ఒకానొక అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఐసీఏఆర్‌డీఏ. ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌ ద డ్రై ఏరియాస్‌. దీని ప్రధాన కార్యాలయం లెబనాన్‌లో ఏభయ్యేళ్లుగా పనిచేస్తోంది. దక్షిణాసియా, చైనాలకు కలిపి ప్రాంతీయ కార్యాలయాన్ని 2008లో న్యూఢిల్లీలో నెలకొల్పారు. 

ఐసీఏఆర్‌డీఏ మన దేశంలోకి 67 రకాల ముళ్లులేని బ్రహ్మజెముడు రకాలను ప్రవేశపెట్టి, భారతీయ సంస్థల సహకారంతో పరిశోధనలకు మార్గదర్శకత్వం వహించింది. ఆ కృషి ఫలితంగానే దేశంలో రైతులకు ఇప్పుడు తమ జీవనోపాధిని పెంచుకునే, కరువును ఎదుర్కొనే ఆశాజనకమైన ముళ్లులేని బ్రహ్మజెముడు అనే కొత్త పంట అందుబాటులోకి వచ్చింది. ఐసీఏఆర్‌డీఏ ఇండియా ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌లోని అమ్లహలో ఫుడ్‌ లెగ్యూమ్‌ రీసెర్చ్‌ ప్లాట్‌ఫామ్‌లో డాక్టర్‌ నేహా తివారీ పరిశోధకురాలిగా పనిచేస్తున్నారు. మన దేశంలో ఎడారీకరణను, కరువును ఎదుర్కొంటున్న ప్రాంతాల అభ్యున్నతికి ‘కాక్టి రాణి’గా ప్రసిద్ధి చెందిన ముళ్లులేని బ్రహ్మజెముడు ఎంత అవసరమో ఆమె ఒక ఇంటర్వ్యూలో చర్చించారు. ముఖ్యాంశాలు..

ముళ్లులేని బ్రహ్మజెముడు పంటను సాగు చేయటానికి తగిన వ్యవసాయ పరిస్థితులు ఏమిటి?
ముళ్లులేని బ్రహ్మజెముడు పంట తక్కువ తేమతో కూడిన వేడి వాతావరణంలో పెరుగుతుంది. ఇసుక నేలలు, కంకర నేలలకు ఇది అనువైనది. ముళ్లులేని బ్రహ్మజెముడు నిస్సారమైన నేలల్లో స్థిరంగా పెరిగే పంట అయినప్పటికీ, ముఖ్యంగా దాని పెరుగుదల దశలో, దానికీ కొంత తేమ అవసరం. ముళ్లులేని బ్రహ్మజెముడు బాగా పెరగాలన్నా, పండ్ల కాపు రావాలన్నా ప్రతిరోజూ కనీసం ఆరు గంటల ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం. ఈ మొక్క ఉదజని సూచిక కొద్దిగా ఆమ్ల లేదా తటస్థంగా ఉన్న నేలలను ఇష్టపడుతుంది. సాధారణంగా 6.0 నుండి 7.5 వరకు పీహెచ్‌ ఉండాలి. మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉండాలి. 

మన దేశంలోని మెట్ట ప్రాంతాలలో కఠినమైన వ్యవసాయ–వాతావరణ పరిస్థితులు ముళ్లులేని బ్రహ్మజెముడుకు అద్భుతమైన అనుకూలంగా ఉంటాయి. ఇతర పంటలేవీ పండించలేని ప్రదేశాలలో ఇది పెరుగుతుంది. వాస్తవానికి, ఐసీఏఆర్‌డీఏ భారతదేశంలో అరవై ఏడు కాక్టస్‌ రకాలను ప్రవేశపెట్టింది. ఈ రకాలను పెంచే మదర్‌ నర్సరీలు అమలహాలోని ఐసీఏఆర్, ఐసీఏఆర్‌డీఏ సంస్థల్లో ఏర్పాటయ్యాయి. ముళ్లులేని బ్రహ్మజెముడు పంట సాగును ప్రోత్సహించడానికి డిసెంబర్‌ 2023లో ఐసీఏఆర్‌డీఏ భారత ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.

దేశంలో ముళ్లులేని బ్రహ్మజెముడు మార్కెటింగ్‌ వ్యవస్థ అభివృద్ధి చెందిందా?
చిన్న రైతులు స్థానికంగా ముళ్లులేని బ్రహ్మజెముడు పండ్ల కోసం, పశుగ్రాసం కోసం పండిస్తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ కొంచెం తక్కువే. మార్కెటింగ్‌ ప్రయత్నాలను మెరుగుపరచడానికి ఐసీఏఆర్‌డీఏ కేంద్ర భూ వనరుల శాఖతో కలిసి పనిచేస్తున్నది. 

ఆహారంగా, ఇంధనంగా, పశుగ్రాసంగా, ఎరువుగా, కార్బన్‌ క్రెడిట్స్, ఫ్యాషన్‌ రంగాల్లో రైతులకు ఆకర్షణీయమైన ప్రయోజనాలను చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఉదాహరణకు.. ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులతో 61% మీథేన్‌తో కూడిన బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేశాం. అలాగే చౌకగా, సమృద్ధిగా లభించే బయోఫెర్టిలైజర్‌ను ఉత్పత్తి చేసే సాంకేతికతలను అభివృద్ధి చేశాం. అదనంగా, ప్రైవేట్‌ రంగం భాగస్వామ్యంతో బయో–లెదర్‌ను రూపొందించే కార్యక్రమాన్ని ప్రారంభించాం. కేరళలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్‌ డిసిప్లినరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో జరిగిన ప్రాథమిక పరీక్షలు ఆశాజనకమైన ఫలితాలిచ్చాయి. 

3 కిలోల ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులతో 3.38 చదరపు అడుగుల బయో లెదర్‌ను ఉత్పత్తి చేశాం. ఇది 2 జతల చెప్పులు, 3 చిన్న బ్యాగులు లేదా 2 జతల బూట్లను తయారు చేయడానికి సరి΄ోతుంది. బయోలెదర్‌ ఉత్పత్తులను మరింత అభివృద్ధి చేయడానికి అనేక జాతుల ముళ్లులేని బ్రహ్మజెముడు రకాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. బయో లెదర్‌ రైతులకు కొత్త మార్కెట్‌ అవకాశాలను కల్పిస్తుంది. అదే సమయంలో, రైతులకు ప్రయోజనం చేకూరుస్తూనే ప్రైవేట్‌ రంగాన్ని శక్తివంతం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నది. 

బ్రహ్మజెముడు ఉత్పత్తుల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముళ్లు లేని బ్రహ్మజెముడు పంట నిరూపిత సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దేశంలో ఈ పంట సాగు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని పెంపొందించడానికి ఐసీఏఆర్‌డీఏ ప్రభుత్వ సంస్థలకు సహకరిస్తున్నది. ముఖ్యంగా ఎడారీకరణ ముప్పును ఎదుర్కొంటున్న ప్రాంతాలు, కరువు ప్రాంతాల్లో ఆహార భద్రత, జీవనోపాధులను పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం.

ఒక రైతు ముళ్లులేని బ్రహ్మజెముడు పంటను ఎలా పండించవచ్చు?
ముళ్లు లేని బ్రహ్మజెముడు సాగులో గమనించాల్సిన అనేక అంశాలు ఉన్నాయి. నీరు నిలవని నేలలు, తగినంత సూర్యకాంతి ఉన్న ప్రదేశాల్లో పెంచాలి. దీనికి కూడా ఎండా కాలంలో నీరందించాలి. జంతువుల నుంచి రక్షణకు కంచెను ఏర్పాటు చేసుకోవాలి. 

దున్నిన తర్వాత నాటుకోవాలి. వాన నీరు బయటకు వెళ్లిపోవటానికి ఏర్పాట్లు చేసుకోకపోతే వేరుకుళ్లు సమస్య వస్తుంది. ముళ్లు లేని బ్రహ్మజెముడు ఆకులనే నాటుకోవాలి. వీటిని ఐసీఏఆర్‌డీఏ, ఇండియన్‌ గ్రాస్‌ల్యాండ్‌ అండ్‌ ఫాడర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, సెంట్రల్‌ అరిడ్‌ జోన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్‌ ఫౌండేషన్‌ వంటి ప్రసిద్ధ నర్సరీల నుంచి ఆరోగ్యకరమైన, ముదురు ముళ్లు లేని బ్రహ్మజెముడు ఆకులను తెచ్చుకొని రైతులు నాటుకోవాలి.

వరుసలలో తగినంత దూరంలో నాటుకోవాలి. ముళ్లు లేని బ్రహ్మజెముడు రకాన్ని, దాని పెరుగుదల అలవాటును బట్టి ఎంత దూరం పెట్టాలన్నది ఆధారపడి ఉంటుంది. ఈ ఆకులను తెచ్చిన 10 నుండి 15 రోజులు వాడబెట్టిన తర్వాత నాటుకోవాలి. వరుసల మధ్య 2 మీటరు, మొక్కల మధ్య 1 మీటరు దూరంలో నాటాలి. ఆకు 1/3 వంతు నేలలోకి ఉండేలా నాటాలి. వ్యాధి నివారణ కోసం కార్బెండజిమ్‌ (2 గ్రాములు/లీటరు) ద్రావణంలో ముంచి నాటుకోవాలి. 

నాటిన తర్వాత మొదటి 10 రోజులు నీరు పెట్టవద్దు. తరువాత 15 రోజుల వ్యవధిలో మొక్కకు 1–2 లీటర్ల నీరు ఇవ్వండి. అది వేరుపోసుకొని మొలకెత్తిన తర్వాత అంత తరచుగా నీరు పెట్టనవసరం లేదు. నేల పరీక్ష నిర్వహించి తగినంత ఎరువు వేయాలి. నాటేటప్పుడు మొక్కకు బాగా కుళ్ళిన పశువుల ఎరువు 2 కిలోలు వెయ్యండి. పండ్లు, ఆకులు కోసిన ప్రతి సారీ ఎరువులు వేయాలి. పిండినల్లి, శిలీంధ్ర తెగుళ్లు, ఇతర పురుగుల నుంచి రక్షణకు చర్యలు తీసుకోవాలి. 

ఒక సంవత్సరం తర్వాత, అడుగున రెండు ఆకులు వదిలి, పైన పూర్తిగా ఎదిగిన ఆకులను కోసి ఉపయోగించుకోవాలి. మొదటి సంవత్సరంలో మొక్కకు 8–10 కిలోల ఆకుల దిగుబడి వస్తుంది. మేకలు, గొర్రెలు, పశువులు, గేదెలకు మేతగా వీటిని వేసుకోవచ్చు. ఇతర పచ్చి మేతకు 25% ప్రత్యామ్నాయంగా ఉపయోగించండి. వసంతకాలం చివరిలో లేదా వేసవి ప్రారంభంలో ముళ్లులేని బ్రహ్మజెముడు పండ్లు కోతకు వస్తాయి.

ముళ్లులేని బ్రహ్మజెముడు పంట నాటే ఆకులను ఎలా సేకరించుకోవాలి?
ఐసీఏఆర్‌డీఏ, ఐజీఎఫ్‌ఆర్‌ఐ, సీఏజడ్‌ఆర్‌ఐ, సెంట్రల్‌ ఇన్సి్టట్యూట్‌ ఫర్‌ ఆరిడ్‌ హార్టికల్చర్, బీఏఐఎఫ్‌ వంటి పరిశోధనా సంస్థల్లో ముళ్లులేని బ్రహ్మజెముడు నర్సరీలు ఉన్నాయి. వారి నుంచి విత్తన ఆకులను తీసుకొని నాటుకోవచ్చు. ఇప్పటికే ఈ పంట సాగు చేస్తున్న రైతుల పొలాల నుంచి ఆరోగ్యకరమైన ఆకులు లేదా కాండం ముక్కలను తెచ్చి నాటుకోవచ్చు. 

ముళ్లులేని బ్రహ్మజెముడు మొక్క 3–4 సంవత్సరాలలో పూర్తి పరిపక్వతకు చేరుకుంటుంది. కొందరు గ్రీన​హౌస్‌లో కూడా పెంచుతున్నారు. చదరపు మీటరుకు రూ. 500 నుండి 600 వరకు ఆదాయాన్ని పొందవచ్చని అంచనా. రూపాయి ఖర్చుకు 3 రూపాయల ఆదాయాన్ని పొందవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇతర వివరాలకు.. www.icarda.org

దీన్ని సాగు చేస్తే భూమికి మేలు... 
నిస్సారమైన ఇసుక దువ్వలాగా మారిపోయిన భూమికి జవ జీవాలను అందించి పునరుద్ధరించడానికి అనేక విధాలుగా బ్రహ్మజెముడు పెంపకం అనువైనదని నిపుణులు చెబుతున్నారు:

కరువు నిరోధకత... వాతావరణం నుంచి నీటిని పీల్చుకొని తనలో నిల్వ చేసుకోవటం బ్రహ్మజెముడు మొక్క లక్షణం. అందువల్లే ఇది కరువును గట్టిగానే తట్టుకోగలుగుతుంది. ఈ మొక్క జీవించడానికి, ఎక్కువ ఆకులను ఉత్పత్తి చేయడానికి చాలా తక్కువ నీరు సరిపోతుంది.

నేలకు మేలు... బ్రహ్మజెముడును పెంచడం వల్ల మట్టి వానకు, గాలికి కొట్టుకుపోకుండా ఆపటం ద్వారా నేల సారాన్ని పునరుద్ధరించవచ్చు. ఈ మొక్కలు మట్టికి సేంద్రియ పదార్థాన్ని అందిస్తాయి.

కర్బన స్థిరీకరణ... బ్రహ్మజెముడు మొక్క కర్బనాన్ని వాతావరణం నుంచి సంగ్రహించి తన ఆకులు, కాండంతో పాటు నేలలో నిల్వ చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఈ కర్బన స్థిరీకరణ ప్రక్రియ సహాయపడుతుంది.

అధిక దిగుబడి సామర్థ్యం... కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ముళ్లు లేని బ్రహ్మజెముడు చక్కగా పెరుగుతుంది. సంవత్సరానికి హెక్టారులో 80–100 టన్నుల బరువైన ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులను పండించవచ్చు.

అమలుకు అవకాశాలు... ఈ 5 రకాల ప్రయోజనాలను పొందే ముళ్లులేని బ్రహ్మజెముడు పంట నమూనాను స్వీకరించడానికి ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల సహకారం అవసరం. ముళ్లులేని బ్రహ్మజెముడు నాణ్యమైన ఆకులు నాటుకుంటే చాలు. అవి వేరుపోసుకొని ఎత్తయిన మొక్కగా ఎదుగుతాయి. 

కరువు ప్రాంతాల్లో జీవనోపాధులను మెరుగుపరిచేందుకు రైతులకు నాణ్యమైన ఆకులను అందించటం, సాంకేతిక మార్గదర్శకత్వం అందించడం ముఖ్యమైన విషయం. మార్కెట్‌ లింకేజీలను ఏర్పాటు చేయడం, ఈ ఆకులను 5 రకాలుగా ఉపయోగించేందుకు వీలుగా ప్రాసెస్‌ చేయడానికి మౌలిక సదుపాయాలను నిర్మించడం అవసరం.

ఈ 5 రకాల ప్రయోజనాలనిచ్చే పంట నమూనాను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రజల్లో అవగాహన పెంచడం, సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించాలి. ఈ పంట నమూనా ముఖ్యంగా కరువు, ఎడారి తాలకు బాగా సరిపోతుంది. భారతదేశం, పాకిస్తాన్, ఇథియోపియా, మొరాకోతో సహా ఎడారీకరణను ఎదుర్కొంటున్న అనేక దేశాల్లో దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. 

ఈ పంట సాగు చేస్తున్నారు. బహుళ ఆదాయ మార్గాలను అందించడం, పనిలో పనిగా భూమిని తిరిగి సారవంతం చేయటం ద్వారా 5 రకాలుగా ప్రయోజనకరమైన బ్రహ్మజెముడు పంట నమూనా బడుగు రైతుల ఆదాయాన్ని పెంచుతుంది. మెరుగైన ఆహార భద్రతనిస్తుంది. అదే సమయంలో పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు ఒక మార్గాన్ని అందిస్తుంది. 
–పంతంగి రాంబా, బుసాక్షి సాగుబడి డెస్క్‌ 

(చదవండి: Sagubadi: మునగ మేలు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement