'టీ లైఫ్‌'..! మహిళలను ఆంట్రప్రెన్యూర్స్‌గా, ఇండస్ట్రియలిస్ట్‌గా.. | T-LIFE: Telangana Lady Industrialists Federation For Entrepreneurs | Sakshi
Sakshi News home page

'టీ లైఫ్‌'..! మహిళలను ఆంట్రప్రెన్యూర్స్‌గా, ఇండస్ట్రియలిస్ట్‌గా..

Apr 26 2025 9:11 AM | Updated on Apr 26 2025 9:26 AM

T-LIFE: Telangana Lady Industrialists Federation For Entrepreneurs

‘మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉంటేనే నిర్ణయాధికారం వస్తుంది’ అని నమ్మే వాళ్లలో తాటిపర్తి దీపికారెడ్డి కూడా ఉన్నారు. ఆమె ఎవరు? హైదరాబాద్‌ వాసి .. టీ లైఫ్‌ (తెలంగాణ లేడీ ఇండస్ట్రియలిస్ట్‌ ఫెడరేషన్‌ ఫర్‌ ఆంట్రప్రెన్యూర్స్‌) వ్యవస్థాపకురాలు. ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ పట్ల గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలకు అవగాహన కల్పించి, ఉచిత శిక్షణతో వాళ్లను ఆ దిశగా నడిపించి.. ఆర్థిక స్వావలంబన సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఆమె ఇరవై ఏళ్ల ఆ ప్రయాణం గురించే ఈ కథనం.. 

చదువుకునే వయసు నుంచే దీపికా రెడ్డి .. ఇండస్ట్రియలిస్ట్‌గా స్థిరపడాలనే కోరుకున్నారు. అయితే ఆ లక్ష్యానికి ప్రయాణం మాత్రం పెళ్లయ్యాకే మొదలైంది. ఆమెకున్న పలురకాల ఆసక్తులు, అభిరుచుల మేరకు ఆయా కోర్సులు చదువుకుంటూ ఆయా రంగాల్లో తన ఆంట్రప్రెన్యూర్‌ స్కిల్స్‌ను నిరూపించుకున్నారు. 

అలా పెళ్లి తర్వాత కాకతీయ యూనివర్సిటీ నుంచి హెయిర్‌ అండ్‌ స్కిన్‌ కోర్స్‌లో డిప్లొమా చేశారు. ఏరోబిక్స్‌లో శిక్షణ పొందారు. ఆ అర్హతలతోనే ‘బ్యూటీ అండ్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌’ అనే ఓన్లీ ఫర్‌ విమెన్‌ జిమ్‌ను స్టార్ట్‌ చేశారు. ఇంటీరియర్‌ డిజైన్‌ కోర్స్‌ చేసి.. ఇంటీరియర్‌ డిజైనర్‌గా మారి, వేదీస్‌ ఇంటీరియర్స్‌ పేరుతో సంస్థనూ పెట్టారు.  

టీ లైఫ్‌..  
ఇంటీరియర్‌ డిజైనర్‌ అండ్‌ ఆంట్రప్రెన్యూర్‌గా కొనసాగుతున్న దీపికకు హైదరాబాద్‌లోని ఎలీటా అసోసియేషన్‌ పరిచయం అయింది. అది మహిళల్లో ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ను పెంపొందించడానికి శిక్షణనిచ్చే సంస్థ. అందులో జాయింట్‌ సెక్రటరీగా జాయిన్‌ అయ్యారు ఆమె. 

మూడేళ్లపాటు ఆ అసోసియేషన్‌లో అనుభవం గడించాక  2017లో తను సొంతంగా టీ లైఫ్‌ (తెలంగాణ లేడీ ఇండస్ట్రియలిస్ట్‌ ఫెడరేషన్‌ ఫర్‌ ఆంట్రప్రెన్యూర్స్‌) సంస్థను ప్రారంభించారు. తెలంగాణ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ పట్ల అవగాహన కల్పించి, వారికి కావల్సిన శిక్షణను ఇప్పించి వారిని ఆంట్రప్రెన్యూర్స్‌గా మలచడమే ఆ సంస్థ లక్ష్యం. 

అందుకే దాని తరపున ఆమె తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పర్యటిస్తుంటారు. ఆంట్రప్రెన్యూర్స్‌ కావాలనుకున్న మహిళల కోసం అక్కడి కలెక్టర్లు, ఇతర ప్రభుత్వ అధికారుల సహాయంతో సదస్సులు నిర్వహిస్తుంటారు. ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ కోసం బయట ఎలాంటి అవకాశాలున్నాయి, ప్రభుత్వ పథకాలేంటీ, లోన్స్, సబ్సిడీలు, శిక్షణ కార్యక్రమాలు, బిజినెస్‌ కోసం వాళ్ల ప్రాంతాల్లో ఉన్న రీసోర్సెస్‌ వంటివన్నీ వివరిస్తారు. 

సదస్సు తర్వాత వాళ్లకు దరఖాస్తు ఫారాలు ఇచ్చి, హాజరైన మహిళలకున్న బిజినెస్‌ ఆసక్తులను ఆ దరఖాస్తు ఫారాల్లో నింపమంటారు. ఆ ఫారాల ఆధారంగా వాళ్లకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్స్‌కి అందుతున్న రుణాలతో అందులోని సభ్యులు ఎలాంటి బిజినెస్‌ పెట్టుకోవచ్చో చెప్పి, తగిన శిక్షణనిచ్చి.. ఆ వ్యాపారాలను పెట్టించారు కూడా! ఈ క్రమంలో ఆమె గమనించిన విషయం.. ఆ మహిళలందరినీ వాళ్లమ్మాయిలు ప్రోత్సహించడం.

అమ్మాయిల కోసం.. 
దీపిక.. గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్‌ కాలేజీలకూ వెళ్లి అక్కడి అమ్మాయిలకూ బిజినెస్‌ రంగంలో ఉన్న అవకాశాలు, శిక్షణ వంటి వాటిమీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు మూడున్నర వేల మంది మహిళలకు శిక్షణనిచ్చారు. 

అందులో వందకు పైగా మహిళలు ఆంట్రప్రెన్యూర్స్‌గా నిలబడ్డారు. ఇందులో సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్స్‌కి చెందిన మహిళలే ఎక్కువ. ప్రస్తుతం టీ లైఫ్‌కి జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్‌లలో ఆఫీసులున్నాయి. మే నెలలో మహబూబ్‌నగర్‌లో కూడా ప్లాన్‌ చేయాలనుకుంటారు. 

టీ లైఫ్‌ ఆరంభించినప్పుడు కనీసం పదివేల మంది మహిళలకు అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చేరుకున్నారు కూడా.  నెలకు నాలుగు నుంచి అయిదు బ్యాచ్‌లుంటాయి. అభ్యర్థులు పెట్టాలనుకున్న బిజినెస్‌ను బట్టి ఆ శిక్షణ కార్యక్రమాల గడువు ఉంటుంది. ఈ ట్రైనింగ్‌ సెషన్స్‌ అన్నీ ఎక్స్‌పర్ట్స్‌తోనే ఉంటాయి. ‘మొదటి నుంచీ నన్ను నేను ప్రూవ్‌ చేసుకుంటూ వచ్చిన చోటల్లా అది కుటుంబంలో కానీ.. సమాజంలో కానీ ఎక్కడైనా నాకు గౌరవం పెరుగుతూ వచ్చింది. దాన్ని గ్రామీణ మహిళలు, పట్టణ ప్రాంతం వారూ పొందాలని అనుకున్నాను. 

వాళ్లు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అనుకుంటున్నాను. అందుకే టీ లైఫ్‌ని స్టార్ట్‌ చేశాను. మేము వెళ్లినచోటల్లా పాజిటివ్‌ రెస్పాన్సే వస్తోంది. స్టూడెంట్స్‌ కూడా చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. వాళ్లకోసం కంప్యూటర్, ఏఐ బేస్డ్‌ ప్రోగ్రామ్స్‌నూ పెట్టాం. ఇంట్లో వాళ్ల నుంచీ నాకు సపోర్ట్‌ దొరుకుతోంది. 

టీ లైఫ్‌ ధ్యేయం ఒక్కటే.. మహిళలు ఆంట్రప్రెన్యూర్స్‌గానే కాదు ఇండస్ట్రియలిస్ట్స్‌గానూ ఎదిగేందుకు తోడ్పడాలని. అయితే దీనికి ప్రభుత్వ సహకారం కూడా అసవరమే! కుటుంబంలో మహిళ ఆర్థికంగా బలంగా ఉంటే తర్వాత తరాల అమ్మాయిలూ స్ట్రాంగ్‌గా ఉంటారని నా నమ్మకం.’ అంటున్నారు దీపికారెడ్డి 

– సరస్వతి రమ

(చదవండి: స్టెగానోగ్రఫీ.. అలా చేస్తే లక్షలు మాయం అవుతాయి!)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement