‘నువ్వు చేయలేవు’ అని ఎవ్వరైనా అంటే... ఆ పనిని చేసి నిరూపించడమే నా పని’ అంటారు తెలంగాణలోనిపాలకుర్తి వాసి ఝాన్సీరెడ్డి. అమెరికాలో పురుషాధిక్య రంగమైన రియల్‌ఎస్టేట్ రంగంలో రాణించి, ‘వెటా’ స్వచ్ఛంద సంస్థ ద్వారా అక్కడి తెలుగు మహిళల సాధికారతకు కృషి చేస్తున్నారు. పుట్టినగడ్డకు సేవలు అందిస్తూ, తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నేటినుంచి ‘విమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ (వెటా) ఇండియా’ ద్వారా ఈ సేవలు దేశవ్యాప్తం చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఝాన్సీరెడ్డి పంచుకున్న విషయాలు...
‘‘పురుషాధిక్య సమాజంలో మహిళ ఎప్పుడూ అణచివేతకు గురవుతూనే ఉంటుంది అది ఏ దేశమైనా. కానీ, మహిళలు తమ శక్తిని తెలుసుకుంటూ, సత్తా చూపుతూ, ప్రత్యేకతను చాటుతూనే ఉండాలి. అప్పుడే భావి తరాలకు ఉపయోగపడేలా మన జీవనవిధానం రూపుదిద్దుకుంటుంది. సాధారణంగా ఏదైనా పనిని ఎంచుకున్నప్పుడు దానిని పూర్తి చేసేదాకా వదలని స్వభావం నాది. ఆ స్వభావమే నన్ను అన్నింటా ముందుంచింది. అమెరికాలో తెలుగు మహిళల సమస్యల గురించి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉండేవి.
దేశం కాని దేశంలో తమ వారికి దూరంగా ఉంటూ వారు పడుతున్న బాధలు విన్నప్పుడల్లా ఆలోచించేదాన్ని. వారికి అండగా ఉండేందుకు ‘వెటా’ అనే స్వచ్ఛంద సంస్థను 2019లో ప్రారంభించాను. దీని ద్వారా తెలుగు మహిళల హక్కులు, న్యాయ సమస్యలు, సాధికారత కోసం వర్క్ చేశాను. దీంతోపాటు పుట్టిల్లు, అత్తిల్లు ప్రాంతాలైన ఖమ్మం, వరంగల్ జిల్లాలోనూ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాను. విద్య, వైద్యకేంద్రాలకు భవనాలు, తాగునీటి ట్యాంకులు.. అవసరం ఎంత వరకు ఉందో గుర్తించి, ఆ దిశగా పనులు చేస్తూ వచ్చాను.
అడ్డుకుంటే .. మరింత శక్తిగా...
సేవాకార్యక్రమాలలో చురుగ్గా ఉండే నాకు అనుకోని అవాంతరం కలిగింది. ఖమ్మం జిల్లాలోని స్కూల్, కాలేజీ విద్యార్థినులకు ఉచిత శానిటరీ ΄్యాడ్స్ పంపిణీని ఏర్పాటు చేశాం. దానిని కొందరు పెద్దలు అడ్డుకున్నారు. పేరు ప్రఖ్యాతులు ఆశించి ఈ పనులు చేస్తున్నారు అన్నారు. ఆడపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ఓ మంచి పనికి రాజకీయ రంగు పులమడం బాధగా అనిపించింది.
నా వరకు నేను అమెరికా నుంచి వర్క్ చేస్తున్నాను. కానీ,‘మంచి పనులకు కూడా అడ్డు పడుతుంటారా..’ అనేది నన్ను ఆలోచించేలా చేసింది. మహిళలు ఎక్కడైనా మహిళలే. అన్నిచోట్లా, అన్నివిధాలా, అన్నిరంగాలలోనూ వివక్షకు లోనవుతూనే ఉన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ‘వెటా’(విమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ ఫర్ ఇండియా)ను విస్తృతం చేయాలనుకున్నాను. దాంట్లో భాగంగా అమెరికా నుంచి పూర్తిగా ఇండియాకు వచ్చేశాను.
మరింత విస్తృతంగా..
నా భర్త అమెరికాలో కార్డియాలజిస్ట్. ముగ్గురు కొడుకులూ వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు. చిన్నకొడుకు, కోడలు మినహా మిగతా అందరూ అమెరికాలోనే ఉన్నారు. పుట్టిన ప్రాంతానికి సేవలు అందించాలనే ఉద్దేశాన్ని వాళ్ల ముందుంచినప్పుడు ‘తమ పూర్తి మద్దతును ఇస్తామ’న్నారు. నా స్వశక్తినే పెట్టుబడిగా ఈ రోజు ‘వెటా’ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నాం.
దీంట్లో బాలికావిద్య, వైద్యం, మహిళల వృత్తి, ఉద్యోగాలలో స్థిరపడేలా చూడటం .. ముఖ్యమైనవి. బాలికల విద్య పట్ల వారి తల్లిదండ్రుల్లో అవగాహన తీసుకురావడం, కేంద్ర, రాష్ట్ర పథకాలు సవ్యంగా అందేలా చూడటం, మహిళ సాధికారత వెటా ముఖ్య ఉద్దేశం. దీనికి 300 మంది ఒక టీమ్‌గా ఏర్పడి పనులు చేయనున్నారు. మొదట తెలంగాణ మొత్తంగా జిల్లా, మండలస్థాయిలో ‘వెటా’ ద్వారా నూటికి నూరుశాతం సేవలు అందేలా చూస్తాం. కూతురుగా, భార్యగా, తల్లిగా.. మహిళలకు ఏ దశలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయో గుర్తించి, వారికి చేయూతను అందివ్వడం ‘వెటా’ లక్ష్యం.
సాధ్యం కానిదంటూ ఏమీ లేదు...
నా విషయానికే వస్తే.. పదేళ్ల వయసులో తండ్రిని కోల్పోయాను. పెద్దనాన్నతోపాటు దేశం దాటి వెళ్లి పోయాను. ఎలా ఉండాలో తెలియని ప్రాంతంలో అక్కడి వాతావరణానికి తగ్గట్టు నన్ను నేను మలుచుకున్నాను. టెన్ ్త పూర్తయ్యాక సెలవుల్లో ఇండియాకు వచ్చినప్పుడు పదహారేళ్ల వయసులోనే పెళ్లి అయింది. నా భర్త డాక్టర్‌గా న్యూజెర్సీలో ప్రాక్టీస్ చేశారు. పెళ్లయ్యింది కాబట్టి ఇక ఇంట్లోనే కూర్చోవచ్చు కదా అనుకోలేదు. చదువుకుంటూనే ఉద్యోగం చేసేదాన్ని. ఏ దేశం లో ఉన్నా భార్యాభర్త ఇద్దరూ పనిచేస్తేనే వారి జీవితాలు కూడా వృద్ధిలోకి వస్తాయని నమ్ముతాను.
అలా ప్లస్ టూ పూర్తవగానే బ్యాంకింగ్ రంగంలోకి వెళ్లాను. కానీ, పై చదువులు చదవాలన్న ఆసక్తితో సాయంత్రాలు చదువుకుంటూ, పగటివేళ ఉద్యోగం చేశాను. పిల్లలు పుట్టడంతో వారి బాగోగులు చూసుకునే క్రమంలో ఉద్యోగానికి ఫుల్‌స్టాప్ పడింది. అయినా ఖాళీగా లేకుండా మా వారి హాస్పిటల్ నిర్మాణాన్ని దగ్గరుండి చూసుకున్నాను. దీనివల్ల వచ్చిన అనుభవంతో రియల్ ఎస్టేట్ రంగంలోకి మారాను. పురుషాధిక్య రంగం అది. అయినా, వెనకంజ వేయలేదు. ఈ రంగంలోనూ నన్ను నేను వ్యాపారవేత్తగా నిరూపించుకున్నాను.
చాలామంది అంటుంటారు డబ్బు ఉంటే ఏమైనా చేయవచ్చు అని. కానీ, ఉండాల్సింది మనో ధైర్యమే. చేయాల్సిన పని పట్ల నిబద్ధత, భవిష్యత్తు పట్ల ఫోకస్.. ఇవే మన విధిని నిర్దేశిస్తాయి. నా వరకు నేను సంపాదించేవారు ఉన్నారు కదా అని ఇంట్లో కూర్చోలేదు. నాకు నేనుగా సంపాదించుకున్న ఒక్క డాలర్ మిలియన్ డాలర్లతో సమానంగా భావించేదాన్ని. అందుకే ఏనాడూ ఖాళీగా లేను.
ఉద్యోగినిగా, గృహిణిగా, ముగ్గురు పిల్లల తల్లిగా, వ్యాపారవేత్తగా.. నాపాత్రలకు సముచిత న్యాయం చేస్తూనే ఈ రోజు నా సాటివారికి చేయూతగా నిలుద్దామని మీ ముందుకు వచ్చాను. స్త్రీని లక్ష్మితో పోలుస్తారు. ధైర్యలక్ష్మి మనతో ఉంటే అన్నీ ఉన్నట్టే. మనతోపాటు మరికొంతమందిని వృద్ధిలోకి తీసుకురాగలం’’ అంటూ చేస్తున్న సేవాకార్యక్రమాలు, వాటి అమలు గురించి వివరించారు ఆమె.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల


