నేతి అరిసెలు.. కొబ్బరి బూరెలు.. కజ్జికాయలు.. కరకరలాడే చక్రాలు.. చక్కలు, బూందీ లడ్డూలు, బెల్లం గవ్వలు.. ఇలా చెప్పుకుంటూ పోతే నోరూరించే పిండి వంటకాలెన్నో.. ఎన్నోన్నో.. తెలుగునాట పెద్ద పండుగగా జరుపుకునే సంక్రాంతి వేడుకల్లో పిండి వంటలది ప్రథమ స్థానం. అందులోనూ అరిసెలది అందెవేసిన చెయ్యి. సంక్రాంతికి సమ్‌థింగ్ స్పెషల్ వంటకమూ ఇదే.. తెలుగింటి ముంగిట మరో 24 గంటల్లో సంక్రాంతి సందడి ప్రారంభం కానుండడంతో పల్లెల్లో ఎక్కడ చూసినా పిండివంటల ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. నేతి అరిసెల సువాసనలు వీధులను చుట్టేస్తున్నాయి. గ్రామాలలో చుట్టుపక్కల నివాసాల వారు, బంధుమిత్రులంతా ఒక చోటకు చేరి కలిసికట్టుగా సంక్రాంతి వంటకాల తయారీలో నిమగ్నమై కనిపిస్తున్నారు.






