పుస్తకాలే తూనీగ రెక్కలు | Reading Popular childrens books and stories for Childrens Day | Sakshi
Sakshi News home page

పుస్తకాలే తూనీగ రెక్కలు

Nov 13 2025 12:37 AM | Updated on Nov 13 2025 12:37 AM

Reading Popular childrens books and stories for Childrens Day

పుస్తకం తెరిస్తే ఉన్న చోటు నుంచి మాయమైపోతాం. తూనీగల్లా మారిపోతాం. పుస్తకంలోని కథలు జరిగే చోటుకంతా రెక్కలాడిస్తూ ఎగిరెళ్లిపోతాం. ‘గుడ్‌ బాయ్‌’, ‘గుడ్‌ గర్ల్‌’ అనిపించుకోవాలని అందరూ అనుకుంటారు. మంచి నడవడిక ఉంటేనే గుడ్‌బాయ్, గుడ్‌గర్ల్‌ అయిపోరు. మంచి మార్కులు వస్తే అయిపోరు. ఆటలాడితే అయిపోరు. మంచి పుస్తకం కూడా చదవాలి. ఎన్ని పుస్తకాలు చదివితే అంత గుడ్‌ మనలోకి వచ్చేస్తుంది. నవంబర్‌ 14 ‘చిల్డ్రన్స్‌ డే’ సందర్భంగా మీ అమ్మానాన్నలతో వెళ్లి మీకు నచ్చిన పుస్తకాలు కొనుక్కోండి. ఈ 10 పుస్తకాల్లో నుంచి కూడా ఎంచుకోవచ్చు.

పంచతంత్రం
పంచతంత్ర కథల గురించి వినకపోయినా, తెలియకపోయినా మనం పిల్లలు అయినట్టే కాదు. అంత గొప్ప కథలు ఇవి. తన వద్దకు వచ్చిన రాజకుమారులకు విద్యాబుద్ధులు నేర్పే క్రమంలో ఒక గురువు చెప్పిన కథలే ఈ ‘పంచతంత్రం’. సంస్కృతంలో విష్ణుశర్మ రాసిన ఈ కథల్ని ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువదించారు. తెలుగులోనూ అనేకమంది వీటిని అనువదించారు. రచయిత, అనువాదకుడు సహవాసి (జంపాల ఉమామహేశ్వరరావు) నుంచి వచ్చిన పుస్తకం ఇది. ప్రతి కథలోనూ ఓ నీతిని గ్రహించేలా ఈ కథల్ని తీర్చిదిద్దారు.

తెనాలి రామలింగని కథలు
‘వికటకవి’ తెనాలి రామలింగడంటే తెలుగు పిల్లలకు తెగ ఇష్టం. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని చెప్పిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఒకడు తెనాలి రామలింగడు. ఈయన చాలా తెలివైనవాడు. ఎన్నో జటిల సమస్యలను యుక్తితో పరిష్కరించాడు. అలా ఆయన జీవితం చుట్టూ అల్లుకున్న కథలు తెలుగు జనబాహుళ్యంలో విస్తృతమైన పేరు పొందాయి. అనేకమంది రచయితలు వీటిని రాయగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.

మర్యాద రామన్న కథలు
మర్యాద రామన్న కథలన్నీ తెలివితేటలు పెంచేవే. పేద కుటుంబంలో పుట్టి, రాజుగారి వద్ద గొప్ప పేరు సంపాదించి, ఊరంతటికీ ఉపకారం చేసిన వ్యక్తి మర్యాద రామన్న. సమస్యతో అతనివద్దకు వస్తే దానికి తప్పకుండా పరిష్కారం చూపుతాడు. ఆయన పరిష్కరించిన సమస్యలతో పాటు ఈ కథల్లో ఆనాటి జీవనం, వారి స్థితిగతులను చూడొచ్చు. వివేకం ఉంటే ఎంతటి సమస్యనైనా ఎదుర్కొని నిలబడవచ్చే విషయం ఈ కథల ద్వారా చిన్నారులకు చేరుతుంది.

పురాణాల్లోని 35 నీతి కథలు
పురాణాల ద్వారా పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మంచి నడవడికను పొందొచ్చు. ఈ అంశాలను క్రోడీకరించి ప్రముఖ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రాసిన 35 నీతి కథలివి. ఇందులో కథలన్నీ చాలా సులభరీతిలో అర్థమవుతాయి. ఇవి చదవడం ద్వారా పిల్లలకు పురాణాల మీద అవగాహన ఏర్పడటంతోపాటు జీవితంలో ఎలా మెలగాలో తెలుస్తుంది.

పేదరాశి పెద్దమ్మ కథలు
ఇప్పుడంటే రైళ్లు, విమానాలు వచ్చాయిగానీ ఒకప్పుడు కాలినడక మీదే ప్రయాణాలు చేసేవారు. అలాంటి బాటసారులకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి, వారికి కమ్మటి భోజనం పెట్టి, చెవికింపుగా కథలు చెప్పే పాత్రే పేదరాశి పెద్దమ్మ. పేదరాశి పెద్దమ్మ చెప్పే ప్రతి కథలోనూ నీతితోపాటు మంత్రాలు, మాయలు, హాస్యం, జంతువులు ఉంటాయి. అవన్నీ చిన్నారులకు ఆసక్తి కలిగించి, వారి ఊహాశక్తిని పెంచుతాయి.

రైలు బడి 
జపనీస్‌ భాషలో 1981లో వెలువడిన ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ముప్పై భాషల్లోకి అనువాదమై కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. టెలివిజన్‌ వ్యాఖ్యాత టెట్సుకో కురొయనాగి బాల్యంలోని తన రైలు బడి, అక్కడి విశేషాల గురించి రాసిన విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకం విద్యాబోధనతో వినోదాన్నీ, స్వేచ్ఛనూ, ప్రేమనూ కలగలిపిన ఆదర్శవంతమైన టోక్యో పాఠశాల గురించి వివరిస్తుంది. ఎన్‌.వేణుగోపాల్‌ ఈ పుస్తకాన్ని అనువదించారు.

అపూర్వ రష్యన్‌ జానపద కథలు
రష్యాలో బాలల సాహిత్యానికి చాలా ప్రాముఖ్యం ఇస్తారు. అక్కడి పెద్ద రచయితలు, చిత్రకారులు పిల్లల కోసం తప్పకుండా పుస్తకాలు సృష్టిస్తారు. అలా రష్యన్‌ భాషలో పిల్లల కోసం రాసిన 20 కథల తెలుగు అనువాదం ఈ పుస్తకం. రష్యన్‌ చిత్రకారులు వేసిన రంగుల బొమ్మలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులోని సముద్రతీరంలో పిల్లవాడు, లెక్కల కుందేలు, అక్కాతమ్ముడు, చందమామ రొట్టె తదితర కథలన్నీ చదవడం చిన్నారులకు వివేకాన్ని, వినోదాన్ని అందిస్తుంది.

చందమామ కథలు
ఒకప్పుడు కథలంటే చందమామ కథలే. పిల్లల పత్రికంటే చందమామే. ఒకనాడు ప్రతి నెలా వెలువడిన మాసపత్రిక ‘చందమామ’ కోసం ఇంటిల్లిపాదీ ఎదురుచూసేవారు.  చిన్నారులు చందమామ చదివి ఎన్నో విషయాలు నేర్చుకునేవారు.  ప్రస్తుతం ఆ మానపత్రిక అందుబాటులో లేకపోయినా, ఆ కథల్ని పదిలంగా ఉంచాలన్న సంకల్పంతో పుస్తకాలుగా మార్చి విడుదల చేశారు. వీటిలో ఆనాటి కథలతోపాటు రంగురంగుల బొమ్మలున్నాయి. పిల్లలు కథను చదివి అర్థం చేసుకునేందుకు అవి ఉపకరిస్తాయి.

ఓ చిన్నారి డైరీ 
జర్మనీకి చెందిన అన్నా ఫ్రాంక్‌ అనే బాలిక రాసుకున్న డైరీలోని అంశాలే ఈ పుస్తకం. నాజీలు యూదులపై చేసిన అకృత్యాల కారణంగా తన కుటుంబంతో కలిసి రెండేళ్ల పాటు అన్నా ఫ్రాంక్‌ రహస్య జీవితం గడపాల్సి వస్తుంది. ఆ సమయంలో తను రాసిన డైరీలోని అంశాలు ప్రపంచాన్ని కదిలించాయి. అనారోగ్యంతో ఆమె మరణించినా ఆమె రాతలు నేటికీ ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. ఈ పుస్తకం అనేక భాషల్లోకి అనువాదమైంది. పిల్లల ఊహల్లో ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో పిల్లలు ఈ ప్రపంచం నుంచి ఎంత మంచిని ఆశిస్తారో తెలుస్తుంది.

లిప్తకాలపు స్వప్నం
ఏడేళ్ళకే నూరేళ్లు నిండిన క్లింట్‌ అనే కేరళ బాలుడి జీవిత కథ ఇది. ఆ కాసింత కాలంలోనే ఇరవయ్యైదు వేల బొమ్మలు గీసి, వాటిని తన జ్ఞాపకాలుగా వదిలి వెళ్ళాడు. అతని ఆసక్తులు, అతని వేళ్ళలోని ప్రతిభ, అతని ఆలోచనల్లోని పదును, అతని అమ్మానాన్నల మురిపెం, అతని చుట్టూ ఉన్న వాళ్ళ అపేక్ష..ఇవన్నీ వ్యక్తపరిచే పుస్తకమిది. క్లింట్‌ గీసిన బొమ్మలు ఈ పుస్తకంలో ఉన్నాయి. స్వర్ణ కిలారి ఈ పుస్తకాన్ని అనువదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement