నేడు (నవంబర్ 14న) బాలల దినోత్సవం. ఈ రోజును ఇష్టపడనివారు ఎవరుంటారు? అయితే ఎంతో ఇష్టమైన ఈరోజు తన జీవితంలో బాధాకరమైన రోజుగా మారిపోయిందంటోంది స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య, నిర్మాత సుప్రియ మీనన్ (Supriya Menon Prithviraj). బాలల దినోత్సవం నాడే తండ్రి తనను వదిలేసి వెళ్లిపోయాడంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
శాశ్వతంగా దూరమై 4 ఏళ్లు
నాన్న, నువ్వు మాకు దూరమై నాలుగేళ్లవుతోంది. నువ్వు వెళ్లిపోయాక ఎన్నోసార్లు జీవితం ఒక శూన్యంలా అనిపించింది. సంతోషకర క్షణాల్లో కూడా తెలియని బాధ మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. నువ్వు ఇంకొంతకాలం మాతో ఉంటే బాగుండని చాలాసార్లు అనిపించింది. నీతో కలిసి నేను ఎన్నో పనులు చేయాలనుకున్నాను. కానీ, అంత సమయం లేకపోయింది.
మాటల్లో చెప్పలేను
అన్నిటికంటే బాధాకరమైన విషయమేంటో తెలుసా? చిల్డ్రన్స్ డే రోజే నువ్వు నాకు శాశ్వతంగా దూరమయ్యావు. నిన్ను ప్రతిరోజు మిస్ అవుతున్నాను డాడీ.. మిస్‌యూ సో మచ్. నిన్ను ఎంత మిస్ అవుతున్నానో మాటల్లో చెప్పలేను అంటూ తండ్రితో కలిసి దిగిన పలు ఫోటోలను షేర్ చేసింది. సుప్రియ తండ్రి, నిర్మాత, బిజినెస్‌మెన్ విజయకుమార్ 2021లో క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశాడు.
మలయాళ స్టార్‌తో పెళ్లి
సుప్రియ ఒక జర్నలిస్టు. ఈమె.. హీరో, దర్శకుడు పృథ్వీరాజ్ (Prithviraj Sukumaran)ను 2011లో పెళ్లి చేసుకోగా వీరికి ఓ కూతురు సంతానం. పృథ్వీరాజ్ భార్య సుప్రియతో కలిసి పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ బ్యానర్‌లో 9, డ్రైవింగ్ లైసెన్స్, జనగణమన, కడువ, గురువాయూర్ అంబలనడయిల్ సినిమాలు నిర్మించారు.
సినిమా
కేజీఎఫ్:2, సలార్ సినిమాలను మలయాళంలో డిస్ట్రిబ్యూట్ చేశారు. ద గోట్ లైఫ్ (ఆడు జీవితం), సలార్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న పృథ్వీరాజ్ ప్రస్తుతం #SSMB29 (మహేశ్‌బాబు -రాజమౌళి కాంబినేషన్) మూవీలో కీలక పాత్ర చేస్తున్నాడు.


