breaking news
november 14th
-
పుస్తకాలే తూనీగ రెక్కలు
పుస్తకం తెరిస్తే ఉన్న చోటు నుంచి మాయమైపోతాం. తూనీగల్లా మారిపోతాం. పుస్తకంలోని కథలు జరిగే చోటుకంతా రెక్కలాడిస్తూ ఎగిరెళ్లిపోతాం. ‘గుడ్ బాయ్’, ‘గుడ్ గర్ల్’ అనిపించుకోవాలని అందరూ అనుకుంటారు. మంచి నడవడిక ఉంటేనే గుడ్బాయ్, గుడ్గర్ల్ అయిపోరు. మంచి మార్కులు వస్తే అయిపోరు. ఆటలాడితే అయిపోరు. మంచి పుస్తకం కూడా చదవాలి. ఎన్ని పుస్తకాలు చదివితే అంత గుడ్ మనలోకి వచ్చేస్తుంది. నవంబర్ 14 ‘చిల్డ్రన్స్ డే’ సందర్భంగా మీ అమ్మానాన్నలతో వెళ్లి మీకు నచ్చిన పుస్తకాలు కొనుక్కోండి. ఈ 10 పుస్తకాల్లో నుంచి కూడా ఎంచుకోవచ్చు.పంచతంత్రంపంచతంత్ర కథల గురించి వినకపోయినా, తెలియకపోయినా మనం పిల్లలు అయినట్టే కాదు. అంత గొప్ప కథలు ఇవి. తన వద్దకు వచ్చిన రాజకుమారులకు విద్యాబుద్ధులు నేర్పే క్రమంలో ఒక గురువు చెప్పిన కథలే ఈ ‘పంచతంత్రం’. సంస్కృతంలో విష్ణుశర్మ రాసిన ఈ కథల్ని ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువదించారు. తెలుగులోనూ అనేకమంది వీటిని అనువదించారు. రచయిత, అనువాదకుడు సహవాసి (జంపాల ఉమామహేశ్వరరావు) నుంచి వచ్చిన పుస్తకం ఇది. ప్రతి కథలోనూ ఓ నీతిని గ్రహించేలా ఈ కథల్ని తీర్చిదిద్దారు.తెనాలి రామలింగని కథలు‘వికటకవి’ తెనాలి రామలింగడంటే తెలుగు పిల్లలకు తెగ ఇష్టం. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని చెప్పిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఒకడు తెనాలి రామలింగడు. ఈయన చాలా తెలివైనవాడు. ఎన్నో జటిల సమస్యలను యుక్తితో పరిష్కరించాడు. అలా ఆయన జీవితం చుట్టూ అల్లుకున్న కథలు తెలుగు జనబాహుళ్యంలో విస్తృతమైన పేరు పొందాయి. అనేకమంది రచయితలు వీటిని రాయగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.మర్యాద రామన్న కథలుమర్యాద రామన్న కథలన్నీ తెలివితేటలు పెంచేవే. పేద కుటుంబంలో పుట్టి, రాజుగారి వద్ద గొప్ప పేరు సంపాదించి, ఊరంతటికీ ఉపకారం చేసిన వ్యక్తి మర్యాద రామన్న. సమస్యతో అతనివద్దకు వస్తే దానికి తప్పకుండా పరిష్కారం చూపుతాడు. ఆయన పరిష్కరించిన సమస్యలతో పాటు ఈ కథల్లో ఆనాటి జీవనం, వారి స్థితిగతులను చూడొచ్చు. వివేకం ఉంటే ఎంతటి సమస్యనైనా ఎదుర్కొని నిలబడవచ్చే విషయం ఈ కథల ద్వారా చిన్నారులకు చేరుతుంది.పురాణాల్లోని 35 నీతి కథలుపురాణాల ద్వారా పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మంచి నడవడికను పొందొచ్చు. ఈ అంశాలను క్రోడీకరించి ప్రముఖ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రాసిన 35 నీతి కథలివి. ఇందులో కథలన్నీ చాలా సులభరీతిలో అర్థమవుతాయి. ఇవి చదవడం ద్వారా పిల్లలకు పురాణాల మీద అవగాహన ఏర్పడటంతోపాటు జీవితంలో ఎలా మెలగాలో తెలుస్తుంది.పేదరాశి పెద్దమ్మ కథలుఇప్పుడంటే రైళ్లు, విమానాలు వచ్చాయిగానీ ఒకప్పుడు కాలినడక మీదే ప్రయాణాలు చేసేవారు. అలాంటి బాటసారులకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి, వారికి కమ్మటి భోజనం పెట్టి, చెవికింపుగా కథలు చెప్పే పాత్రే పేదరాశి పెద్దమ్మ. పేదరాశి పెద్దమ్మ చెప్పే ప్రతి కథలోనూ నీతితోపాటు మంత్రాలు, మాయలు, హాస్యం, జంతువులు ఉంటాయి. అవన్నీ చిన్నారులకు ఆసక్తి కలిగించి, వారి ఊహాశక్తిని పెంచుతాయి.రైలు బడి జపనీస్ భాషలో 1981లో వెలువడిన ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ముప్పై భాషల్లోకి అనువాదమై కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. టెలివిజన్ వ్యాఖ్యాత టెట్సుకో కురొయనాగి బాల్యంలోని తన రైలు బడి, అక్కడి విశేషాల గురించి రాసిన విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకం విద్యాబోధనతో వినోదాన్నీ, స్వేచ్ఛనూ, ప్రేమనూ కలగలిపిన ఆదర్శవంతమైన టోక్యో పాఠశాల గురించి వివరిస్తుంది. ఎన్.వేణుగోపాల్ ఈ పుస్తకాన్ని అనువదించారు.అపూర్వ రష్యన్ జానపద కథలురష్యాలో బాలల సాహిత్యానికి చాలా ప్రాముఖ్యం ఇస్తారు. అక్కడి పెద్ద రచయితలు, చిత్రకారులు పిల్లల కోసం తప్పకుండా పుస్తకాలు సృష్టిస్తారు. అలా రష్యన్ భాషలో పిల్లల కోసం రాసిన 20 కథల తెలుగు అనువాదం ఈ పుస్తకం. రష్యన్ చిత్రకారులు వేసిన రంగుల బొమ్మలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులోని సముద్రతీరంలో పిల్లవాడు, లెక్కల కుందేలు, అక్కాతమ్ముడు, చందమామ రొట్టె తదితర కథలన్నీ చదవడం చిన్నారులకు వివేకాన్ని, వినోదాన్ని అందిస్తుంది.చందమామ కథలుఒకప్పుడు కథలంటే చందమామ కథలే. పిల్లల పత్రికంటే చందమామే. ఒకనాడు ప్రతి నెలా వెలువడిన మాసపత్రిక ‘చందమామ’ కోసం ఇంటిల్లిపాదీ ఎదురుచూసేవారు. చిన్నారులు చందమామ చదివి ఎన్నో విషయాలు నేర్చుకునేవారు. ప్రస్తుతం ఆ మానపత్రిక అందుబాటులో లేకపోయినా, ఆ కథల్ని పదిలంగా ఉంచాలన్న సంకల్పంతో పుస్తకాలుగా మార్చి విడుదల చేశారు. వీటిలో ఆనాటి కథలతోపాటు రంగురంగుల బొమ్మలున్నాయి. పిల్లలు కథను చదివి అర్థం చేసుకునేందుకు అవి ఉపకరిస్తాయి.ఓ చిన్నారి డైరీ జర్మనీకి చెందిన అన్నా ఫ్రాంక్ అనే బాలిక రాసుకున్న డైరీలోని అంశాలే ఈ పుస్తకం. నాజీలు యూదులపై చేసిన అకృత్యాల కారణంగా తన కుటుంబంతో కలిసి రెండేళ్ల పాటు అన్నా ఫ్రాంక్ రహస్య జీవితం గడపాల్సి వస్తుంది. ఆ సమయంలో తను రాసిన డైరీలోని అంశాలు ప్రపంచాన్ని కదిలించాయి. అనారోగ్యంతో ఆమె మరణించినా ఆమె రాతలు నేటికీ ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. ఈ పుస్తకం అనేక భాషల్లోకి అనువాదమైంది. పిల్లల ఊహల్లో ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో పిల్లలు ఈ ప్రపంచం నుంచి ఎంత మంచిని ఆశిస్తారో తెలుస్తుంది.లిప్తకాలపు స్వప్నంఏడేళ్ళకే నూరేళ్లు నిండిన క్లింట్ అనే కేరళ బాలుడి జీవిత కథ ఇది. ఆ కాసింత కాలంలోనే ఇరవయ్యైదు వేల బొమ్మలు గీసి, వాటిని తన జ్ఞాపకాలుగా వదిలి వెళ్ళాడు. అతని ఆసక్తులు, అతని వేళ్ళలోని ప్రతిభ, అతని ఆలోచనల్లోని పదును, అతని అమ్మానాన్నల మురిపెం, అతని చుట్టూ ఉన్న వాళ్ళ అపేక్ష..ఇవన్నీ వ్యక్తపరిచే పుస్తకమిది. క్లింట్ గీసిన బొమ్మలు ఈ పుస్తకంలో ఉన్నాయి. స్వర్ణ కిలారి ఈ పుస్తకాన్ని అనువదించారు. -
సాక్షి టీవీ లిటిల్ స్టార్స్ స్పెషల్ డ్రైవ్ ప్రోమో
-
14న సెల్ఫోన్స్ స్విచాఫ్ చేయండి!
చెన్నై, టీ.నగర్: బాలల దినోత్సవం నవంబరు 14వ తేదీన సెల్ఫోన్లు స్విచాఫ్ చేసి పిల్లలతో ఆనందంగా గడపాల్సిందిగా తల్లిదండ్రులకు పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం అన్ని పాఠశాలలకు ఒక సర్క్యులర్ పంపింది. పాఠశాలల్లో నవంబరు 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ తరçఫున ఆరోజున సెల్ఫోన్లను లేకుండా గడపాల్సిందిగా పిలుపునిచ్చింది. ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు తల్లిదండ్రులు తమ సెల్ఫోన్లను స్విచాఫ్ చేసి పిల్లలతో గడపాలని, దీన్ని వారానికి ఒకసారి లేదా రోజూ కూడా అమలులోకి తీసుకురావచ్చని తెలిపింది. విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రుల వద్ద ఈ విషయంపై ఒత్తిడి తేవాలని కోరింది. పిల్లలు, ఉపాధ్యాయులు దీన్ని ఆచరణలో పెట్టాలని పేర్కొంది. -
‘నవంబర్ 14 అంకుల్ డే..’
సాక్షి, న్యూఢిల్లీ : బాలల దినోత్సవాన్ని నవంబర్ 14కు బదులు డిసెంబర్ 26న నిర్వహించాలని వంద మందికి పైగా బీజేపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నవంబర్ 14న బాలల సంక్షేమం కంటే జవహర్లాల్ నెహ్రూకు చిన్నారులపై ప్రేమ గురించిన ప్రస్తావనే అధికమవుతోందని వారు ఆక్షేపించారు. మొఘలులకు వ్యతిరేకంగా గురు గోవింద్ సింగ్ మైనర్ కుమారులు షహిజద అజిత్ సింగ్ (18), జుజార్ సింగ్ (14), జోర్వార్ సింగ్ (9), ఫతే సింగ్ (7)ల ప్రాణ త్యాగానికి ప్రతీకగా డిసెంబర్ 26న బాలల దినోత్సవం నిర్వహించాలని కోరారు. జవహర్లాల్ నెహ్రూ జయంతైన నవంబర్ 14ను ‘అంకుల్ డే’ లేదా ‘చాచా దివస్’గా జరపాలని లేఖలో ప్రధానిని కోరారు. గురు గోవింద్ సింగ్ కుమారుల బలిదానాల స్ఫూర్తిని చిన్నారుల్లో నింపేందుకు డిసెంబర్ 26ను బాలల దినోత్సవంగా జరపడం సముచితమని పేర్కొన్నారు. -
నవంబర్ 14న దళిత క్రైస్తవ గర్జన
ఒంగోలు : నవంబర్ 14న దళిత క్రైస్తవ గర్జన రాజమండ్రిలో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే డేవిడ్ రాజు తెలిపారు. స్థానిక పంచాయతీరాజ్ అతిథి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలో అఖిల పక్షం బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాన మంత్రిని కలుస్తామన్నారు. ఆల్ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ జార్జి శ్రీమంతుల మాట్లాడుతూ ఎస్సీగా పుట్టిన వారు నచ్చిన దైవాన్ని కొలవాలనుకోవడం నేరమా అని ప్రశ్నించారు. బౌద్ధులకు, సిక్కులకు ఉన్న మత స్వేచ్ఛ ఎస్సీలకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రైస్తవుల ఆస్తులను పరిరక్షించాలన్నారు. ఫెడరేషన్ జాతీయ నాయకుడు గద్దపాటి విజయరాజు, నాగార్జున యూనివర్శిటీ సిండికేట్ సభ్యుడు టీఎస్ఎస్ సింగ్ మాస్టరు, రెవరెండ్లు కె. సామ్రాట్, బిషప్ జాకబ్ సామ్యూల్, పి. డేవిడ్, పి. విలియం కేరి, పి. అల్బర్ట్ మాథ్యూ తదితరులు పాల్గొన్నారు.


