ఆ ప్రమాదం : వాళ్ల ప్రేమకు పునర్జన్మ! | National Doctors day special chit chat with Dr Ramesh | Sakshi
Sakshi News home page

ఆ ప్రమాదం : వాళ్ల ప్రేమకు పునర్జన్మ!

Jul 1 2025 2:53 PM | Updated on Jul 1 2025 2:53 PM

National Doctors day special chit chat with Dr Ramesh

లవ్‌ 

సురేశ్, సమీర (పేర్లు మార్చాం) ప్రేమించుకున్నారు. అయితే అన్ని ప్రేమకథల్లోలాగే అమ్మాయి వాళ్ల పెద్దలు ఈ ప్రేమను ఒప్పుకోలేదు. కలిసే బతుకుదామని నిర్ణయించు కున్నారు. పారిపోయి పెళ్లి చేసుకుందామనుకున్నారు.  అమ్మాయి నిర్ణీత స్థలానికి రాగానే అప్పటికే అక్కడ టూ వీలర్‌ మీద వెయిట్‌ చేస్తున్న సురేశ్‌... సమీరను పికప్‌ చేసుకున్నాడు. అసలే యాంగై్జటీ. తమను వెతికేవారికి దొరక్కూడదనే టెన్షన్‌. ఆ యాంగై్జటీ, టెన్షన్లతో బండి వేగంగా నడిపాడు. ఫలితం... బండి బోల్తా కొట్టి యాక్సిడెంట్‌ అయ్యింది. 

వెంబడిస్తున్న సమీర తరఫు బంధువులకు అమ్మాయి చిన్న చిన్న దెబ్బలతో సేఫ్‌గానే దక్కింది. కానీ... సురేశ్‌ తల బద్దలైంది. అచ్చం అతడి ప్రేమలా! 

సురేశ్‌ మెదడు బయటకు వచ్చింది. ఛాతీ ఎముకలూ విరిగాయి. పొట్టలోకి నీరు వచ్చింది. ఇలా మెడికల్‌కు సంబంధించిన మల్టీ డిసిప్లినరీ సమస్యలెన్నో వచ్చాయి. 

ఆ స్థితిలో తీసుకువచ్చిన సురేశ్‌కు చికిత్సలు చాలా జాగ్రత్తగా అందించాల్సి వచ్చింది. తల తాలూకు చిన్న చిన్న ముక్కలు కొన్ని (మరీ లోతుగా కాకపోయినా) మెదడులోనూ ఇరుక్కున్నాయి. మెదడులోకి లోతైన గాయాలు కాకుండా వాటిని చాలా జాగ్రత్తగా బయటకు తీయాల్సి వచ్చింది. వెంటిలేటర్‌పై పెట్టి చికిత్స ఇవ్వాల్సిన పరిస్థితి.

అత్యంత సునిశితమైన చికిత్సలూ, గాజుబొమ్మలా చూసుకున్న జాగ్రత్తల తర్వాత ఎట్టకేలకు సురేశ్‌ కోలుకున్నాడు.  ఈలోపు... వాళ్ల ప్రేమకథలో ఓ ట్విస్ట్‌. అతడి యాక్సిడెంట్‌ వృత్తాంతం వాళ్ల క్లోజ్‌ క్లోజ్‌ సర్కిల్స్‌లో వ్యాపించడంతో అతడికి సంబంధాలేమీ రాలేదు. అటువైపు ఆ అమ్మాయి పరిస్థితీ అంతే.  బద్దలైన తల తాలూకు చిన్న చిన్న ముక్కల్నీ పేర్చి అతికిస్తే అవే మెల్లగా అమరాయి కదా...  అచ్చం అలాగే పెద్దలు బద్దలు చేయాలనుకున్న వాళ్ల ప్రేమ కూడా చక్కగా కుదిరింది. వెరసి పెళ్లీ జరిగింది.  తన కాళ్ల మీద నిలబడ్డ సురేశ్‌ ఇప్పుడు ఓ మంచి రెస్టారెంట్‌ నడుపుతున్నాడు. వాళ్లిద్దర్నీ చూసినప్పుడు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది.   
                     

డాక్టర్‌ ఎస్‌. రమేశ్‌ సీనియర్‌ న్యూరో సర్జన్,  మినిమల్‌ యాక్సెస్‌ బ్రెయిన్‌ – స్పైన్‌ సర్జన్, 
కామినేని హాస్పిటల్స్,  హైదరాబాద్‌

  • యాసీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement