
సాధారణంగా ఉండాల్సిన దానికి మించి బరువు పెరిగితే అధిక బరువుతో బాధపడుతున్నాం అనే అనుకుంటాం. ప్రతీ భారీకాయానికి అధిక బరువే సమస్య అని పొరపడొద్దు. ఎందుకంటే ఇక్కడొక మహిళ అలానే తప్పుగా అనుకుని నానాపాట్లు పడింది. చివరికి అది తగ్గే ఛాన్స్ లేని అసాధారణమైన వైద్య పరిస్థితి అని తెలిసి తల్లడిల్లిపోయింది. అయితే ఆమె తన అచంచలమైన స్థైర్యంతో ఎదుర్కొని ఎంతలా బరువు తగ్గిందో తెలిస్తే విస్తుపోతారు. అధిక బరువుతో ఇబ్బందిపడేవాళ్లకు ఆమె కథే ఒక స్ఫూర్తి .
అసలేం జరిగిందంటే.. డెట్రాయిట్(Detroit)కు చెందిన 35 ఏళ్ల జమైక మౌల్దిన్(Jameka Mauldin) అనే సింగిల్ మదర్ విపరీతమైన అధిక బరువుతో ఇబ్బంది పడేది. అందుకోసం వర్కౌట్లు, డైటింగ్ వంటివి పాటించేది. అయితే అనుహ్యంగా ఆమె బరువు పెరగడం, శరీరం ఏదో బిగుతుగా మారి ఇబ్బందికరంగా అనిపించేది ఆమెకు. కచ్చితంగా ఇది అధిక బరువు కాదు అంతకు మించింది ఏదో అయి ఉండొచ్చనే అనుమానం కలిగేది జమైకాకు. అదే విషయాన్ని వైద్యులకు తెలిపినా..మరింత కష్టపడాలి అని సూచించేవారే తప్ప ఆమె సమస్య ఏంటో నిర్థారించలేకపోయేవారు.
చివరికి 2019లో ఆమె విపరీతమై శరీర బాధకు తాళ్లలేక వైద్యులను సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. జమైక లింఫెడిమా అనే సమస్యతో బాధపడుతున్నట్లు నిర్థారించారు. దీని కారణంగా శరీర కణజాలంలో ద్రవం పేరుకుపోయి, వాపుకు దారితీసే దీర్ఘకాలిక వ్యాధి.
అంతేగాదు దీన్ని కొవ్వు సంబంధిత రుగ్మతగా కూడా పేర్కొంటారు. దీని వల్ల బరువు పెరగడమే కానీ తగ్గడం అనేది సాధ్యం కాదు. దాంతో జమైకాకు వైద్యులు సైతం వర్కౌట్లు చేయాలని, కష్టపడమని సూచించలేదు. పైగా ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని తగ్గించే మార్గంపై దృష్టిసారించారు.
సంకల్పం బలంతో ఆ వ్యాధిపై పోరాడింది..
ఆమె దగ్గర దగ్గర 324 కిలోలు పైనే అధిక బరువుకి చేరుకుంది. దాంతో ఆమెకు రోజువారి పనులతో సహా ప్రతిది కష్టమైపోయేది. ఒకరి సహాయం లేకుండా కనీసం బాత్రూమ్‌కి కూడా వెళ్లలేని స్థితికి చేరుకుంది. అయితే దీన్ని ఆమె సానుకూల దృక్పథంతో, సంకల్ప బలంతో జయించే ప్రయత్నం చేసింది. ఈ రోజు ఈ ఒక్కపని ఫినిష్ చేయాలి అని కేటాయించుకుంటూ..చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకునేది.
దాంతోపాటు ఫిజికల్ థెరపీ, జీవనశైలి మార్పులు, ప్రత్యేకమైన లిపోసక్షన్ పద్ధతులతో సుమారు 159 కిలోలకు తగ్గింది. ఇక్కడ జమైక ఎలాంటి అధునాతన ఇంజెక్షన్‌లు, ఖరీదైన జిమ్‌లు, అద్భుత శస్త్ర చికిత్సలు వంటివి ఏమి లేకుండా కేవలం తన పట్టుదల, సంకల్పంతో ఆ రోగాన్ని జయించి బరువు తగ్గింది. అంతేగాదు సర్టిఫైడ్ నర్సింగ్ అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యింది కూడా.
తన కూతురు 15 ఏళ్ల జామ్యా కారణంగానే ఈ భయానక అధిక బరువుపై విజయం సాధించానని చెప్పుకొచ్చింది. అంతేగాదు ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఒక పట్టాన నయం కాని వ్యాధులను ధైర్యంగా ఎదుర్కొనడంపై అవగాహన కల్పించేలా తన కథనే వివరిస్తూ ఒక పుస్తకం కూడా రాయాలనుకుంటోందామె.
(చదవండి: చాట్‌జీపీటీ ఆధారిత డైట్‌తో..ఆస్పత్రి పాలైన వ్యక్తి..!)