
మిస్ యూనివర్స్ కోసం హైదరాబాద్‌లో సన్నాహాలు
ఈ సారి థాయ్‌లాండ్ వేదికగా మిస్ యూనివర్స్
మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ఎంపిక
‘సాక్షి’తో అనుభవాలు పంచుకున్న టాప్ 15 ఫైనలిస్టులు
హైదరాబాద్ నగర వేదికగా ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు ముగిశాయో లేదో మరో ప్రతిష్టాత్మక ఫ్యాషన్ ఈవెంట్ ‘మిస్ యూనివర్స్’ ప్రారంభమవుతోంది. ఈ సారి థాయ్‌లాండ్‌లో జరగనున్న మిస్ యూనివర్స్ 2025 కోసం భారత్ నుంచి మిస్ యూనివర్స్ ఇండియాను ఎంపిక చేయడానికి ఆడిషన్స్ మొదలయ్యాయి. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల నుంచి మిస్ యూనివర్స్ తెలంగాణ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్‌లను ఎంపిక చేయడానికి ప్రతి రాష్ట్రం నుంచి 15 మంది ఫైనలిస్ట్‌లను ఎంపిక చేశారు.
హైదరాబాద్ నగరంలో జరగనున్న ఫినాలేలో ఎంపిక చేసిన ఆ ఇద్దరినీ తెలుగు రాష్ట్రాల తరపున మిస్ యూనివర్స్ ఇండియా గ్రాండ్ ఫినాలేకు పంపిస్తారు. ఈ నేపథ్యంలో మిస్ యూనివర్స్ పోటీల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన కొందరు ఫైనలిస్టులు తమ ప్రయాణాన్ని, ఆలోచనలను ‘సాక్షి’తో పంచుకున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
మాది మల్టీ టాస్కింగ్..
నాది విశాఖపట్నం, ప్రస్తుతం ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. మెడిసిన్, మోడలింగ్ రెండూ చిన్నప్పటి కలలే. ఆడవారికున్న శక్తి మల్టీ టాస్కింగ్. నేను బ్రాహ్మన వర్గం నుంచి వచ్చాను.. మొదట్లో కుటుంబం నుంచి అడ్డంకులు వచ్చినప్పటికీ ఇంట్లో ఒప్పించాను. ఏ రంగంలో చూసినా తెలుగు వారు టాప్‌లో ఉన్నారు. మిస్ యూనివర్స్‌లో సత్తా చాటాలని నిర్ణయించుకున్నా.

హైదరాబాద్ నగరంతో పాటు ఢిల్లీ, ముంబయి వంటి ప్రాంతాల్లో ర్యాంప్ వాక్, గ్రూమింగ్, స్టైల్స్ వంటి అంశాలపై శిక్షణ తీసుకున్నా. ఇప్పటికీ ఇంట్లో మగవారికి పీరియడ్స్ గురించి చెప్పుకోలేని పరిస్థితి. దీనిని పోగొట్టడానికి ఈ వేదికను వినియోగించుకుంటా. డాక్టర్‌గా కన్నా ఫ్యాషన్ ఐకాన్‌గా ఈ అంశాన్ని మరింత ప్రభావ వంతంగా ముందుకు తీసుకెళ్లగలను.
– డా.వైష్ణవీ వెన్నెల, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఫైనలిస్టు
ప్రియాంక చోప్రా స్ఫూర్తి..
పుట్టి పెరిగింది, చదువుకున్నదంతా హైదరాబాద్‌లోనే.. డేటా సైన్స్– ఏఐలో బీటెక్ చేశా. నాకున్న టాలెంట్ స్కిల్‌తో టాప్ 15లో స్థానం పొందాను. ఈ ఎంపికలో ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నామన్నదే ముఖ్యం. ఫ్యాషన్ వాక్, ప్రజెంటేషన్, డ్రెస్సింగ్ వంటి అంశాల్లో ఆడిషన్స్ జరిగాయి. ప్రియాంక చోప్రా, లారా దత్త ఇష్టం. మోడలింగ్ కోసం పలు అంశాల్లో ముంబయిలో శిక్షణ తీసుకున్నా.
హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ జరిగితే ఎంత గర్వపడ్డామో.. ఒక ఆడపిల్ల బ్యూటీ పేజెంట్‌లో పాల్గొంటే అంతే గర్వపడాలి. నా బ్యూటీ విత్ పర్సస్.. చిన్నారుల కోసం పనిచేయడం. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలి. విపత్కర పరిస్థితుల్లో ఎలా రక్షించుకోవాలో నేర్పించాలన్నదే లక్ష్యం. పలు ఎన్‌జీఓలతో పనిచేశాను.
– అను శ్రీ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఫైనలిస్టు
మిస్ టీన్ తెలంగాణ..
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చేస్తున్నా. రెండేళ్ల నుంచి మోడలింగ్‌లో ఉన్నా. 2023లో ఢిల్లీలో నా మొదటి కాంపిటీషన్‌లో మిస్ టీన్ తెలంగాణ క్రౌన్, తరువాతి ఏడాది ఫ్యాషన్ ఐకాన్ అవార్డ్ గెలుచుకున్నా. మిస్ యూనివర్స్ కిరీటం కన్నా, దాని వల్ల వచ్చే గుర్తింపు శక్తివంతమైనది. నేను బ్రాహ్మణ వర్గం నుంచే వచ్చాను.

ఈ విషయంలో నాన్న నన్ను అర్థం చేసుకుని ప్రోత్సహించారు. సినిమాలు, మోడలింగ్, చదువును బ్యాలెన్స్ చేస్తూ వచ్చాను. తెలుగమ్మాయిల అందమంతా వారి కళ్లలోనే కనిపిస్తుంది. ఉమెన్ సేఫ్టీ, వాటర్ స్కేర్ సిటీ, నిరుద్యోగం అంశాల్లో కృషి చేయాలనుంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, ఉద్యోగాలకు దూరమవుతున్నారు. దీని పైన దృష్టి సారిస్తున్నా.
– లక్షణ అత్తిలి, మిస్ యూనివర్స్ తెలంగాణ ఫైనలిస్టు
విలేజ్ టూ మిస్ యూనివర్స్..
నేనొక డాక్టర్.. విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో హౌస్ సర్జన్‌గా చేస్తున్నా. 2019 నుంచి బ్యూటీ పేజెంట్‌లో పలు సార్లు రిజెక్ట్ అయ్యినా పట్టుదలతో మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఫైనలిస్టుగా నిలిచాను. నాన్న రైతు.. మారుమూల గ్రామం. ఇక్కడి అమ్మాయిలకు ఎన్నో బంధనాలు. వాటన్నింటీనీ చేధించాలనేదే లక్ష్యం. గతంలో రన్నరప్‌గా నిలిచిన ఆటో డ్రైవర్ కూతురు మాన్యా సింగ్ నాకు స్ఫూర్తి.

మహిళలు పెద్ద లక్ష్యాలను ఎంచుకోడానికి భయపడుతున్నారు. దానిని సాధించి ఈ తరానికి ఒక మార్గదర్శకంగా నిలవాలనుంది. విశ్వ వేదిక పై మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించాలనుంది. సాఫల్య అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి మహిళలకు, బాలికలకు మెన్‌స్ట్రువరల్ హైజీన్‌పై అవగాహన కల్పిస్తున్నా.
– డా.సురేఖ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఫైనలిస్టు
మాతృభూమిపై ప్రేమతో..
న్యూయార్క్‌లో పుట్టాను, న్యూ జెర్సీలో పెరిగాను. నా మాతృభూమిపై ప్రేమతో కుటుంబంతో పాటు హైదరాబాద్ వచ్చాను. అమ్మ ఒకే మాట చెబుతుంది.. ఏది చేసినా చదువును నిర్లక్ష్యం చేయొద్దని. అందుకే మెడిసిన్, మోడలింగ్, యాక్టింగ్ రంగాల్లో రాణిస్తున్నా. మిస్ యూనివర్స్‌తో పాటు, నటనలో ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ యువతిగా నిలవాలనేదే లక్ష్యం.

బాడీ టైప్, కలర్‌పై వారికి తోచింది మాట్లాడతారు. ఎవరేమన్నా మనల్ని మనం ప్రేమించుకోవడం ముఖ్యం. సొంతంగా గ్రూమింగ్, మేకప్ ప్రతిదీ నేర్చుకున్నా. బేసిక్ మెంటల్ హెల్త్‌పై, డొమెస్టిక్ హౌస్ హోల్డ్ వయెలెన్స్‌పై అవగాహన కలి్పంచడం విధిగా పెట్టుకున్నాను. జెండర్ స్టీరియోటైప్ పోగొట్టిన రాణి రుద్రమా దేవి నాకు స్ఫూర్తి.
– కశ్వి, మిస్ యూనివర్స్ తెలంగాణ ఫైనలిస్టు