
స్ఫూర్తి
పుట్టే బిడ్డకు రోగ నిరోధక శక్తినిచ్చేది తల్లి పాలు. ఇదే పోషకాహారం కూడా. అందాన్ని కాపాడుకునేందుకు కొద్దిమంది తల్లులు బిడ్డలకుపాలు ఇవ్వడం మానేసిన ఈ రోజులలో తిరుచ్చికి చెందిన బృంద నెలల తక్కువతో పుట్టే బిడ్డలకు అమృత మూర్తి అయ్యారు. తమిళనాడులోని తిరుచ్చి ప్రభుత్వ మహాత్మా గాంధి స్మారక ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లి పాల బ్యాంక్‌కు 300.17 లీటర్లపాలను దానం చేసి రికార్డులోకి ఎక్కారు. తిరుచ్చి కాట్టూరుకు చెందిన సెల్వ బృంద (34) ఇద్దరు బిడ్డల తల్లి.
తల్లి పాలు పిల్లలకు శ్రేయస్కరం అని చాటే విధంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది బృంద. పసి బిడ్డల పాలిట అమృత మూర్తిగా ఉన్న సెల్వ బృంద దాన గుణానికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఆమెకు ‘అమృతం ఫౌండేషన్’ అండగా నిలిచింది. ‘సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలు, వ్యక్తిగత కారణాల వల్ల తల్లులుపాలను దానం చేయడానికి ముందుకు రావడం లేదు. తొలి నాళ్లలో నన్ను చాలా మంది తక్కువగా అంచనా వేశారు. నిరాశపరిచే మాటలు వినిపించేవి. అయినా వెనక్కి తగ్గలేదు. తల్లిపాల దానంపై అవగాహన విస్తృతం కావాలి. పిల్లలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించాలి’ అంటుంది సెల్వ బృంద.
– అస్మతీన్ మైదీన్, సాక్షి–చెన్నై
ఇవీ చదవండి: సారా టెండూల్కర్ కొత్త చాలెంజ్ క్రియేటివ్ వీడియో వైరల్
‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు