నివాళి
స్టూడియో గోడల మధ్య మగ్గుతున్న తమిళ సినిమాకు నాలుగు దిక్కులా కిటికీ తెరిచిన ‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శక శిఖరం) భారతీ రాజా కన్నుమూశారు.
‘సీతాకోకచిలుక’, ‘తూర్పు వెళ్లే రైలు’, ‘పదహారేళ్ల వయసు’, ‘ఎర్ర గులాబీలు’... తన కథలతో వెండితెరపై కవిత్వం చేశారు. పెద్ద పెద్ద స్టార్లు ఆయన చేతిలో పాత్రలయ్యారు. విగ్గుల వేషాలు అసలు సిసలు పల్లెటూరి మనుషులయ్యాయి. నేడు భారతీరాజా లేరు. కానీ ఆయన సినిమాల్లోని పల్లెటూరి గాలి ప్రేక్షకులను తాకుతూనే ఉంటుంది. వరి చేల మీది సంగీతం వినిపిస్తూనే ఉంటుంది. ఆయన చూపిన మనిషి మనతో మాట కలుపుతూనే ఉంటాడు.
‘ఎన్ ఇనియ తమిళ్ మక్కళే...’ ‘నా ప్రియమైన తమిళ ప్రజలారా’ అని తన ప్రతి సినిమా మొదట్లో పలకరించే భారతీ రాజా ఇక పై అలా పలకరించరు. దర్శకులకే దర్శకుడిగా, వెండితెరకు మట్టి పరిమళం అద్దినవాడిగా, భావుకునిగా, కెమెరాతో కవిత్వం రాసే పిపాసిగా కోట్లమంది ప్రేక్షకుల అభిమానం పొందిన భారతీ రాజా స్వర్గలోకంలో విలేజ్ కాటేజీ బయట నులక మంచం పై విశ్రమించడానికి వెళ్లిపోయారు. గొంగళిపురుగు వంటి సమాజాన్ని తన కథల స్పర్శతో సీతాకోక చిలుకగా మలిచేందుకు తపించిన భారతీ రాజా మరణంతో దక్షిణాది సినీ పరిశ్రమ ధ్రువతార లేని ఆకాశమైంది. భారతీ రాజా కథ ఎప్పుడూ పల్లెకే పరుగులు తీసింది, కానీ ఆ పల్లె అమాయకత్వానికి పూసిన పూత కాదు... ఆ పల్లెలో దుమ్ము ఉంది, దగా ఉంది, దాహం ఉంది.
చిన్నసామి పెరియమాయ దేవర్ (85) 1941 జూలై 17న తమిళనాడులోని తేని అల్లినగరంలో జన్మించారు. చిన్నసామికి చిన్నప్పుడే కళలంటే మక్కువ. ఆ ఇష్టంతోనే ఆయన సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. పి. పుల్లయ్య, ఎం. కృష్ణన్ నాయర్ తదితర దర్శకుల దగ్గర దర్శకత్వ శాఖలో చేశారు. ‘16 వయదినిలే’ (1977) చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా పోస్టర్‌లో చిన్నసామి పేరు ‘భారతీ రాజా’ అని ఉంటుంది. తమిళ ప్రముఖ కవి సుబ్రమణ్య భారతియార్ అంటే ఉన్న ఇష్టంతో తన స్క్రీన్ నేమ్‌ని ‘భారతీ రాజా’గా పెట్టుకున్నారు.
పదహారేళ్ల వయసు ప్రేమ
ఒక అందగత్తె, ఓ అమాయకుడికి ముడిపెట్టిన కథ ‘16 వయదినిలే’. ఈ పల్లెటూరి కథలో అందగత్తెని పొందాలని పోకిరీలు ఎదురు చూస్తుంటారు. అమాయకుడైన పశువుల కాపరికి ఆమె అంటే ఇష్టం ఉన్నా చెప్పడు. దుర్మార్గుడి చేతిలో ఆమె జీవితం బలి కాకుండా హత్య చేసి, జైలుకి వెళతాడు కాపరి. ‘తిరిగొస్తా’ అని ఆమెకు మాటిస్తాడు. ఈడూ జోడూ బాగాలేకపోయినా ఈ ఇద్దరూ ఒకటైతే బాగుండు అని ప్రేక్షకులు ఆ ప్రేమను ఫీలవుతారు. అందుకే ఈ సినిమా 175 రోజులు ఆడింది.
ఎస్. జానకికి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు తెచ్చింది. మరి... ‘సెంధూర పూవే’ (సిరిమల్లె పువ్వా...) అంటూ ఆమె పాడిన పాటను అంత సులువుగా మరచిపోగలమా! కమల్‌హాసన్ (అమాయకుడు), రజనీకాంత్ (విలన్ షేడ్ ఉన్న పాత్ర), శ్రీదేవిలకు మంచి పేరొచ్చింది. ఈ చిత్రం తెలుగులో చంద్రమోహన్, మోహన్‌బాబు, శ్రీదేవి కాంబినేషన్‌లో ‘పదహారేళ్ల వయసు’గా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొంది, హిట్ అయింది. హిందీలో ‘సోల్వా సావన్’గా భారతీ రాజా దర్శకత్వంలోనే తెరకెక్కి, విజయం సాధించింది.
ప్రేమ ప్రయాణం
ఒక రైలు ఇద్దరి ప్రేమికులకు రాయబారిగా మారుతుంది. పరిస్థితులు అనుకూలించక పట్టణం వెళ్లే యువకుడు, పల్లెటూరిలో మిగిలిపోయిన అతని ప్రేయసి... ఈ ఇద్దరూ వచ్చే పోయే రైలు వెనక ప్రేమ సందేశాలు పంపించుకుంటారు. అయితే ఆ యువతి మీద బావ కన్నేస్తాడు. ఆచారం పేరు చెప్పి, ఆ యువతి నగ్నంగా గ్రామంలో తిరగాలని నిబంధన పెడతారు. అలా ఆ యువతి తిరుగుతున్న సమయంలో ఆ యువకుడు యువతితో సహా రైలు ఎక్కుతాడు.
ఈ రైలు ప్రయాణంతో ప్రేక్షకుల మనసు కూడా ప్రయాణించింది. అందుకే ఈ సినిమా ఏడాది ఆడింది. కథానాయికగా పరిచయమైన రాధికకి మంచి పేరొచ్చింది. తెలుగు హీరో సుధాకర్ కూడా తమిళ ప్రేక్షకుల ప్రేమను పొందారు. ఈ చిత్రం తెలుగులో ‘తూర్పు వెళ్లే రైలు’ పేరుతో బాపు దర్శకత్వంలో జ్యోతి, మోహన్ కాంబినేషన్‌లో రీమేక్ అయి, ఘనవిజయం అందుకుంది. ‘పల్లె ప్రేమకథా చిత్రాలే తీయగలడు’ అని భారతీ రాజా మీద ముద్ర వేశారు. కానీ తనలో ఇంకో కోణం ఉందన్నారు భారతీ రాజా.
థ్రిల్ జర్నీ
కమల్‌హాసన్, శ్రీదేవి కాంబినేషన్‌లో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘సిగప్పు రోజాక్కళ్’ మొదలుపెట్టారు భారతీ రాజా. స్త్రీలను ద్వేషించే ఒక సైకో కిల్లర్ వాళ్లని ప్రేమలో పడేసి, పెళ్లి చేసుకుని క్రూరంగా చంపేస్తుంటాడు. అలా ఒక అమ్మాయిని వలలో వేసుకుని, పెళ్లాడతాడు, సహజంగానే ధైర్యవంతురాలు, తెలివిగల అమ్మాయి కావడంతో తన భర్త ఒక సీరియల్ కిల్లర్ అని కనిపెడుతుంది. చివరికి తన ప్రాణాలను కాపాడుకుని, ఆ సైకో బారి నుంచి ఎలా బయటపడింది? అనేది కథ. భారతీ రాజా ‘అర్బన్ మూవీ’స్ కూడా తీయగలడని ఈ సినిమాతో అనిపించుకున్నారు.
ఈ సినిమాలోని పాటల్లో ‘నినైవో ఒరు పరవై’ ఒకటి. అంటే... ‘జ్ఞాపకం ఒక పక్షిలాంటిది’ అని అర్థం. పక్షిలా ఈ సినిమా నలు దిక్కులకూ వెళ్లి, ఒక మంచి జ్ఞాపకంలా మిగిలిపోయింది. తెలుగులో ‘ఎర్ర గులాబీలు’, హిందీలో ‘రెడ్ రోజ్’గా రీమేక్ అయింది. ‘సిగప్పు రోజాక్కళ్’ తర్వాత నూతన తారలతో ‘నిళల్‌గళ్’ సినిమా తెరకెక్కించారు భారతీ రాజా. ముగ్గురు నిరుద్యోగ యువకుల కష్టాలను ఈ చిత్రంలో చూపించారు. ఈ సినిమాలోని పాటల్లో ‘ఇదు ఒరు పొన్ మాలైæపొళుదు’ ఒకటి. అంటే... ‘ఇదొక బంగారంలాంటి సాయంత్రం’ అని అర్థం. కలను నిజం చేసుకోవడానికి ప్రయత్నించే యువకుడు ఆశాభావంతో పాడుకునే ఈ పాటకు ఇళయరాజా ఇచ్చిన బీట్ కుర్రకారు హార్ట్ బీట్‌కి దగ్గరైంది.
హాలీవుడ్ మేకింగ్ స్టైల్‌తో...
కమల్‌హాసన్, మాధవిలతో ‘టిక్ టిక్ టిక్’ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ తీశారు భారతీ రాజా. అయితే ఇది హాలీవుడ్ బి గ్రేడ్ ఫిల్మ్‌లా ఉందనే విమర్శలు ఎదురయ్యాయి. కానీ మేకింగ్ స్టైల్ హాలీవుడ్ తరహాలో ఉందనే ప్రశంసలూ దక్కాయి. ఈ చిత్రంలో మాధవి ‘స్విమ్ సూట్’ ధరించడం అప్పట్లో ఓ సంచలనం.
సాగర సంగమమే...
సాగరంలో ఎన్నో నదులు కలుస్తాయి. విడదీయలేని కలయిక అది. కట్టుబాట్లను తెంచుకుని, విడదీయలేనంతగా తమ ప్రేమను పండించుకోవాలనుకుంటుంది ఓ జంట. అదే ‘అలైగళ్ ఓయ్‌వదిల్లై’ (సీతాకోక చిలుక). ఈ సినిమాలో ‘సాగర సంగమమే... ప్రణయ సాగర సంగమమే’ పాట ప్రేక్షకులతో మమేకమైపోయింది. తమిళంలో కార్తీక్, రాధ జంటగా నటించిన ఈ సినిమాలో సిల్క్ స్మితను సంప్రదాయ గృహిణిగా చూపించారు భారతీ రాజా. అలాగే బాల నటు డిగా అలీకి మంచి పేరు తెచ్చిన చిత్రం ఇది. తెలుగు ‘సీతాకోక చిలుక’తో అరుణ కథానాయికగా పరిచయం అయ్యారు. తెలుగు వెర్షన్‌లో జంధ్యాల సంభాషణలు ఆకట్టుకున్నాయి.
మన్ వాసనైతో మరో హిట్
భారతీ రాజా నుంచి వచ్చిన మరో హిట్ ప్రేమకథ ‘మన్ వాసనై’. మేనమామ, మేనకోడలి ప్రేమ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది. గాజులు అమ్ముకుంటున్న పాండియన్‌ని ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారు. రేవతి కూడా ఈ చిత్రం ద్వారానే హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఈ సినిమా తెలుగులో బాలకృష్ణ, సుహాసిని జంటగా ‘మంగమ్మగారి మనవడు’ పేరుతో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రీమేక్ అయి, ఘనవిజయం సాధించింది.
ఆత్మతో ముడిపడిన ప్రేమ
అప్పటివరకూ భారతీ రాజా సినిమాల్లోని ప్రేమికులు ఎన్నో ప్రేమ ఊసులు చెప్పుకున్నారు. కానీ, మనసు నిండా ప్రేమ నింపుకుని, మాటల్లో చెప్పుకోని ఓ ప్రేమ జంటని చూపించారు భారతీ రాజా. అదే ‘ముదల్ మరియాదై’. 60 ఏళ్ల వ్యక్తి, అందులో సగం వయసు కూడా లేని ఓ యువతి మధ్య ప్రేమ ఉంటుంది. ఇక్కడ భౌతికపరమైన ప్రేమ వెనక్కి వెళ్లిపోతుంది.
ఆత్మతో పెనవేసుకున్న ప్రేమతో శివాజీ గణేశన్, రాధ కాంబినేషన్‌లో భారతీ రాజా తెరకెక్కించిన ‘ముదల్ మరియాదై’ సూపర్ డూపర్ హిట్. ‘ఆత్మ బంధువు’గా తెలుగులో విడుదలై, ఘనవిజయం సాధించింది. మరణం అంచుల్లో ఉన్న ఆ మూగ ప్రేమికుడు... ప్రేయసి కనపడ్డాకే కన్ను మూస్తాడు... ఎంత గొప్ప ప్రేమ. తర్వాతి తరంతోనూ సినిమాలు తీయడం మొదలుపెట్టిన తర్వాత కుల వివక్ష నేపథ్యంలో దగ్గుబాటి రాజా, అమల కాంబినేషన్‌లో భారతీ రాజా తెరకెక్కించిన ‘వేదమ్ పుదిదు’ ఓ సంచలనం. దగ్గుబాటి రాజా, మహేశ్వరితో ‘కరుత్తమ్మ’ తీశారు.
తెలుగులో ‘కొత్త జీవితాలు’తో...
తెలుగులో హరిప్రసాద్, సుహాసిని కాంబినేషన్‌లో ‘కొత్త జీవితాలు’ చిత్రాన్ని తెరకెక్కించారు భారతీ రాజా. తమిళంలో ఆయన దర్శకత్వంలోనే వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘పుదియ వార్పుగళ్’కి ఇది రీమేక్. అలాగే తమిళంలో సత్యరాజ్, రేఖ జంటగా తాను తెరకెక్కించిన ‘కడలోర కవిదైగళ్’ని తెలుగులో మాస్ హీరో చిరంజీవితో ‘ఆరాధన’గా తెరకెక్కించారు. ఒక టీచర్‌కి, నిరక్షరాస్యుడికి మధ్య సాగే ప్రేమతో రూపొందిన ఈ చిత్రం రెండు భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. ఇంకా సీనియర్ నటుడు కృష్ణతో ‘జమదగ్ని’ చిత్రాన్ని రూపొందించారు. తమిళ్, తెలుగు, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాలు తెరకెక్కించారు భారతీ రాజా. దర్శకుడిగా ఆయన చివరి చిత్రం ‘మీండుమ్ ఒరు మరియాదై’ (2020). ఈ చిత్రంలో లీడ్ రోల్ చేశారు.
భారత చలన చిత్ర సీమ ఒక దిగ్గజాన్ని కోల్పోయింది. భారతీ రాజాకు రీప్లేస్‌మెంట్ లేదు... మట్టి కథలకు ప్రాధాన్యం ఇచ్చి, మట్టి పరిమళాన్ని వెండితెరపై వెదజల్లి, భౌతికంగా తిరిగి రాని లోకాలకు వెళ్లిన భారతీ రాజా ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా ఉంటారు.
‘ఆర్’ అక్షరంతో నామకరణం
విజయశాంతి, రాధిక, రాధ, రేవతి, రేఖ, రంజిత, రతి అగ్నిహోత్రి, ముచ్చెర్ల అరుణ, ప్రియమణి... ఇలా పలువురు కథానాయికలను పరిచయం చేశారు భారతీ రాజా. ఆయన తెరకెక్కించిన ‘కల్లుక్కుళ్ ఈరమ్’తో విజయశాంతి నటిగా ప్రయాణం మొదలుపెట్టి, తెలుగులో లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగారు. అలాగే తాను పరిచయం చేసిన కథానాయికల పేరు మార్చాల్సి వస్తే... ‘ఆర్’ అక్షరం ఉండేలా చూసేవారు భారతీ రాజా.
నటుడిగా...
నటుడిగానూ భారతీ రాజా రాణించారు. తాను దర్శకత్వం వహించిన ‘కల్లుక్కుళ్ ఈరమ్’లో దర్శకుడి పాత్ర చేశారు. మణిరత్నం తెరకెక్కించిన ‘యువ’ సినిమాతో పూర్తి స్థాయి నటుడిగా మారారు. శింబు ‘ఈశ్వరన్’ లో, ధనుష్ ‘తిరు’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. తమిళంలో భారతీ రాజా నటించిన చివరి చిత్రం ‘పులవర్’ విడుదల కావాల్సి ఉంది. చివరిగా ఆయన మలయాళంలో ‘తుడరుమ్’లో కనిపించారు. అలాగే విజయన్, త్యాగరాజన్, మణివణ్ణన్ వంటి వారికి ఒక్కో సినిమాకి డబ్బింగ్ కూడా చె΄్పారు. ‘కరుత్తమ్మ’లో ‘కాడు పొట్టకాడు...’ అనే పాట పాడారు. బుల్లితెరకు ‘తేకత్తి పొన్నుమ్, అప్పనుమ్ నానుమ్’ వంటి సీరియల్స్‌కి, ‘మోడర్న్ లవ్ చెన్నై’ అనే వెబ్ సిరీస్‌లోని ఓ ఎపిసోడ్‌కి దర్శకత్వం వహించారు.
తనయుడి మరణంతో మనోవేదన
1974లో చంద్రలీలను వివాహం చేసుకున్నారు భారతీ రాజా. కుమారుడు మనోజ్‌కుమార్, కుమార్తె జననీ వీరి సంతానం. తండ్రి దర్శకత్వం వహించిన ‘తాజ్ మహల్’ చిత్రంతో మనోజ్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. దర్శకుడిగా ‘విజిల్, పవిత్ర, మార్గళి తింగళ్’ చిత్రాలను రూపొందించారు. 2006లో తన స్నేహితురాలు, నటి నందనని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, 2025లో గుండెపోటుతో మనోజ్ కన్ను మూశారు. కుమారుడి మరణంతో భారతీ రాజా మనోవేదనకు గురయ్యారు. మనోజ్ మరణం ఆయన్ను బాగా కుంగదీసింది.
దర్శక శిఖరానికి ఆరు జాతీయ అవార్డులు
భారతీయ చిత్ర సీమకు చేసిన ఎనలేని సేవలకు గాను భారతీ రాజాను ఎన్నో అవార్డులు వరించాయి. ‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శక శిఖరం) అనే బిరుదు ఆయన సొంతం. 2004లో భారత ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. వివిధ విభాగాల్లో మొత్తంగా 6 జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారాయన. ‘సీతాకోకచిలుక’, ‘ముదల్ మరియాదై’, ‘వేదమ్ పుదిదు’, ‘కరుత్తమ్మ’, ‘అంది మందారై’, ‘కడల్ పూక్కళ్’ చిత్రాలకు జాతీయ అవార్డులు లభించాయి. ఇంకా తమిళ నాడు రాష్ట్ర పురస్కారాలు, ఇతర అవార్డులు అందుకున్నారు. ‘సీతాకోక చిలుక’కి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు లభించింది.
– డి.జి. భవాని


