
కళ్ల ఎదుటే ఉన్న అన్నకు చెల్లెలెలాగూ రాఖీ కడుతుంది. ‘అండగా ఉండన్నా’ అంటూ అన్నదమ్ముల్ని అడుగుతుంది. కానీ... కొందరు అన్నలు అక్కడెక్కడో సుదూర మంచు పర్వత సానువుల్లోనో, ఎగిరిపడే రేణువుల ఎర్రటెడారి ఇసుకల్లోనే గస్తీ తిరుగుతూ ఉంటారు. అప్రమత్తంగా ఉంటూ అనునిత్యం మన సరిహద్దులకు కాపలా కాస్తూ ఉంటారు.
వాళ్లకు ఏ చెల్లెమ్మలూ కనబడరు. ఏ అక్కలకూ వాళ్లందుబాటులో ఉండరు. అయితే... సొంత అన్నదమ్ములైనా అవసరమైనప్పుడు రక్షణ కల్పించడానికి వస్తారో రారోగానీ ఆ సోదరులు మాత్రం ఎవరు రాఖీ కట్టినా కట్టకున్నా... శత్రువుల నుంచి నిర్భీతిగా నిత్యరక్షణకవచంలా నిరంతరమూ మనకడ్డుగా నిలబడిపోతుంటారు. వాళ్లే మన సరిహద్దులను అనుక్షణం రక్షిస్తుండే మన ఆర్మీ జవాన్లు!
ఆ ఆర్మీ అన్నలకు చెల్లెళ్ల ప్రేమానురాగాలు తప్పక దక్కాలనే సంకల్పంతో కొందరు చెల్లెళ్లు గత 28 ఏళ్లుగా ప్రయాసపడుతునే ఉన్నారు. వాళ్లు పడే ఈ ప్రయాస ప్రాధాన్యమేమింటే... వాళ్లకు అత్యంత ఆనందాన్నిచ్చే ఓ అందమైన శ్రమ. ఆ చెల్లెళ్లు మరెవరో కాదు... మహారాష్ట్ర జలగావ్‌లోని ‘ఇందిరాగాంధీ సెకండరీ స్కూల్’కు చెందిన విద్యార్థినులు.
ఒకటీ రెండేళ్లుగా కాదు... అసిధారావ్రతంలా అచ్చంగా గత ఇరవయ్యెనిమిదేళ్లుగా సైనిక సోదరులకిలా రాఖీలు పంపుతున్నారు. వాటిని ఆ విద్యార్థినులు ఇంకెవరినుంచో తీసుకోరు. మరెక్కణ్నుంచో కొనరు. స్వయంగా తమ చేతులతో ప్రేమగా తయారు చేస్తారు. ఇందుకు కావాల్సిన ముడిసరుకులనూ తమ పాకెట్ మనీతోనే కొంటారు. ఇలా ప్రతి ఏడాదీ వాళ్లు కనీసం 28,000 లకు తగ్గకుండా రాఖీలు తయారు చేసి పంపుతూ రక్షాబంధన్ పండుగ వేడుకలకు నిజమైన సంప్రదాయాన్నీ, స్ఫూర్తినీ అద్దుతున్నారు.
వంద నుంచి వేలాది రూపాయల వరకు...
ఓ చెల్లి తన అన్నకు రాఖీ కట్టాక ఉద్వేగాలను అదుపులో ఉంచుతూ ఆ అన్న తనకున్నంతలో తన చెల్లెలికిచ్చే బహుమతులు వంద రూపాయల నుంచి వేలలో ఉంటాయి. ఉదాహరణకు వంద రూపాయలలోపు వచ్చే రిబ్బన్‌ర్యాప్‌లో కట్టిన చాక్లెట్ బాక్స్‌నో, రెండొందల్లో వచ్చే ఆమె పేరులోని మొదటక్షరమో, ఆమె రాశీచక్రపు గుర్తుతో దొరికే కీచైనో, వెయ్యి రూపాయల విలువైన వన్ గ్రామ్ గోల్డ్ గొలుసో, రెండువేల విలువైన డ్రస్సూ– దుపట్టానో, పదివేల విలువ చేసే పెండెంటో లేదా లక్షల విలువ చేసే నిజం బంగారమో ఏదో ఒకటి రిటన్ గిఫ్టుగా ఇచ్చేందుకు ఇప్పుడు మార్కెట్లో రెడీలీ అవైలబుల్ గిఫ్ట్‌లు ఎన్నో ఉన్నాయి.
మరి ఆ ఆర్మీ అన్నయ్యలేమిస్తారో...
ఎర్రటెండల్లో వాచీతో పాటు రాఖీని చూసినపుడు తగిలే చల్లగాలి తెమ్మెరలాంటి హర్షోల్లాసపు ఆహ్లాదభావన ఆ చెల్లెలు అందించే గిఫ్ట్ అయితే...
గస్తీ పనిలో భాగంగా పర్వతసానువులపైన పైపైకిపాకేవేళల... మణికట్టుపై కట్టి ఉన్న ఆ రాఖీని చూసినప్పుడు... ఆ తెలిమంచు తెరలపై తన చెల్లెలి ముఖం కనిపిస్తే కంటికి అడ్డుపడే ఆ కన్నీటితెరతోపాటు సంతోషాలు ఉబికి వస్తుండటమే ఆ అన్నయ్యిచ్చే అమూల్యమైన రిటర్న్ గిఫ్ట్. దేశరక్షణతో పాటు మనకు అది అదనం.
– యాసీన్