
గత కొద్దిరోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధజ్వాలలతో భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడి జోక్యంతో ప్రస్తుతం ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. యుద్ధం ఆగిపోయినట్లేనా కాదా..? అనేది స్పష్టం కాకపోయినా..ఇరు దేశాలు ఈ యుద్ధం కారణంగా వార్తల్లో హైలెట్‌గా నిలిచాయి. అదీగాక శత్రుదేశాన్ని పలు రకాలుగా దెబ్బ కొట్టి..ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ భారీ స్థాయిలో పాపులారిటీని, ప్రజాదరణను పెంచుకున్నారు. ముఖ్యంగా ఈ యుద్ధంలో తనకు తోడుగా అగ్రరాజ్యం కలిసివచ్చేలా ట్రంప్‌ను ఒప్పించడంలోనూ నెతన్యాహూ పూర్తి స్థాయిలో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో నెతాన్యాహూకి భారత్‌తో ఉన సత్సంబంధాలు..ఆయన మన దేశం అంటే ఎందుకంత ఇష్టం తదితరాల గురించి తెలుసుకుందామా..!.
ఇజ్రాయెల్‌లో అత్యంత సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహూ తన దేశాన్ని, విదేశాంగ విధానాలను ఎలా ప్రభావితం చేయగలరనే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజానికి రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతంగా ఆయన ఎలా ఉంటారనేది కూడా ఎవ్వరికీ పెద్దగా తెలియదు. ఆయనకు భారతదేశం, అక్కడి ప్రజలు, వంటకాలంటే మహా ఇష్టం.
మన ప్రధాని మోదీ ఇజ్రాయెల్ సందర్శనకు వచ్చినప్పుడూ..ఈ రోజు కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నానంటూ ఆలింగనం చేసుకున్నారు. పైగా భారత్ పట్ల తనకున్న అభిమానాన్నికూడా చాటుకున్నారు. ఇక ఇరు దేశాల మధ్య చారిత్రక సైద్ధాంతిక వ్యత్యాసం ఉన్నప్పటికీ..భారత్ ఇజ్రాయెల మధ్య మంచి స్నేహబాంధవ్యాలు ఉన్నాయనే చెప్పొచ్చని చెబుతున్నారు విశ్లేషకులు.
'బీబీ'గా పిలిచే బెంజమిన్ నెతన్యాహు ఎవరంటే..
బెంజమిన్ నెతన్యాహు 1949లో టెల్ అవీవ్‌లో ఒక జియోనిస్ట్ కుటుంబంలో జన్మించారు. యూదు రాజ్యాధికారాన్నిఎంతో విలువైనదిగా భావిస్తారు. ఆయన తాత నాథన్ ఒక రబ్బీ(యూదు మత నాయకుడు). ఆయన అమెరికా, యూరప్‌లలో పర్యటించి జియోనిజానికి మద్దతు ఇచ్చేలా ప్రసంగాలు చేశారు. 1920లలో తన కుటుంబాన్ని పాలస్తీనాకు తరలించాడు.
అక్కడ తన కుటుంబం పేరుని నెతన్యాహుగా మార్చాడు. అంటే దీని అర్థం "దేవుడు ఇచ్చినది". ఇక ఆయన కుమారుడు, ప్రధాని నెతన్యాహు తండ్రి బెంజియన్ నెతన్యాహూ 1971 నుంచి 1975 వరకు కార్నెల్‌లో బోధించిన జుడాయిక్ అధ్యయనాల ప్రొఫెసర్. ఆయన 102 ఏళ్ల వయసులో మరణించాడు. దీన్ని బట్టి ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహూకి యూదు జాతి పట్ల ఎంత లోతేన సంబంధ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వీటన్నింట్లకి అతీతంగా మన భారతీయ సంస్కృతికి నెతన్యాహు అమితంగా ఆకర్షింపబడటం మరింత విశేషం.
ఇష్టపడే భారతీయ వంటకాలు..
నెతన్యాహూకి ఇక్కడి ఆహారం, సంస్కృతి అంటే మహా ఇష్టం.
నివేదికల ప్రకారం..టెల్ అవీవ్‌లోని ఒక భారతీయ రెస్టారెంట్ అయిన తందూరి టెల్ అవీవ్‌లో నెతన్యాహు ఆయన కాబోయే భార్య సారాను మొదటి డేట్‌లో కలిశారట. ఆ రెస్టారెంట్ యజమాని రీనా పుష్కర్ణ దాన్ని ధృవకరిస్తూ..వారి మొదటి డేట్ టేబుల్ నెంబర్ 8లో సమావేశమయ్యారని అని చెప్పారు.
అంతేగాదు ఆయనకు భారతీయ ఆహారం అంటే మహా ఇష్టమని, వారంలో కనీసం రెండుసార్లు మన భారతీయ వంటకాలను ఆర్డర్ చేస్తారని చెప్పుకొచ్చారు.
నెతన్యాహూకి బటర్ చికెన్ , కరాహి చికెన్ అంటే చాలా ఇష్టమట. ఈ రెండు దేశాలను ఏకం చేయడంలో ఈ ఆహారం కూడా ఒక రకంగా ముఖ్యపాత్ర పోషించిందని అంటోంది రెస్టారెంట్ యజమాని రీనా.
నెట్టింట తెగ వైరల్‌గా ఆ ఫోటో..
2018లో, నెతన్యాహూ, అతని భార్య భారతదేశాన్ని సందర్శించి ఐకానిక్ తాజ్‌మహల్‌ని సందర్శించారు. భారతదేశం అంటే ఎంతో ఇష్టం అందుకు గుర్తుగానే ఇక్కడి ప్రేమాలయంలో ఉన్నాం అని ఆ దంపతులు చెప్పడం విశేషం. అలాగే నెతన్యాహూ భారత పర్యటన సందర్భంగా 'షాలోమ్ బాలీవుడ్' అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
అక్కడ హిందీ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తులను కలిశారు. "ఇన్నాళ్లు తానే గొప్ప వ్యక్తిని అని అనుకునేవాడిని కానీ నటుడు అమితాబ్ బచ్చన్ నాకంటే గొప్పవాడినని తర్వాతే తెలిసింది. ఎందుకంటే ఆయనకు 30 మిలియన్ల మంది ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్నారంటూ నవ్వేశారు" నెతన్యాహు. అలాగే ఆయన మితాబ్ బచ్చన్‌తో సెల్ఫీ కూడా దిగారు. పైగా ఇది ఆస్కార్ అవార్డుల సమయంలో తెగ వైరల్ అయిన ఫోటోగా వార్తల్లో నిలిచింది.
చివరగా నెతన్యాహూ కూడా పహల్ఘామ్ దాడిని ఖండించారు. ఆ సంఘటనను "అనాగరికం" అని అభివర్ణించారు. పైగా ఇజ్రాయెల్ భారతదేశానికి పూర్తిగా మద్దతిస్తుందని, దాని సంస్కృతి తోపాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో కూడా తోడుగా ఉంటుందని స్పష్టం చేసి ప్రపంచ దేశాలనే విస్తుపోయేలా చేశారు.
(చదవండి: కుగ్రామం నుంచి 'కుబేర' వరకూ..! సత్తా చాటుతున్న తెలంగాణ కుర్రాడు)