యోగాసనం.. ఆరోగ్యశాసనం | International Yoga Day 2026: Benefits of Yoga for Mind And Health | Sakshi
Sakshi News home page

యోగాసనం.. ఆరోగ్యశాసనం

Jun 21 2026 3:44 PM | Updated on Jun 21 2026 4:10 PM

International Yoga Day 2026:  Benefits of Yoga for Mind And Health

యోగా.. ఈ పదం నేడు అంతర్జాతీయ తారకమంత్రంగా మారిపోయింది. కులమతాలకు అతీతంగా చక్కని ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు యోగా గొప్ప సాధనంగా మారింది. దేశంలో పుట్టి ఖండాతరాల్లో వ్యాపించి 2014లో అంతర్జాతీయ పేటెంట్‌ పొందింది భారత్‌. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు 2015 నుంచి జూన్‌ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. 

చక్కటి ఆరోగ్య అలవాట్లు, సానుకూల దృక్పథంతోపాటు సామాజిక బాధ్యత కూడా మిళితమై ఉండడం మరో ప్రత్యేకత. అందుకే పేదవాడి దగ్గర్నుంచి ఉన్నత వర్గాలు, విద్యాంతులు, వైద్యులు కూడా యోగా సాధన చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ గుంటూరులో సుమారు 40  వరకు యోగా కేంద్రాలు వారి స్థాయిలో శిక్షణ ఇస్తున్నాయి. కొన్ని స్వల్ప ఫీజులతో ఉంటే మరికొన్ని ఏసీ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేసి కొంత మొత్తం తీసుకుంటున్నాయి. ఆన్‌లైన్‌ క్లాసులు కూడా చెబుతున్నారు.  

నా  వయస్సు 52 సంవత్సరాలు. యోగా నన్ను నిత్యం నూతనంగా ఉంచుతుంది. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు. శరీరం, మనస్సులను సంధానించే గొప్ప భారతీయ జీవన విధానం. నా వృత్తికి ఏకాగ్రత చాలా అవసరం. అందుకే ప్రతి రోజూ యోగా, మెడిటేషన్‌ చేస్తాను.  రోజూ కొద్దిసేపు యోగాభ్యాసం చేయడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత,  ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.  పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలు, ఎంతో ప్రభావం చూపుతుంది.  
– డాక్టర్‌ చైతన్య, నేత్ర వైద్య నిపుణురాలు, గుంటూరు.  

యోగాలో వినూత్న ప్రకియ..
సంప్రదాయ నృత్యాన్ని, ప్రాచీన యోగాను కలిపి నాట్య యోగామృతంలా మలిచి శిక్షణ ఇస్తున్నాను. మన సంప్రదాయాన్ని ఆరోగ్యం కోసం మిళితం చేయడమే దీని లక్ష్యం. ప్రస్తుతం జుంబా వంటి ఆధునిక నృత్యాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది అందరికీ నప్పదు. కొందరు ఇబ్బందులకు గురవడం చూస్తున్నాను. అదే యోగా అయితే అందరికీ ఉల్లాసం, ఉత్సాహంతోపాటు చక్కని ఫలితాలు సాధిస్తున్నాను. ఇది వయస్సును బట్టి కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. నా వద్ద వందల మంది శిక్షణ పొందుతున్నారు. మంచి ఫలితాలు సాధిస్తున్నాను.  
– విజయ గౌరి, నేషనల్‌ యోగా రిఫరీ, గుంటూరు  

పాఠశాల స్థాయి నుంచి నేర్పాలి..
యోగా సాధనకు దేశం అంతర్జాతీయ వేదికైంది. అంటే దీని ప్రాముఖ్యత ఏంటో తెలుస్తోంది. ఈ విద్యను పాఠశాలల స్థాయి నుంచే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్యానికి రాగిజావ, ఫోర్టిఫైడ్‌ బియ్యం, బలవర్ధకమైనా ఆహారం అందిస్తుంది. కనీసం యోగా సాధనకు గంటైనా కేటాయించాలని మనవి. నేటి యువత మొబైల్‌ ఫోన్లతో బిజీగా గడుపుతున్నారు. దీనివల్ల సోమరితనంతోపాటు మానసిక ఇబ్బందులు తప్పడం లేదు. యువత నిత్యం యోగా చేయడం ద్వారా చాలా రుగ్మతల నుంచి విముక్తి పొందవచ్చు. దీనికి అద్భుతమైన యోగాసనాలు ఉన్నాయి.  
– బి.మల్లికార్జునరావు, యోగా శిక్షకులు 

మీ జీవితం..మీ చేతుల్లోనే..
చాలా సమస్యలు మన నిర్లక్ష్యంతోనే తెచ్చుకుంటాం. పిల్లలు, యువత మొబైల్స్‌కు ఎక్కువగా బానిసలై శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి అద్భుత పరిష్కారం యోగాలో ఉంది. అనుభవజ్జులైన గురువుల వద్ద తొలి దశలో శిక్షణ పొందాలి. ప్రస్తుతం సమాజంలో మధుమేహం, రక్తపోటు, హార్మోన్ల అసమతుల్యత తరచుగా చూస్తున్నా. చాలా మంది మంచి మెడిసిన్‌ రాయండి అని అంటుంటారు. ముందుగా కొంత సేపు నడిచి, తర్వాత కాసేపు యోగా చేయాలి. మందులు వాడాల్సిన పరిస్థితి వస్తే తప్పదు. జీవన శైలి మార్చుకుని యోగా సాధన చేస్తే నూటికి 90 శాతం రోగాల నుంచి బయటపడవచ్చు.  
– డాక్టర్‌ కె.సుబ్బారావు, ఎండో క్రైనాలజిస్ట్‌  

యువతకు ఇబ్బందులు పోతాయి 
ప్రస్తుతం అమ్మాయిల్లో చాలా శారీరక  ఇబ్బందులు ఉంటాయి. పీసీవోడీ వంటి కారణాలకు యోగాసనాల ద్వారా అద్భుత పరిష్కారం లభిస్తుంది. శరీరాన్ని నిత్యం ఉత్సాహంగా ఉంచడంలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మూడు నెలల నుంచి గురువు వద్ద సాధన చేస్తున్నా. చిన్న సమస్యలకు మనం చాలా తీవ్రంగా ఆలోచిస్తుంటాం. చాలా ఇబ్బందులకు యోగాలో పరిష్కారం ఉంటుంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement