ఫండే స్టోరీ
ఆకాశహర్మ్యాల మధ్య ’స్వర్ణ విహార్’ అపార్ట్‌మెంట్ ఒక ఆధునిక కోటలా నిలబడి ఉంది. ‘బొయ్...’మంటూ సైరన్ మోగుతూ అపార్ట్‌మెంట్ గేటు ముందు ఆగింది అంబులెన్స్. స్ట్రెచర్ మీద డెబ్బై ఏళ్ల రామారావు నిర్జీవ శరీరం నిశ్చలంగా నిద్రపోతున్నట్టుగా ఉంది. తన కష్టం, సుఖం, బాధ, భయం, కోపం, దుఃఖం అన్నిటికీ వేదిక అయిన తన ఇంటిని కడసారి చూసుకోడానికా అన్నట్టు... పూర్తిగా మూసుకుపోకుండా అరమోడ్పులుగా ఉన్నాయి ఆయన కనులు.
కన్నీళ్లు తుడుచుకుంటూ అంబులెన్స్ దిగాడు రవి– రామారావు గారి కొడుకు. అతనితో పాటు ప్రాణంలేని బొమ్మలా నీళ్ళింకిపోయిన కళ్ళతో రామారావు గారి భార్య, మరో ఇద్దరు బంధువులు, అంబులెన్స్ సిబ్బంది కలిసి రామారావు దేహాన్ని అపార్ట్‌మెంట్ గేట్ లోపలకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉండగానే, వీళ్ళ కోసమే కాచుకొని ఉన్నట్టు గబగబా ఎదురొచ్చాడు సెక్యూరిటీ గార్డు.
‘‘సార్... అది... అయ్యగారి శవాన్ని లోపలకు తీసుకురానివ్వద్దని కమిటీ వాళ్ళు చెప్పారండి’’ నెమ్మదిగా అన్నాడు.
మొదట అతనేం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు రవికి. అర్థమైన తరువాత నోట మాట రాలేదు. అతని కూడా వచ్చిన బంధువులే తేరుకొని, ‘‘అదేంటయ్యా! ఇదెక్కడి విడ్డూరం! అతని బాడీని అతనింటికి తీసుకురాకుండా ఎక్కడకు తీసుకెళ్ళమంటారు?’’ అన్నారు.
‘‘ఏమో సార్! ప్రెసిడెంట్ గారు చెప్పమన్నదే చెప్పాను...’’ అన్నాడు గార్డ్.
ఇంతలోనే అపార్ట్‌మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజశేఖర్, మరికొందరు సభ్యులు కలిసి వచ్చారు.
‘‘చూడు రవి, మాకు విషయం తెలిసింది. బాడీని లోపలికి తీసుకురావడానికి వీల్లేదు.’’ కచ్చితంగా చెప్పారు.
‘‘ఏం మాట్లాడుతున్నారు సార్? ఇది నా ఇల్లు. నా తండ్రి పార్ధివ దేహాన్ని నా ఇంట్లోకి తీసుకురావడానికి మీరెందుకు అడ్డం పెడుతున్నారు?’’ బాధ, కోపం, ఉక్రోషం, నిస్సహాయత కలగలిసిన గొంతుతో అన్నాడు రవి.
‘‘ఇది నీ ఒక్కడి ఇల్లు కాదు రవి. ఈ కాంపౌండ్ లో ఇరవై కుటుంబాలు ఉన్నాయి. ఇంతమంది ఉన్న దగ్గర శవాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. వచ్చే పోయే వాళ్ళందరికీ అపశకునంగా, ఆశుభంగా, సెంటిమెంట్‌గా భావిస్తారు’’ అన్నారు వాళ్ళు.
అందేంటి సార్ అలా మాట్లాడతారు!? ఇన్నేళ్ళు మీతో కలిసి, మెలిసి తిరిగిన మనిషి. ఇప్పుడు ప్రాణం పోయేసరికి అతని శరీరం అంత భయంకరం, అపశకునం అయిపోయిందా? అన్నారు బంధువులు.
‘‘ఏమోనండి! అవన్నీ మీరడక్కూడదు. మా అపార్ట్‌మెంట్‌కి కొన్ని రూల్స్ ఉన్నాయి. దాని ప్రకారం నడుచుకోవలసిందే. సెంటిమెంట్లు పక్కన పెట్టినా, ఇళ్ళ మధ్యలో ఇలాంటివి జరిగితే ఇంటి విలువ పడిపోతుంది. అసలే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఇళ్ళను అమ్ముకోడానికి బేరం పెట్టుకున్నారు. ఈ సమయంలో ఇలాంటివి ఇక్కడ జరిగితే ఆశుభంగా భావించి ఆ ఇళ్ళు చెల్లుబాటు కావు. పైగా వచ్చే నెలలో ఇక్కడ ముగ్గురు పెళ్లిళ్లు పెట్టుకున్నారు. వాళ్లకు కూడా అపశకునంగా ఉంటుంది...’’ మానవత్వం అన్నది ఏ కోశానా లేకుండా అన్నారు వాళ్ళు.
‘‘మరీ అలా మాట్లాడకండి సార్. సెల్లార్‌లో ఒక పక్కన కాస్త టెంట్ అడ్డంగా కట్టేసి, ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా బాడీని పెట్టుకుంటే తప్పేంటి? ఇంత పెద్ద సెల్లార్‌లో ఇటు చివర బాడీని పెట్టుకుంటాం. జనమంతా అటు పక్కనుంచి తిరుగుతారు. దానివలన ఎవరికేం ఇబ్బంది కలుగుతుంది. అపశకునం కలుగుతుంది? వచ్చే బంధువులందరికీ చివరి చూపయినా దక్కాలి కదా. పోయినాయనకు కాస్త స్నానం, పూజలాంటి కార్యక్రమాలు, ఆచారాలు నిర్వహించాలి కదా!’’ వాదనకు దిగారు చనిపోయినాయన బంధువులు.
‘‘ఏమో... అదంతా మాకు తెలీదండి. కావాలంటే గేట్ లోపలకు తీసుకురాకుండా ఈ బిల్డింగ్ ముందే రోడ్డు మీద టెంట్ వేసి పెట్టుకోండి. లేదంటే పక్కనే ఉన్న ఖాళీ స్థలం ఉంది కదా అందులోనో లేదా శ్మశానం షెడ్డులోనో ఉంచండి. అంతేగాని గేట్ లోపలి తీసుకురావడానికి మాత్రం కుదరదు’’ మూర్ఖత్వానికి పరాకాష్ఠగా అన్నారు కమిటీ వాళ్ళతో పాటు మరో ముగ్గురు నలుగురు.
‘‘అన్యాయంగా మాట్లాడకండి. శవాన్ని గేట్ బయట పెట్టడమేంటి? ఉన్నప్పుడు సంబంధాలు కొనసాగించడమే కాదు. పోయిన తరువాత ఆ నిర్జీవ శరీరాన్ని కూడా అంతే గౌరవంగా పంపించాలని చెబుతున్నాయి మన శాస్త్రాలు. పవిత్రత గురించి, శకునాల గురించి, ఆచారాల గురించి ఇంతలా చెబుతున్నారు. మీకు ఆ మాత్రం తెలీదా? ఒక శవానికి జరగవలసిన సంస్కారాలు, ఆచారాలు జరగనివ్వకపోతే ఆ పాపం కూడా చుట్టుకుంటుంది.’’ చివరి అస్త్రంగా అన్నారు బంధువులు. ఈ చివరి మాటతో కాస్త తగ్గారు బిల్డింగ్ పెద్దలు. కాని తాము పట్టిన పట్టు మాత్రం వదల్లేదు.
ఇక్కడిలా వాదన జరుగుతుంటే, అప్పటికే తమకు ఆలస్యమవుతుందని విసుక్కుంటున్న అంబులెన్స్ వాళ్ళు,‘‘సార్! ఈ గొడవ ఎప్పుడు తేలుతుందో... మేం వెళ్ళాలి సార్!’’ అని చెప్పి, ఒకప్పుడు ఆ పరిసరాలన్నీ యథేచ్ఛగా తిరిగి, గార్డెన్‌లో ఎక్కడ ఏ మొక్క వంగినా, వాలినా దానిని సరిచేసి; ఎక్కడ ఏ గోడకి, గచ్చుకి చిన్న పెచ్చూడినా వెంటనే సరిచేసి, తీర్చిదిద్దిన రామారావుగారి దేహాన్ని అక్కడే రోడ్డు మీద దించేసి వెళ్ళిపోయారు.
‘‘నాన్నా.. నన్ను క్షమించు నాన్నా... బ్రతికి ఉన్నంత కాలం,నువ్వు అద్దంలా తీర్చిదిద్దిన ఈ భూమ్మీద నీ చివరి స్పర్శ ఇవ్వలేకపోతున్నాను’’ అని రవి ఏడుస్తుంటే... అపార్ట్‌మెంట్ ఇళ్ళలోంచి వస్తున్న టీవీల శబ్దాలు, ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతున్న హడావిడిలో నిశ్శబ్దంగా కలిసిపోయింది రవి ఆక్రోశం.
‘అయ్యో! బతికున్నంతకాలం హాయిగా అందరితో ఎంతో ఆత్మీయంగా బతికిన నీకు, ప్రాణం పోయిన తరువాత ఈ అవమానమేంటయ్యా! ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారంటూ నీ కాళ్ళంటి ఆశీర్వాదాలడిగిన వీళ్ళకు నీ నిర్జీవ శరీరం అపశకునం అయిపోయిందా!? భగవంతుడా... ఏంటీ ఘోరం!’ నిశ్శబ్దంగా కుమిలిపోతోంది రామారావు గారి భార్య.
ఇంతలో... జరుగుతున్న ఘోరం చూడలేని ప్రకృతి విలపిస్తున్నట్టు భోరుమని వర్షం మొదలయింది. బంధువులు రామారావు శరీరాన్ని ఎలాగైనా లోపలకు తీసుకువెళ్లాలని పట్టుదలగా బిల్డింగ్ కమిటీవాళ్ళతో వాదిస్తూనే ఉన్నారు. జరుగుతున్న రగడతో తనకెలాంటి సంబంధం లేదన్నట్టు నిర్జీవంగా, గేటు బయట, రోడ్డు మీద, ఒక బల్ల మీద పడి ఉంది రామారావు శరీరం. ఎవరో ఒక దుప్పటి తీసుకొచ్చి కప్పారు శరీరం మీద వర్షానికి తడవకుండా ఉండడం కోసం. జోరున కురుస్తున్న వర్షంలో తడుస్తూ, తండ్రి దేహాన్ని హత్తుకుని భోరున ఏడుస్తున్నాడు రవి.
‘ఒరేయ్... మనుషుల్లా బతకడం నేర్చుకోండిరా! ఈ రోజు నా తండ్రిని బయట పెట్టారు. రేపు మీరు కూడా ఇదే గేటు దాటి బయటికి రావాలి. అప్పుడు మీ ఆత్మలకి శాంతి దొరుకుతుందా? సిమెంట్‌తో కట్టుకున్నది ఇల్లు కాదురా... ప్రేమని పంచుకునేది ఇల్లు. ఇంత పెద్ద స్థలంలో ఇంత పటిష్ఠంగా మీరు కట్టుకున్నది ఇళ్లను కాదు... శ్మశానాలను కట్టుకున్నారు! శ్మశానాలను...’ ఈ మాటలు బయటకు అనలేదతను. మౌనంగా మనసులోనే అనుకుంటూ ఆక్రోశిస్తోందతని హృదయం.
జోరున వర్షం కురుస్తోంది. అపార్ట్‌మెంట్ గేటు బయట ఒకవైపు, శవం పక్కన విలపిస్తూ దిక్కుతోచని స్థితిలో అతని భార్యా, బిడ్డలు. మరోవైపు అపార్ట్‌మెంట్ వాసులు ‘లోపలికి రానివ్వం’ అని భీష్మించుకుని కూర్చున్నారు. గొడవ పెద్దదవుతోంది. ఇక ఆగలేకపోయారు ఆ అపార్ట్‌మెంట్‌లోనే ఉండే రిటైర్డ్ ప్రొఫెసర్ మూర్తిగారు. అంతవరకు సామరస్యంగా సమసిపోతుందని ఎదురుచూసిన గొడవ ఇంకా ముదురుతుండేసరికి, గంభీరంగా ముందుకు వచ్చారు. ఆయన మాటలకి ఆ ప్రాంతంలో ఒక గౌరవం ఉంది.
‘‘చాలిక ఆపండి ఈ అమానుషాన్ని! ఏం చేస్తున్నారు మీరు? అందరూ చదువుకున్న వాళ్లేగా! లేక రాతి యుగంలో మనుషులా? బాధలో ఉన్నవారికి నీ కష్టంలో మేమూ తోడుంటాం అని భుజం తట్టి ఓదార్పునివ్వడం పోయి, వాళ్ళని మరింత బాధల్లోకి నెట్టేస్తారా!? ఇదేనా మానవత్వం?’’ అన్నారు గట్టిగా మూర్తిగారు.
‘‘మూర్తిగారు, మీకు తెలియంది కాదు. ఈ బిల్డింగ్‌లో పెళ్లిళ్లు ఉన్నాయి, ఇప్పుడీ శవాన్ని లోపలకు తీసుకువస్తే బిల్డింగ్ మైల పడుతుంది. దోషం చుట్టుకుంటుంది. ఇది మా ఒక్కరి అభిప్రాయం కాదు. చాలామంది ఇలాగే అభిప్రాయపడుతున్నారు. అందరి క్షేమం కోసమే కదా మేమూ వద్దంటున్నది.’’ తనూ తీవ్రంగానే అన్నాడు ప్రెసిడెంట్. డూడూ బసవన్నల్లా అతనికి వంత పాడారు మరికొందరు.
‘‘దోషమా? ఏ శాస్త్రం చెప్పింది రాజశేఖర్ గారు. ఆపదలో ఉన్న పొరుగువాడికి సాయం చేయకపోవడం కంటే పెద్ద దోషం ఇంకోటి ఉంటుందా? మీ ఇంట్లో పెళ్లిళ్లు ఉన్నాయి సరే, ఎప్పుడో నెల రోజుల తరువాత పెళ్లి ఉందని ఇప్పుడు ఆయన శరీరాన్ని లోపలికి తెస్తే బిల్డింగ్ మొత్తం మైల పడిపోతుందా? అయినా ఇక్కడ సెల్లార్‌లో బాడీని పెడితే మీ ఇంట్లో పెళ్ళికి మైల ఎలా అంటుకుపోతుందండీ? ఇది చాదస్తమనుకోవాలా? మూఢనమ్మకాలు అనుకోవాలా? మూర్ఖత్వం అనుకోవాలా? ఇదంతా వదిలేయండి... ఆ మాట నేననకూడదు గాని, రేపు మీ ఇళ్ళల్లో ఎవరికైనా ఇలాంటి కష్టం వస్తే అప్పుడు కూడా ఇలాగే రోడ్డు మీద పడేయమంటారా?’’ ఆవేశంగా అన్నారు మూర్తిగారు.
ఆయన ఆవేశానికి, ఆ సమాధానంలేని ప్రశ్నలకు చుట్టూ ఉన్నవాళ్లు సమాధానం చెప్పలేక ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. ఆయన మాటలకు వత్తాసుగా కొందరు తలలూపడం మొదలుపెట్టారు.
అప్పటివరకు జరుగుతున్న తతంగం నచ్చకపోయినా, వాళ్ళ పెత్తనానికి మారు మాట్లాడలేక నోరుమూసుకు ఊరుకున్న మరి కొందరయితే,‘‘నిజమే కదా! ఈ ప్రెసిడెంట్, సెక్రెటరీలు మరీ మూర్ఖులు.’’
‘‘అవును... అంతా వీళ్ళ ఇష్టమే అయిపోతోంది. వాళ్ళేం చెప్తే అదే రూల్... బిల్డింగ్ అంతా వీళ్ళదే అన్నట్టు చెలరేగిపోతున్నారు. అడిగేవాళ్ళు లేక...’’
‘‘అదే కదా! పాపం ఆ కుటుంబాన్ని చూడండి వీళ్ళ ఆగడాలకు ఎలా కుమిలిపోతున్నారో... ఇంట్లో మనిషి పోయి వాళ్లేడుస్తుంటే, వీళ్ళిలా అవమానించి ఏడిపిస్తున్నారు’’ అంటూ గుసగుసలు మొదలుపెట్టారు.
‘‘రామారావుగారు ఈ అపార్ట్‌మెంట్‌లో పదేళ్ల నుంచి ఉన్నారు. మీ పిల్లలు కింద పడితే లేవనెత్తిన చేతులు ఆయనవి. ఎవరికే కష్టం వచ్చినా భుజం తట్టి తోడుగా నిలిచి, మానవత్వం చూపిన మనిషి. పండుగ వస్తే అందరికీ స్వీట్లు పంచి, అందరం కలిసిమెలిసి ఉందామన్న తియ్యటి మనసు ఆయనది. అలాంటి ఆయన ప్రాణం పోయాక ఒక ‘వస్తువు’ అయిపోయారా? ఆయన దేహం అపవిత్రం అయిపోయిందా? బాబాయ్ గారూ... మామయ్యగారూ... అన్నయ్యగారూ... తాతయ్యా... మీరు ఆశీర్వదిస్తే మాకు ‘శుభం’ అంటూ ఆయనతో ఎవరెవరు... ఎన్నిసార్లు అన్నారో గుర్తు చేసుకోండి. అలాంటిది ఆయన ప్రాణం పోయేసరికి అశుభంగా మారిపోయారా? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి... మీరు చేస్తున్నదేంటో మీకే తెలుస్తుంది.
చూడండి... మనం కట్టుకున్న ఈ గోడలు మనల్ని విడదీయకూడదు. ఈ రోజు మనం ఈ గేటు తీయకపోతే, రేపు ఈ అపార్ట్‌మెంట్ కేవలం ఒక ‘సిమెంట్ సమాధి’లా మిగిలిపోతుంది. ఇందులో మనుషులు ఉండరు, కేవలం భయం మాత్రమే ఉంటుంది. మన పిల్లలకి మనం నేర్పించే సంస్కారం ఇదేనా? చనిపోయిన మనిషికి గౌరవం ఇవ్వలేని మనం, బతికున్న వారికి ఏం విలువ ఇస్తాం?’’ కొట్టినట్టే అన్నారు మూర్తిగారు.
ఆయన మాటల్లోని నిజాయితీ, ఆవేదన అక్కడున్న వారి గుండెల్లో గుచ్చుకుంది. కొందరు తలలు దించుకున్నారు. ప్రెసిడెంట్, సెక్రెటరీ అండ్ గ్రూప్ మౌనంగా ఉండిపోయారు.
స్థిర నిశ్చయంతో ముందుకు కదిలారు మూర్తిగారు. ‘‘నేను వెళ్తున్నాను. నేనే స్వయంగా నా చేతులతో రామారావు గారిని లోపలికి తీసుకొస్తాను. నాతో పాటు మానవత్వం ఉన్నవాళ్లు ఎవరైనా ఉంటే రండి. అడ్డుపడేవాళ్లు ఉంటే... రేపు మీరు కూడా ఒంటరిగా ఇలాగే రోడ్డు మీద నిలబడతారని గుర్తుంచుకోండి.’’ అంటూనే మూర్తిగారు ఒక్క అడుగు ముందుకు వేయగానే, మొదట ఒక యువకుడు, ఆ తర్వాత మరో ఇద్దరు మహిళలు ముందుకు వచ్చారు. అలా మెల్లగా ఒక్కొక్కరుగా అందరూ రవి దగ్గరకు వెళ్లారు.
‘‘క్షమించు రవి... భయం, మూఢనమ్మకాలు, ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖత్వం మమ్మల్ని గుడ్డివాళ్లను చేసింది. రామారావుగారు మన పెద్దాయన. ఆయన్ని సగౌరవంగా లోపలికి తీసుకెళ్దాం. అన్నీ మేమే దగ్గరుండి జరిపిస్తాం.’’ అంటూ తనే ముందు రామారావుగారి పార్థివ శరీరాన్ని పైకెత్తడానికి కదిలాడు రాజశేఖరం.
అందరూ కలిసి రోడ్డు మీద అనాథలాగా పడి ఉన్న రామారావుగారి శరీరాన్ని గౌరవంగా పైకెత్తారు. గేట్లు బార్లా తెరుచుకున్నాయి. వర్షం వెలిసింది. నిముషాల్లో సెల్లార్‌లో ఓ పక్కన అంతా ఖాళీ చేసి, రామారావుగారి దేహాన్ని పెట్టడానికి అన్ని ఏర్పాట్లూ చకచకా చేసేశారు. అపార్ట్‌మెంట్ వాసులందరూ కలిసి పూలు తెచ్చారు, దీపాలు వెలిగించారు. రవి కుటుంబం ఒంటరిది కాదు అని నిరూపించారు అందరూ. రామారావుగారికి జరగాల్సిన ఆచారాలన్నీ సజావుగా, గౌరవప్రదంగా జరిగాయి. అందరూ కలిసి రామారావు గారిని చివరి ప్రయాణానికి సగౌరవంగా సాగనంపారు. బిల్డింగ్‌లో ‘దోషం’ పోయి ‘ప్రేమ’ వెల్లివిరిసింది. - మావూరు విజయలక్ష్మి


