నాగపూర్: నేటి యువత కోట్లలో ప్యాకేజీలు, విదేశీ లగ్జరీ జీవితం కోసం పరిగెడుతుంటే, ఓ యువకుడు మాత్రం తనకు వచ్చిన భారీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు. ఐఐటీ ఢిల్లీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదివి, నెలకు లక్షల్లో జీతం ఇచ్చే జపనీస్ కంపెనీ ఉద్యోగాన్ని వద్దనుకుని, దేశసేవ కోసం ఖాకీ యూనిఫామ్ ధరించాడు. ఆయనే నాగపూర్‌కు చెందిన అర్చిత్ చాండక్. తనపై తనకు ఉన్న నమ్మకమే ఆయనను ఈరోజు అకోలా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్‌పీ) స్థాయికి చేర్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆయన విజయగాథ ఇదే..
ఐఐటీ టాపర్ నుండి సివిల్స్ వైపు
మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన అర్చిత్ చాండక్ చిన్నతనం నుంచే చదువులో టాపర్. 2012లో జేఈఈ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి రికార్డు సృష్టించాడు. ఆ ప్రతిభతో ఐఐటీ ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ సీటు సంపాదించాడు. 2016లో బీటెక్ పూర్తి కాగానే, ఆయన ప్రతిభను గుర్తించిన ఒక ప్రముఖ జపనీస్ సంస్థ ఏడాదికి రూ.35 లక్షల భారీ ప్యాకేజీతో ఉద్యోగం ఆఫర్ ఇచ్చింది. ఏ ఇంజనీరింగ్ విద్యార్థికైనా ఇది ఒక కలల ఉద్యోగం. కానీ, అర్చిత్ మనసు కార్పొరేట్ ప్రపంచంలో స్థిరపడటానికి ఇష్టపడలేదు.
మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ రికార్డు
భారీ జీతాన్ని ఇచ్చే విదేశీ అవకాశాన్ని నిర్మొహమాటంగా తిరస్కరించి, యూపీఎస్‌సీ ప్రిపరేషన్ ప్రారంభించాడు. కేవలం డబ్బు వెనుక పరిగెత్తడం కంటే, సమాజంలో మార్పు తీసుకువచ్చే ప్రజాసేవలోనే తనకు అసలైన సంతృప్తి లభిస్తుందని నమ్మాడు. అనుకున్నదే తడవుగా పట్టుదలతో శ్రమించి, 2018 లో తన మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా 184వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యాడు.
సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
ప్రస్తుతం మహారాష్ట్రలోని అకోలా జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న అర్చిత్ ప్రయాణాన్ని వికాస్ అల్విస్ అనే ఎక్స్ (ట్విట్టర్) యూజర్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వైరల్‌గా మారింది. ‘నిజమైన విజయం అనేది కేవలం జీతం చూసి రాదు, మన ఆశయానికి తగ్గట్టు కెరీర్‌ను ఎంచుకున్నప్పుడే వస్తుంది’ అని నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్థిక భద్రతను వదులుకుని దేశసేవను ఎంచుకున్న అర్చిత్ చాండక్ కథ దేశంలోని ఎంతో మందికి నిజమైన స్ఫూర్తిని అందిస్తుంది.


