ఆమె.. దేశ నిర్మాత | Housewife contributes to nation: Supreme Court orders additional compensation for loss of wife domestic care in road accident cases | Sakshi
Sakshi News home page

ఆమె.. దేశ నిర్మాత

Jun 12 2026 1:39 AM | Updated on Jun 12 2026 1:39 AM

Housewife contributes to nation: Supreme Court orders additional compensation for loss of wife domestic care in road accident cases

ప్రతీకాత్మక చిత్రం

‘ఆడవాళ్లు ఇంటి నాలుగు గోడలకే పరిమితం కావాలి’.. ‘భార్య అంటే పనిమనిషి’ ‘ఇంట్లో గృహిణులు చేసే పనికి విలువ కట్టాల్సిన పనిలేదు’...  ఇలాంటి పురుషాధిపత్య భావజాలానికి చెంప పెట్టులాంటి  తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. వేతనం లేని ఇంటి చాకిరీకి ఇటీవలి కాలంలో లభించిన అత్యంత బలమైన, న్యాయపరమైన గుర్తింపులలో ఈ తీర్పు ఒకటని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. గృహశ్రమ అనేది కొలవదగిన, ఆర్థిక, సామాజిక విలువ కలిగిన ఉత్పాదకశ్రమ అనే భావనను సుప్రీం తీర్పు మరింత బలపరుస్తోంది.

‘గృహాలను నడిపే వ్యక్తులను కేవలం గృహిణులుగా అభివర్ణించడం వారి సహకారాన్ని తక్కువ చేసి చూడడమే అవుతుంది’ అని సుప్రీంకోర్టు  పేర్కొంది. గృహిణుల ప్రమాద మరణాలకు సంబంధించిన ఒక నష్టపరిహార కేసులో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

భవిష్యత్‌ తరాలను తీర్చిదిద్దుతూ...
మహిళల పాత్ర కేవలం ఇంటి పనులకే పరిమితం కాలేదు. కుటుంబాలు, భవిష్యత్‌ తరాలను తీర్చిదిద్దడం, దేశనిర్మాణానికి తోడ్పడం వంటి అనేక అంశాలకు ఆమె ప్రాతినిధ్యం వహిస్తోంది. గృహిణులు చేసే ఇంటి పనులు, సంరక్షణ సేవలకు ఆర్థిక విలువ ఉందని, మానవ అభివృద్ధికి దోహద పడడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోందని జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ‘ఆమెను కేవలం గృహిణి అని పిలవడానికి బదులుగా దేశనిర్మాత అని పిలవాలి’ అని కోర్టు పేర్కొంది.

అదేకాదు...అంతకు మించి!
ఇంటి పట్టున మహిళ చేసే పని ప్రభావం కేవలం ఆ ఇంటి నాలుగు గోడలకే పరిమితం కాదని, అంతకు మించి ఉంటుందని కోర్టు నొక్కి చెప్పింది. పెళ్లి అంటే పనిమనిషిని నియమించుకోవడం కాదంటూ, వివాహవ్యవస్థలోని లోటుపాట్లపై కూడా వ్యాఖ్యలు చేసింది కోర్టు. ఇంటి పనుల పూర్తి బాధ్యతను మహిళ ఒక్కరే తీసుకునే ఏర్పాటుగా వివాహాన్ని చూడకూడదని స్పష్టం చేసింది. గృహ బాధ్యతలనేవి భార్యాభర్తల ఉమ్మడి బాధ్యతలని నొక్కి చెప్పింది.పెళ్లయిందనే ఒకే ఒక్క కారణంతో వృత్తిపరమైన లక్ష్యాలు, ఆశయాలను మహిళలు త్యాగం చేయనవసరం లేదని పేర్కొంది.

అది క్రూరత్వం కాదు...
ఒక మహిళ తన పిల్లలకు స్థిరమైన వాతావరణాన్ని కల్పిస్తూనే డాక్టర్‌గా, వృత్తినిపుణురాలిగా, మరే ఇతర రంగాలలోనైనా తన వృత్తిని కొనసాగించాలని కోరుకుంటే అది భర్త, అత్తమామల పట్ల క్రూరత్వంగా పరిగణించరాదని కోర్టు పేర్కొంది.

పెళ్లి తరువాత మహిళ గుర్తింపు ముగిసి పోదు
గృహిణులు చేసే వ్యక్తిగత త్యాగాలు పెద్దగా గుర్తింపు పొందవని కోర్టు తెలియజేసింది. ఇంటి పనుల కోసం తమ సమయాన్ని, శక్తిని వెచ్చించే మహిళలు కుటుంబం నిలబడడానికి, కుటుంబ సంపదకు గణనీయంగా దోహదపడతారని, వారి కృషిని సామాజికంగా, ఆర్థికంగా తగిన విధంగా గుర్తించాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సంవత్సరాల తరబడి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసే ఇంటిపనులు, పిల్లల సంరక్షణ ద్వారా వారు అందించే అమూల్యమైన సహకారాన్ని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడిగా సంపాదించిన కుటుంబ ఆస్తులలో గృహిణులు సమాన వాటాకు అర్హులని పేర్కొంది.

గృహిణుల శ్రమకు ఆర్థిక విలువ ఉంది...
కుటుంబం, సమాజం సజావుగా నడవడానికి గృహ కార్మికుల శ్రమ అత్యవసరం అయినప్పటికీ, సంప్రదాయ ఆర్థిక లెక్కల్లో ఇది చాలాకాలంగా కనిపించకుండా పోయిందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక గృహిణి చేసే సేవ కేవలం వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, ఇంటిపనులు చూసుకోవడానికి పరిమితం కాదని ధర్మాసనం తెలిపింది. పిల్లలను పెంచడంలో, వారిలో విలువలను పెంపొందించడంలో, కుటుంబ సభ్యులకు అండగా నిలవడంలో, తర్వాత తరాన్ని తీర్చిదిద్దడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. మానవ వనరుల అభివృద్ధికి, తద్వారా జాతీయ అభివృద్ధికి ఆమె కృషి నేరుగా దోహదపడుతుందని కోర్టు అభిప్రాయపడింది.

స్పష్టమైన సందేశం
పరిహారం అనేది కేవలం ఆర్థిక నష్టాన్ని అంచనా వేయడానికి మాత్రమే పరిమితం కాకూడదని, కుటుంబం కోల్పోయిన గృహసంరక్షణ సేవల విలువను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు తెలిపింది. పరిహార దావాలను అంచనా వేసేటప్పుడు కోర్టులు ఉపయోగించే ప్రస్తుత ప్రమాణాలతోపాటు ఈ సూత్రం ఒక అదనపు మార్గదర్శకంగా పనిచేస్తుందని ధర్మాసనం పేర్కొంది. కుటుంబ సంక్షేమం, సామాజిక అభివృద్ధిలో గృహిణుల పాత్ర కాలక్రమేణా పెరుగుతూనే ఉంటుందని గుర్తిస్తూ, వారి భవిష్యత్‌ సహకారానికి సంబంధించిన లెక్కలను కూడా పరిహార మంజూరులో పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు పేర్కొంది. తమ శ్రమకు ఎలాంటి ప్రతిఫలం లేదా గుర్తింపు దొరకని లక్షలాది మంది మహిళలకు అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన సందేశం ఇచ్చింది...
‘ఇంటి బాధ్యతలు నిర్వహించే వ్యక్తి కేవలం గృహిణి మాత్రమే కాదు ఆమె దేశ నిర్మాత’.

Advertisement
 
Advertisement
Advertisement