
ప్రేమ చిహ్నాలుగా వర్థిల్లిన పావురాలే పలు రకాల వైరస్ వ్యాప్తికి కారకాలుగా మారుతున్నాయి. నగరాల్లోనూ వీటి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో అనారోగ్య సమస్యలూ, ఊపిరితిత్తుల సమస్యలు అధికమవుతున్నాయి. దీంతో వాటికి ఆహారాన్ని అందించడాన్ని ఇటీవలే ముంబయి, పుణె వంటి నగరాలు నిషేధించాయి. నగరంలో కూడా పావురాల సంఖ్య, వాటికి ఆహారం అందించే అలవాటు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో పావురాల ఫీడింగ్ అంశం చర్చనీయాంశంగా మారింది.
గతంలో ముంబైలోని ఒక అపార్టుమెంట్‌లో చోటు చేసుకున్న పావురాల సమస్య రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. అనంతరం ఆ సమస్య ఏకంగా కోర్టు గడప కూడా తొక్కింది. అయితే ఆ స్థాయికి చేరకున్నా.. మన నగరంలోనూ నిత్యం ఇదే అంశంపై నగరవాసుల్లో వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి. పావురాల వల్ల మనుషులకు కలిగే అనారోగ్యాలపై అవగాహన పెరగడమే దీనికి కారణం.
నగరంలో అలవాటుగా..
హాబీగా పావురాలకు ఆహారం వేసేవారితో పాటు మతపరమైన లేదా మరే ఇతర కారణాల వల్ల కూడా నగరంలో పావురాల ఫీడింగ్ సర్వసాధారణంగా మారింది. బహిరంగ ప్రదేశాల్లో వందలాది పావురాలు గుంపులుగా వస్తాయి. ప్రతి రోజూ ఉదయం వేళల్లో ప్రజలు ఈ పావురాలకు ఆహారం ఇవ్వడం సర్వసాధారణం.
ట్యాంక్ బండ్, నాంపల్లి, సికింద్రాబాద్‌లోని క్లాక్ టవర్.. ఇలా పలు చోట్ల పావురాల ఫీడింగ్ నిత్యం కనిపించే అంశాలు. ఇలా ఫీడింగ్ చేసేవారి కోసం గింజలు, ఇతర ఆహార ఉత్పత్తులు విక్రయించే వారు కూడా పుట్టుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఫీడింగ్ ఏ విధంగా జరుగుతుందో.
అవగాహన పెరగాలి..
‘పావురాల విసర్జన ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందనే విషయం తెలియక చాలా మంది పక్షులకు ఆహారం ఇస్తారు’ అని నగరానికి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సబా క్వాద్రి అంటున్నారు. అంతేకాదు పావురాలు, ఇతర పక్షులకు కూడా ఇది శాపంగా మారుతోంది. ‘ఇతర పక్షులను ఆకర్షించడానికి కొన్ని గింజలను బయట పెడుతాం. కానీ పావురాలు ఆ ప్రాంతాలను హైజాక్ చేసి ఇతర పక్షులకు ఉద్దేశించిన ఆహారాన్ని దక్కించుకుంటాయి’ అని సబా వెల్లడించారు.
ముంబై వంటి నగరాల్లో చేసినట్లుగానే, పావురాలకు ఇష్టారాజ్యంగా ఆహారం అందించడాన్ని నివారించేందుకు జరిమానా విధించడమే మంచిదని ఆమె సూచిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వంటి ప్రాంతాల్లో గణనీయమైన సంఖ్యలో పావురాలు ఉంటున్నాయి. ‘విశ్వవిద్యాలయ వీధులను శుభ్రం చేసే స్వీపర్ల నుంచి భవనాల్లో నివసించే విద్యార్థుల వరకు, చాలా మంది పావురాల బిందువుల ద్వారా సంక్రమించే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది’ అని వర్సిటీ ఉద్యోగి ఒకరు చెప్పారు. ఉదయం వేళల్లో పావురాలకు ఆహారం ఇవ్వొద్దని చెప్పేందుకే ఓయు ప్రత్యేకంగా ఒక భద్రతా అధికారిని నియమించిందని సదరు ఉద్యోగి వివరించారు. అంతేకాక వర్సిటీ భవనాల వెలుపల పావురాలకు ఆహారం ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలియజేసే బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.
విసర్జన.. విషమౌతోంది..
పావురాల ప్రభావానికి ముఖ్యంగా విసర్జనకు ఎక్కువ కాలం గురికావడం వల్ల వివిధ రకాల హానికరమైన శిలీంధ్రాలు, బ్యాక్టీరియా పరాన్నజీవులు ఉత్పత్తి అవుతాయని, ఫలితంగా ఇన్ఫెక్షన్లు, పలు రకాల వైరస్‌లు వ్యాప్తి చెందుతాయని వైద్యులు చెబుతున్నారు. విసర్జనాలు ఎండిపోయినప్పుడు, అవి దుమ్ము రూపంలో గాలిలోకి ఎగిరి, ఊపిరి తీసుకునే సమయంలో గాలి ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించి ఊపిరితిత్తులను చేరతాయి.
ఈ క్రమంలోనే హైపర్‌సెన్సిటివిటీ న్యుమోనైటిస్‌కు కారణమవుతోంది. ఇది కొన్ని పరిస్థితుల్లో ప్రాణాంతకం కావచ్చు. ఈ ఇన్ఫెక్షన్లు పెంపుడు కుక్కలు, పిల్లుల వెంట్రుకల ద్వారా వచ్చే అలెర్జీల కంటే కూడా ప్రమాదకరంగా ఉంటాయి. పావురాల విసర్జన ఊపిరితిత్తుల వాపుకు కారణమవుతాయి. ఒక్కోసారి అవయవాలకు శాశ్వత నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇన్ఫెక్షన్.. ఎలా గుర్తించాలి?
పావురాల విసర్జన వల్ల సోకే ఇన్ఫెక్షన్ తీవ్రత అధికంగా ఉంటుంది. ప్రారంభ దశలో నిరంతరం పొడి దగ్గు వస్తుంది. దీనికి యాంటీబయాటిక్స్, బ్రోంకోడైలేటర్లను ఉపయోగించినా ఉపశమనం దొరకదు. దగ్గు రెండు నుంచి మూడు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగిన క్రమంలో తదుపరి పరీక్షల కోసం పల్మనాలజిస్ట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
పలు దేశాల్లోనూ..
వెనిస్ నగరంలోని చారిత్రాత్మక చతురస్రాల్లో పావురాలకు ఆహారం నిషేధించారు. ఈ ఫీడింగ్‌కు సింగపూర్ భారీ జరిమానాలు విధిస్తోంది. అలాగే న్యూయార్క్, లండన్ కూడా దాణా ప్రదేశాలను నియంత్రించాయి. మన దేశంలో ముంబై, థానె, పుణెలో కేసులు నమోదు చేస్తున్నారు. ఢిల్లీలో కూడా పావురాల ఫీడింగ్‌ను నియంత్రించే దిశగా చర్యలు తీసుకోనుందని తెలుస్తున్న నేపథ్యంలో మన నగర పరిస్థితి ఏమిటని పలువురు నగరవాసులు
ప్రశ్నిస్తున్నారు.