నిన్న మొన్నటి గృహిణి.. నేటి ఉత్తమ నటి | Feminichi Fathima actress Shamla Hamza on winning Kerala State Film Award | Sakshi
Sakshi News home page

నిన్న మొన్నటి గృహిణి.. నేటి ఉత్తమ నటి

Nov 9 2025 12:39 AM | Updated on Nov 9 2025 12:39 AM

Feminichi Fathima actress Shamla Hamza on winning Kerala State Film Award

వివాహమయ్యాక స్త్రీలు తమ ఆకాంక్షలు విడిచి పెట్టాలనే ధోరణి సమాజంలో ఉన్నా కొందరు తమ కలలను అన్వేషిస్తుంటారు. ఇద్దరు పిల్లల తల్లిగా ఉండి, నిన్న మొన్నటి వరకూ సాధారణ గృహిణిగా ఉన్న షామ్లా హంజా తన రెండవ సినిమా ‘ఫెమినిచి ఫాతిమా’తో కేరళ ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఉత్తమ నటుడుగా ఎంపికైన మమ్ముట్టితో సమానంగా షామ్లా ప్రతిభ చూపిందంటే కళారంగాల్లో రాణించాలనుకునే స్త్రీలకు అది కచ్చితంగా స్ఫూర్తే...

కేరళలో ‘ఫెమినిస్ట్‌’ అనే మాటను కొందరు వ్యంగ్యంగా ‘ఫెమినిచి’ అంటుంటారు. స్త్రీలెవరైనా గొంతెత్తినా, ప్రశ్నించినా, హక్కుల కోసం మాట్లాడినా వారిని ‘ఫెమినిచి’ అని ఎత్తి పొడవడం అక్కడ కొందరి అలవాటు. అదే మాటను టైటిల్‌లో తీసుకుని ప్రతి గృహిణిలో అంతర్గతంగా ఫెమినిస్ట్‌ ఉంటుందని స్టేట్‌మెంట్‌ ఇస్తూ దర్శకుడు ఫాజిల్‌ ముహమ్మద్‌ తీసిన సినిమా ‘ఫెమినిచి ఫాతిమా’.

ఇది నేరుగా థియేటర్లలో రిలీజ్‌ కాకపోయినా, ఓటీటీలలో రాకపోయినా ఇప్పటికి అనేక ఫెస్టివల్స్‌లో బహుమతులు సాధించి, అనేక అవార్డులు గెలుచుకుంది. తాజాగా ఇటీవల ప్రకటించిన కేరళ ప్రభుత్వ పురస్కారాలలో ‘ఉత్తమ నటి’ అవార్డును సాధించింది. సినిమాలో ముఖ్యపాత్ర పోషించిన షామ్లా హంజా ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఇది ఆమెకు కేవలం రెండో సినిమా. ఇంతకు ముందు 2022లో వచ్చిన ‘1001 నూనకల్‌’ అనే సినిమాలో చిన్న పాత్ర పోషించింది. గృహిణిగా ఉంటూ ఇటీవల సినిమాలలోకి వచ్చిన షామ్లా ఏకంగా మమ్ముట్టితో సమాంతరంగా ఉత్తమనటి అవార్డు సాధించడం సామాన్యం కాదు.

ఫెమినిచి ఫాతిమా కథేంటి?
మలప్పురం జిల్లాలోని పొన్నాని అనే చిన్న ఊళ్లో ఉండే ముస్లిం కమ్యూనిటీలో జరిగే కథ ఇది. ఫాతిమా అనే గృహిణి ఇంట్లో సగటు పురుషాహంకార భర్త అజమాయిషీలో కాపురం చేస్తుంటుంది. అతగాడు ఫ్యాను వేసుకోవాలన్నా, చెప్పులు తొడుక్కోవాలనుకున్నా భార్యను పిలుస్తుంటాడు. పైగా ఇంటిని స్వర్గంగా ఉంచానని భావిస్తుంటాడు.

ఇంటి చాకిరి చేసి నడుము నొప్పి తెచ్చుకున్న ఫాతిమా ఒక మంచి పరుపును కలిగి ఉండాలని భావించడంతో కథలో ముఖ్యభాగం మొదలవుతుంది. ఆమె కోరుకున్న చిన్న కోరిక ఎన్ని అభి్రపాయాలకు తావిస్తుందో, భర్త... ఇతరులు ఎన్ని వ్యాఖ్యానాలు చేస్తారో వీటన్నింటికీ ఫాతిమా ఎలా బదులు చెప్తుందో ఈ సినిమాలో ఉంటుంది. హాస్యం, వ్యంగ్యం మిళితం చేసి ఉపన్యాసాలు లేకుండా స్త్రీల దృష్టికోణంలో ఈ కథ చెప్పడంతో అన్ని విధాలా ప్రశంసలు, అవార్డులు దక్కుతున్నాయి. ఫాతిమా పాత్ర పోషించిన షామ్లాకు ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇద్దరు పిల్లలు పుట్టాక
పాలక్కాడ్‌లో పుట్టి పెరిగిన షామ్లా వివాహమయ్యాక 12 సంవత్సరాలు దుబాయ్‌లో ఉండి కేరళలోనే తన కెరీర్‌ను వెతుక్కోవడానికి భర్తతో తిరిగి వచ్చింది. కొన్నాళ్లు రేడియో జాకీగా పని చేసిన ఆమె 2022లో మొదటి అవకాశం పొందింది. ఆ విధంగా దృష్టిలో పడటంతో దర్శకుడు ఫాజిల్‌ ఆమెకు ‘ఫెమినిచి ఫాతిమా’లో లీడ్‌ రోల్‌ ఇచ్చాడు. ‘షూటింగ్‌ మొదలైనప్పుడు నా రెండో బిడ్డకు ఆరు నెలల వయసు.

ఇంటిని, సినిమా కెరీర్‌ను సమన్వయం చేసుకోవడం అంత సులభం కాలేదు. కాని యూనిట్‌ సహకారం వల్ల నేను మనసు లగ్నం చేసి పని చేయగలిగాను’ అందామె. ‘నేను రేడియో జాకీగా ఉన్నప్పుడు కూడా స్త్రీల సవాళ్లను, వాటిని ఎదుర్కొనడానికి వారు ప్రదర్శించే సామర్థ్యాన్ని చర్చించేదాన్ని. అలాంటిది ఫాతిమా లాంటి పాత్ర వస్తే ఎలా కాదంటాను’ అందామె. అతి తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాలో దర్శకుడు తనకు తెలిసినవారిని, ఊరి వారిని తారాగణంగా తీసుకున్నాడు. త్వరలో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement