
స్త్రీల జీవితాల్లోని అంతఃప్రవాహాలువారిని లైంగికంగా పీడించి ఓడిపోయిన పిశాచాలు...స్త్రీలకు స్త్రీలే తోడుగా నిలిచిన కథనాలు...శుక్రవారం ప్రకటించిన జాతీయ సినీ పురస్కారాలు2023లో వెండితెర చూపించిన మహిళా సంఘర్షణలను మరోసారి జ్ఞప్తికి తెచ్చాయి. అలాగే ఎన్నో ఏళ్లుగా సినీ రంగంలో ఉన్నాఈసారి గుర్తింపు పొందిన నటీమణులు, గాయనులువారి అభిమానులను ఆనందపరిచారు. మొత్తంగా ఈ అవార్డులు స్త్రీల దృష్టికోణంలో ప్రత్యేకమైనవి.
రాణి ముఖర్జీకి ఉత్తమనటి పురస్కారం దక్కింది. ఆమె నటించిన ‘మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే’ చిత్రానికి గానూ ఆమెకు ఈ పురస్కారం అందింది. ‘గులామ్’ (1998) నుంచి రాణి ముఖర్జీ నటిస్తూ ఉన్నా జాతీయనటిగా గుర్తింపు దక్కడం ఇన్నాళ్లకు గాని సాధ్య పడలేదు. ఆమెకు ఈ పురస్కారం రావడం పట్ల అభిమానులే కాదు... విమర్శకులు కూడా సంతృప్తిగా ఉన్నారు.
ఎందుకంటే స్త్రీల దృష్టికోణంలో ‘మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే’ చాలా శక్తివంతమైన సమస్యను చర్చించింది. నిజ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాలో రాణి ముఖర్జీ గొప్పగా నటించిందన్న ప్రశంసలు పొందింది. జాతీయ పురస్కారం వచ్చిందన్న వార్త వెలువడగానే ‘నా ముప్పై ఏళ్ల నటనా జీవితానికి ఇది వేలిడేషన్‌గా భావిస్తున్నా’ అని ఆమె స్పందించింది.
ఎన్నో కలికితురాయిలు
బెంగాల్ నుంచి బాలీవుడ్‌కు వచ్చిన రాణి ముఖర్జీ ‘ఆతీ క్యా ఖండాలా’ పాట ఉన్న ఆమిర్ ఖాన్ ‘గులామ్’తో ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఆ తర్వాత షారుక్‌తో నటించిన ‘కుచ్ కుచ్ హోతాహై’తో స్టార్‌డమ్‌కు చేరుకుంది. ‘చోరీ చోరీ చుప్‌కే చుప్‌కే’, ‘కభి ఖుషీ కభి గమ్’, ‘సాథియా’, ‘వీర్ జారా’... తదితర సినిమాలు ఆమె ప్రతిభను చాటాయి.
అయితే అమితాబ్‌తో కలిసి నటించిన ‘బ్లాక్’ సినిమాలో తను కేవలం గ్లామర్ హీరోయిన్ కాదని, ప్రతిభ ఉన్న నటి అని నిరూపించింది. 2014లో దర్శకుడు ఆదిత్యా చోప్రాను వివాహం చేసుకున్నాక సినిమాలకు కొంత దూరమైనా ఇటీవల ‘మర్దానీ’, ‘మర్దానీ2’, ‘హిచ్కీ’, ‘మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే’ చిత్రాలతో తెరతో తన అనుబంధాన్ని కొనసాగిస్తోంది.
మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే
భారతీయ తల్లులకు పిల్లలను ఎలా పెంచాలో తెలుసు. పాలు ఇచ్చే పద్ధతి, పాలబువ్వ తినిపించే పద్ధతి, నీళ్లు ΄ోయడం, జోలపాడటం... ప్రతిదీ తెలుసు. కాని ఈ పద్ధతి తప్పు అంది నార్వే ప్రభుత్వం. అక్కడి బాలల సంరక్షణ అధికారులు అక్కడ నివసిస్తున్న భారతీయ జంట అనురూప్ భట్టాచార్య, సాగరికల నుంచి వారి ఇద్దరు పిల్లలను 2011లో అధీనంలోకి తీసుకున్నారు.
ఇందుకు కారణం నార్వే బాలల సంరక్షణ చట్టాలు. అక్కడ నివసిస్తున్న పౌరుల ఇళ్లలో పిల్లలు ఉంటే వారిని క్రమ విరామాలలో పరిశీలిస్తారు అధికారులు. అలా పరిశీలనకు వచ్చిన ప్రతిసారీ భారతీయ పద్ధతులకు పెడర్థాలు తీసి అనురూప్, సాగరికల పిల్లలు ప్రమాదంలో ఉన్నారని మూడేళ్ల కొడుకును, సంవత్సరం వయసు కుమార్తెను తమ అధీనంలోకి తీసుకెళ్లారు. ఆ పిల్లల కోసం సాగరిక చేసిన పోరాటాన్ని రాణి ముఖర్జీ ‘మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే’ సినిమాలో పునఃప్రతిష్ట చేసింది.
నటి ఊర్వశికి ఉత్తమ సహాయ నటి పురస్కారం
తెలుగువారికి చిరపరిచితమైన నటి ఊర్వశికి 2023 జాతీయ పురస్కారాల్లో ‘ఉల్లుజుక్కు’ (అంతఃప్రవాహం) సినిమాకు ఉత్తమ సహాయనటి పురస్కారం లభించింది. ఇదే సినిమాకు మలయాళం నుంచి ఉత్తమ జాతీయ చిత్రం పురస్కారం కూడా లభించింది.
‘ఉల్లుజుక్కు’లో ఊర్వశి అత్తగారి పాత్రలో నటించింది. ఆమె కుమారుడు పెళ్లయిన కొన్నాళ్లకే జబ్బు వల్ల మరణిస్తాడు. కోడలు ఆ పెళ్లికి ముందే ఒక వ్యక్తితో ప్రేమలో ఉంటుంది. కాని అనివార్యమై ఈ పెళ్లి చేసుకుంటుంది. భర్త మరణించే సమయానికి ఆ ప్రాంతంలో విపరీతమైన వానలు కురిసి వరద సంభవిస్తుంది.
పైకి కనిపించే ఆ వరదలో లోపలి ప్రవాహపు వేగం ఎంతో ఎవరికీ తెలియదు. అలాగే అత్తగారు, కోడలు తమ జీవితాల్లో ఏయే లోపలి గాథలతో సతమతమవుతున్నారో ప్రేక్షకులకు మెల్లగా తెలుస్తూ వస్తుంది. సినిమా ముగింపు సమయానికి కోడలు అత్తను వీడి వెళ్లే పరిస్థితి ఉన్నా చివరకు ఆమె తన ప్రియుణ్ణి కాదని అత్త వద్దకు చేరుకోవడంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమాలో అత్తగా ఊర్వశి, కోడలిగా పార్వతి తిరువోతు నటించగా ఊర్వశికి పురస్కారం దక్కింది.
సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై
జాతీయ పురస్కారాలలో మనోజ్ బాజ్‌పాయ్ నటించిన ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ సినిమాకు ఉత్తమ డైలాగ్ రైటర్ పురస్కారం దక్కింది. ఈ సినిమా జాతీయ పురస్కారాల పట్టికలో కనిపించడం చాలా ముఖ్యమైన విషయం.
దీనికి కారణం బాబాల చెరలో చిక్కి బలైపోతున్న చిన్నారి ఆడపిల్లల కోసం న్యాయం వైపు నిలబడితే న్యాయం దక్కి తీరుతుందని ఇందులోని కథానాయకుడు తన న్యాయవాద వృత్తి ద్వారా నిరూపిస్తాడు. ఆడపిల్లలకు ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో, వారి మీద లైంగిక దాడి జరిగితే ఎన్ని విధాల వొత్తిళ్లు వస్తాయో ఈ సినిమా చూపుతుంది. టీనేజ్ పిల్లలకూ, వారి తల్లిదండ్రులకూ, వారి కోసం పథకాలు రచించే కపట స్వాములకు ఈ సినిమా హెచ్చరిక.
(చదవండి: 77 ఏళ్ల 'ఫిట్‌నెస్ క్వీన్'..! ఓ బామ్మ సరిలేరు మీకెవ్వరూ..)