జెనరేషన్ మారుతోంది. మొన్నటి తరంలా నిన్నటి తరం లేదు, నిన్నటి తరంలా నేటితరం లేదు. ఇప్పుడంతా హైటెక్ స్పీడ్.. అయితే ఇదే కొన్నిసార్లు తనను భయానికి గురి చేస్తోందంటోంది బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాన్న (రామ్ ముఖర్జీ) ఉన్నప్పుడు నా సినిమాలు చూసి పర్ఫామెన్స్ ఎలా ఉందో చెప్పేవాడు. ఆయన వెళ్లిపోయాక ఫీడ్‌బ్యాక్ పొందడమే కష్టమైపోయింది.
నా కూతురు తట్టుకోలేదు
కానీ భగవంతుడు నాన్నను కోల్పోయిన లోటును కూతురితో భర్తీ చేశాడు. అయితే నా కూతురు నా సినిమాలు ఎక్కువగా చూడదు. ఎందుకంటే నేను ఏడ్చే సన్నివేశాలను చూసి తను తట్టుకోలేదు.. అదే సంతోషంతో డ్యాన్స్ చేసే సీన్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తుంటుంది. నేను నటించిన హిచ్కి, తోడా ప్యార్ తోడా మ్యాజిక్, బంటీ ఔర్ బబ్లీ సినిమాలు చాలా ఇష్టపడుతుంది.
మేకప్ వేసుకున్నా బాధే
కుచ్ కుచ్ హోతాహై మూవీ మాత్రం చూడలేదు. ఎందుకంటే అందులో నేను మొదటి సన్నివేశంలోనే చనిపోతాను. అది తను తట్టుకోలేదు. అలాగే నేను మేకప్ వేసుకుంటే కూడా తనకు నచ్చదు. నువ్వు నా అమ్మలా కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తుంది. మేకప్ తీసేయగానే ఇప్పుడు నువ్వు నా అమ్మవి అని చెప్తుంది. ఎంతైనా తను జెన్ ఆల్ఫా (2010 - 2024 మధ్య జన్మించినవారు) కిడ్.
అదే నా చిన్నతనంలో..
ఒక్కోసారి కోపంతో నాపై అరిచేస్తుంటుంది. అప్పుడు తను చెప్పేది నేను ఓపికగా వినాల్సిందే! అదే నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను చెంపదెబ్బలు కొట్టేది. అదే పని నేను చేశాననుకోండి, నా కూతురు తిరిగి కొట్టినా కొట్టొచ్చు. తను చాలా మంచి అమ్మాయి అయినప్పటికీ తనకు కొన్నిసార్లు భయపడుతూ ఉంటాను అని చెప్పుకొచ్చింది.
సినిమా
రాణీ ముఖర్జీ, నిర్మాత ఆదిత్య చోప్రా 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2015లో కూతురు అధీర జన్మించింది. సినిమాల విషయానికి వస్తే.. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికిగానూ రాణీ ముఖర్జీ.. ఉత్తమ నటిగా గతేడాది జాతీయ అవార్డు అందుకుంది. ప్రస్తుతం మర్దానీ 3 మూవీ చేస్తోంది.
చదవండి: కోహ్లితో రిలేషన్? స్పందించిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంజనా


