సంజనా గల్రానీ.. అప్పుడెప్పుడో బుజ్జిగాడు మూవీలో అలరించిన ఈ నటి కొంతకాలంగా సినిమాల్లో యాక్టివ్‌గా కనిపించడం లేదు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో హీరోయిన్‌గా చేసిన ఈమె ఇటీవల తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్‌లో పాల్గొంది. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఏకంగా టాప్ 5లో చోటు దక్కించుకుంది. అయితే గతంలో సంజనాపై ఓ రూమర్ ఉంది. క్రికెటర్ విరాట్ కోహ్లితో లవ్ ట్రాక్ నడిపిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఆ పబ్లిసిటీ వద్దు
కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఈ ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది సంజనా. ఆమె మాట్లాడుతూ.. నేను బెంగళూరు అమ్మాయిని. కన్నడలో టాప్ హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్‌కు అతిథిగా వెళ్లాను. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది తప్ప అంతకుమించి ఏమీ లేదు. అదంతా గతం. విరాట్ కోహ్లి గర్ల్‌ఫ్రెండ్‌గా గుర్తింపు పొందడం, ఆ పబ్లిసిటీ నాకవరసరమే లేదు. కానీ, ఈ లేనిపోని లవ్ రూమర్స్ మా స్నేహాన్ని చెడగొట్టాయి. ఈ రూమర్స్ రాకపోయుంటే ఇప్పటికీ మేము మంచి ఫ్రెండ్స్‌గా కొనసాగేవాళ్లం. ఆ బాధ నాకెప్పుడూ ఉంది అని చెప్పుకొచ్చింది.
ఏం జరిగిందంటే?
సంజనా గల్రానీ, క్రికెటర్ విరాట్ కోహ్లి 2011 సమయంలో ప్రేమించుకున్నారంటూ అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఆ ఏడాది ఐపీఎల్‌లో బెంగళూరుకు సపోర్ట్ చేసింది సంజనా.. ఈ క్రమంలోనే తరచూ మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియానికి వెళ్లేది. అలా ఓసారి ఆర్సీబీ జెర్సీ ధరించిన ఈ నటి.. విరాట్ కోహ్లితో కలిసి మైదానంలో ముచ్చట్లు పెట్టింది. ఈ మేరకు ఓ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. ఇంకేముంది, వీళ్లిద్దరికీ లింక్ పెడుతూ కథనాలు బయటకు వచ్చాయి. కానీ, కొంతకాలానికి వీరిద్దరూ మరెక్కడా కలిసి కనిపించలేదు.


