మరోసారి స్టార్‌ హీరోల మధ్య బాక్సాఫీస్‌ వార్‌.. | Vijay Theri And Ajith Mankatha Movies Ready For Clash Once Again At Box Office With Re-Release | Sakshi
Sakshi News home page

ఒకేరోజు రిలీజవుతున్న స్టార్‌ హీరోల సినిమాలు

Jan 19 2026 9:31 AM | Updated on Jan 19 2026 10:40 AM

Vijay Theri, Ajith Mankatha Movies Box Office Clash Once Again

కోలీవుడ్‌లో కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ తర్వాత ఆ స్థాయి కథానాయకులుగా రాణిస్తున్న నటులు విజయ్‌, అజిత్‌. వీరిద్దరి మధ్య మంచి మిత్రభావం ఉంది. అయితే వీరి అభిమానులు మధ్య మాత్రం ఎప్పటినుంచో పోటీ తత్వం నెలకొంది. ముఖ్యంగా అజిత్‌, విజయ్‌ నటించిన చిత్రాలు ఒకేరోజు విడుదలైతే ఆ సమయాల్లో వారి అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు.

30 ఏళ్లుగా..
రెండు చిత్రాల్లో ఏ ఒక్కటి విజయం సాధించినా మరో హీరోపై విమర్శల దాడి జరుగుతుంటుంది. అలా గత 30 ఏళ్లకు పైగా విజయ్‌, అజిత్‌ మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటూ వస్తోంది. ఇకపోతే విజయ్‌ నటించిన చివరి మూవీ జననాయకన్‌ ఈ నెల 9వ తేదీన విడుదల కావాల్సింది. కానీ, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ఇతర చిత్రాల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. 

రీరిలీజ్‌
అదేవిధంగా గతంలో విడుదలైన కొన్ని చిత్రాలు ఇప్పుడు రీ రిలీజ్‌ అవుతున్నాయి. అలాంటి వాటిలో నటుడు విజయ్‌ నటించిన తెరి, అజిత్‌ నటించిన మంగాత్తా చిత్రాలు కూడా చోటు చేసుకోవడం విశేషం. గతంలో మంచి విజయాలను సాధించిన ఈ రెండు చిత్రాలు ఈ నెల 23వ తేదీన రీరిలీజ్‌ కావడం మరో విశేషం. దీంతో ఈ చిత్రాలు సాధించే వసూళ్లపై ఆసక్తి నెలకొంది.

1996 సంక్రాంతికి మొదలు
ఇకపోతే విజయ్‌, అజిత్‌ గతంలో నటించిన చిత్రాలు ఒకేసారి విడుదలైన సందర్భాలను పరిశీలిస్తే 1996 సంక్రాంతి సమయంలో విజయ్‌ నటించిన కోయంబత్తూర్‌ మాప్పిళై, అజిత్‌ నటించిన వాన్మతి చిత్రాలు రిలీజయ్యాయి. అదే ఏడాది ఫిబ్రవరిలో విజయ్‌ నటించిన పూవే ఉనకాగా, అజిత్‌ నటించిన కల్లూరి వాసన్‌ చిత్రాలు మూడు రోజుల గ్యాప్‌తో విడుదలయ్యాయి. 1997లో విజయ్‌ నటించిన కాలమేల్లామ్‌ కార్తిరుప్పేన్‌ , అజిత్‌ నటించిన నేశం చిత్రాలు, అదే ఏడాది విజయ్‌ నటించిన కాదలుక్కు మర్యాదై, అజిత్‌ నటించిన రైట్టె జెండాపై వయసు చిత్రాలు వచ్చాయి.

స్టార్‌ హీరోల సినిమాలు రిలీజ్‌
1999లో విజయ్‌ నటించిన తుల్లాద మనం తుళ్ళుమ్‌ ,అజిత్‌ నటించిన ఉన్నైతేడి చిత్రాలు, 2000వ సంవత్సరంలో అజిత్‌ నటించిన ఉన్నై కొడు ఎన్నై తరువేన్‌ విజయ్‌ నటించిన ఖుషి చిత్రాలు, 2001లో విజయ్‌ నటించిన ఫ్రెండ్స్‌, అజిత్‌ నటించిన దీనా చిత్రాలు, 2002లో విజయ్‌ నటించిన భగవతి, అజిత్‌ నటించిన విలన్‌ చిత్రాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఇప్పుడు మరోసారి..
2003లో విజయ్‌ నటించిన తిరుమలై , అజిత్‌ నటించిన ఆంజనేయ చిత్రాలు, 2006లో విజయ్‌ నటించిన ఆది ,అజిత్‌ నటించిన పరమశివం.., 2007లో విజయ్‌ నటించిన పోకిరి , అజిత్‌ నటించిన ఆల్వార్‌ .., 2014లో విజయం నటించిన జిల్లా, అజిత్‌ నటించిన వీరం చిత్రాలు, 2023లో అజిత్‌ నటించిన తుణివు, విజయ్‌ నటించిన వారిసు చిత్రాలు ఒకేసారి రిలీజయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ స్టార్‌ హీరోల తేరి, మంగాత్తా సినిమాలు ఒకేసారి రీ రిలీజ్‌ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement