ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పని చేశాడు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో అటు కోన వెంకట్‌కు, ఇటు రవితేజకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా వీరి కాంబినేషన్ రిపీట్ అయింది. వెంకీ, భగీరథ, షాక్, డాన్ శీను, బలుపు, పవర్ సినిమాల్లో కలిసి పని చేశారు. అయితే రవితేజ హీరో కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు.
భోజనం చేస్తుండగా..
ఆ సమయంలో అతడు ఎదుర్కొన్న ఘోర అవమానాన్ని తాజాగా కోన వెంకట్ బయటపెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సెట్‌లో కొన్నిసార్లు కొందరు దారుణంగా మాట్లాడతారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భోజనం చేస్తుండగా చూసిన ఓ నిర్మాత.. లంచ్ టైమ్‌లో అడ్డమైనవాళ్లందరూ వచ్చి తింటారు అని చీదరించుకున్నాడు. ఎవడొస్తే వాడికి భోజనం పెడతావా? నీది కాదు కదా సొమ్ము అని వడ్డించినవాడిని తిట్టాడు.
లెవల్ చూపించమన్నా..
ఆ అసిస్టెంట్ డైరెక్టర్ పేరు చెప్తే షాకైపోతారు.. ఆయన మరెవరో కాదు, రవితేజ! అలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడు. కష్టాలను దాటుకుని తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు అదే నిర్మాత రవితేజ డేట్స్ కోసం వెంటపడ్డాడు. నిన్ను అవమానించిన అతడికి నీ లెవలేంటో చూపించు, పొరపాటున కూడా డేట్స్ ఇవ్వకు అని నేను సలహా ఇచ్చాను.
అదే అసలైన విజయం
కానీ రవితేజ నా మాట వినలేదు. ఆ నిర్మాతకు డేట్స్ ఇచ్చి, అతడి బ్యానర్‌లోనే హిట్టు కొడితేనే నా దృష్టిలో అసలైన విజయం అన్నాడు. చెప్పినట్లుగానే అతడి బ్యానర్‌లో సినిమా చేసి విజయం సాధించాడు. రవితేజ స్థానంలో నేనుంటే మాత్రం సినిమా చేసేవాడిని కాదు అని కోన వెంకట్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ నిర్మాత ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు.


