
దుర్గామాత పూజలకు అన్నీ సిద్ధం అనుకునేలోపు నైవేద్యాల తయారీ ఎలా– అనే ఆందోళన తలెత్తడమూ సహజం... ఏమేం కావాలి, ఎలా రెడీ చేసుకోవాలో ముందే తెలుసుకుని, ఆచరణలో పెడితే అమ్మవారికి రుచిగా... శుచిగా నైవేద్యాలను సులువుగా సిద్ధం చేసుకోవచ్చు. టిప్ ఆఫ్ ది డేలో భాగంగా ఆ వివరాలు ఈ వారం వంటిల్లులో..
పరమాన్నం
కావలసినవి: పెసరపప్పు - 1/2 కప్పు; బియ్యం -3/4 కప్పు; పాలు -కప్పు; నీళ్లు - 4 కప్పులు; బెల్లం తరుగు- కప్పు; యాలకుల పొడి-అర టీ స్పూన్; నెయ్యి - 3 టేబుల్‌స్పూన్లు; జీడిపప్పు-పది పలుకులు; కిస్‌మిస్ – గుప్పెడు.
తయారీ: ∙పప్పును దోరగా వేయించుకోవాలి ∙బియ్యం, పప్పు కలిసి కడగాలి. కుకర్‌లో కడిగిన బియ్యం, పప్పు, నీళ్లు కలిపి 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించి, దించాలి. మందపాటి గిన్నెలో బెల్లం తరుగు వేసి వేడిచేయాలి. దీంతో 3–4 నిమిషాల్లో బెల్లం పాకం సిద్ధం అవుతుంది.కుకర్ విజిల్ వచ్చాక మూత తీసి, అన్నం మెత్తగా స్పూన్‌తో మెదుపుకోవాలి. పాలు పోసి కలపాలి ∙ఫిల్టర్ పెట్టి, బెల్లం సిరప్ వడకట్టి, మెత్తగా అయిన అన్నంలో కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని స్టౌపై పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. దీంట్లో యాలకుల పొడివేసి కలపాలి.విడిగా మరొక మూకుడులో నెయ్యి వేడి చేసి, దాంట్లో జీడిపప్పు, కిస్‌మిస్ వేసి దోరగా వేయించాలి. నెయ్యిలో వేయించిన జీడిపప్పు మిశ్రమంలో కలిపి, గిన్నెలోకి తీసుకోవాలి.
చదవండి: మళ్లీ కేన్సర్, స్టేజ్-4, ధైర్యంగా ఓడిస్తా : నటి పోస్ట్ వైరల్
అల్లం గారెలు
కావలసినవి: మినప్పప్పు- కప్పు; ఉప్పు - 1/3 టీ స్పూన్ (తగినంత); వంట సోడా- చిటికెడు; పచ్చిమిర్చి తరుగు – అర టీ స్పూన్; అల్లం తరుగు – టేబుల్ స్పూన్; కరివేపాకు - 2 రెమ్మలు; మిరియాల పొడి - పావు టీ స్పూన్; నూనె-వేయించడానికి తగినంత.
తయారీ: ∙మినప్పప్పు కడిగి, 3–4 గంటలసేపు నానబెట్టాలి. నీళ్లు వడకట్టి, ఉప్పు వేసి, మెత్తగా రుబ్బుకోవాలి ∙రుబ్బిన పిండిలో పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, మిరియాల పొడి, కరివేపాకు తరుగు వేసి కలపాలి. స్టౌ పై కడాయి పెట్టి, గారెలు వేయించడానికి తగినంత నూనె పోసి, వేడి చేయాలి ∙వేళ్లకు నీళ్లు తగిలేలా తడి చేసుకొని, పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని, వేళ్లతోనే బాల్స్‌లా చేసుకోవాలి ∙నూనె రాసిన ΄్లాస్టిక్ షీట్‌పైన పిండి బాల్‌ను కొద్దిగా వేళ్లతో అదిమి, మధ్యలో హోల్ పెట్టాలి ∙తయారు చేసుకున్న దానిని కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా గోధుమ రంగు వచ్చే వరకు ఉంచి, బయటకు తీసి, ప్లేటులో పెట్టాలి.

కదంబం
కావలసినవి: బియ్యం-కప్పు; కందిపప్పు-అరకప్పు, చింతపండు నిమ్మ కాయంత; కూరగాయలు - బీరకాయ, సొరకాయ, గుమ్మడికాయ, బెండకాయ, దొండకాయ, గాజర్, బఠానీ.. మొదలైనవి – 150 గ్రాములు (చిన్న ముక్కలు); పసుపు- పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత; సాంబార్ పొడి – 2 టీ స్పూన్లు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – టీ స్పూన్; ఎండుమిర్చి – 2; ఇంగువ – చిటికెడు; నెయ్యి – బేటుల్ స్పూన్.
తయారీ: కందిపప్పు బాగా ఉడికించి, మెత్తగా మెదిపి పక్కనుంచాలి. మరొక గిన్నెలో బియ్యం మెత్తగా ఉడికించి, వేరుగా ఉంచాలి ∙ఒక గిన్నెలో కూరగాయల ముక్కలు, చింతపండు రసం, పసుపు, ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి.ఉడికిన కూరగాయ ముక్కల్లో సాంబార్ పొడి వేసి బాగా కలపాలి ∙మెత్తగా చేసిన పప్పు, అన్నం ఉడుకుతున్న కూరగాయల మిశ్రమంలో వేసి కలపాలి ∙ఒక చిన్నపాన్‌లో నూనె వేసి వేడి చేసి, ఆవాలు, జిలకర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసిన తాలింపును వేసి కలపాలి. గిన్నెలోకి తీసిన తర్వాత చివరగా నెయ్యి వేయాలి.
– నారాయణమ్మ,
మీ థాట్ హోమ్ డిలైట్