
బాలీవుడ్ సీనియర్ నటి నఫీసా అలీ మరోసారి కేన్సర్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమెకు కేన్సర్ అడ్వాన్స్‌డ్ స్టేజ్-4లో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని స్వయంగా నఫీసా సోషల్‌మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఆమె ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని,విజయం సాధించాలనే దృఢ సంకల్పంతో పోరాడాలని పలువురు అభిమానులు ప్రార్థిస్తున్నారు.
2018లో స్టేజ్ 3 పెరిటోనియల్, అండాశయ క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడారు. కోలుకొని అప్పటినుంచి కేన్సర్ ఫ్రీగా ఉన్న ఆమెమళ్లీ కేన్సర్ బారిన పడ్డారు. కేన్సర్ తిరిగి వచ్చిందంటూ నటి , రాజకీయ నాయకురాలు నఫీసా అలీ సోధి ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ సాధ్యం కాదుకాబట్టి, కీమోథెరపీని తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. "ఈరోజు నుండి నా ప్రయాణంలో కొత్త అధ్యాయం. నేను నిన్న PET స్కాన్ చేయించుకున్నాను... కాబట్టి శస్త్రచికిత్స సాధ్యం కానందున కీమోథెరపీ చేయించుకోబోతున్నాను. బిలీవ్ మీ.. నేను జీవితాన్ని ప్రేమిస్తున్నాను."అంటూ తన పోస్ట్‌లో ఎంతో ధైర్యంగా తన హెల్త్ అప్‌డేట్ గురించి తెలియజేశారు.దీంతోపాటు స్క్రీన్‌షాట్‌ను, వరుస ఫోటోలను షేర్ చేశారు. ఒక రోజు నా పిల్లలు, అమ్మా, నువ్వు వెళ్లిపోతే..మమ్మల్ని ఎవరు చూస్తారు అని అడిగారు? తోబుట్టువులైన మీరే ఒకరికొకరు తోడు. అదేనేను మీకిచ్చిన గొప్ప బహుమతి . సిబ్లింగ్స్‌మధ్య ప్రేమ, జ్ఞాపకాలు, జీవితంలో సోదర బంధం చాలా ధృఢమైంది అని చెప్పాను అని తెలిపారు. మరో ఫోటోలో ద పవర్ ఆఫ్ లవ్ అంటూ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశారు.
అండాశయ మరియు పెరిటోనియల్ కేన్సర్ అంటే?
ప్రతి రోగిలోను కేన్సర్ భిన్నంగా ఉన్నప్పటికీ, ఈ రకమైన కేన్సర్‌లో పునరావృతం కావడం చాలా సాధారణం. ప్రారంభ దశ వ్యాధితో పోలిస్తే .. అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువే. దశ-3 అండాశయ కేన్సర్ పునరావృత రేటు 70-90శాతం మధ్య ఉంటుంది.
నఫీసాకు కేన్సర్ అండాశయాలను దాటి ఉదర కుహరం (పెరిటోనియం) లేదా సమీపంలోని శోషరస కణుపుల లైనింగ్‌లోకి వ్యాపించింది. చికిత్సలో భాగంగా కేన్సర్ కణాలను తొలగించడానికి శస్త్రచికిత్స,మిగిలిన కేన్సర్ కణాలను నాశనం చేసేందుకు కీమోథెరపీని చికిత్స అవసరం. కడుపు ఉబ్బరం, వాపు, నొప్పి లాంటి సాధారణ లక్షణాలు ప్రారంభదశలో ఉంటాయి. సాధారణంగా ఇవి అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లోనే బయటపడతాయి. ప్రారంభ దశల్లో గుర్తిస్తే నయం చేయవచ్చు.
అండాశయ కేన్సర్‌ను నివారణకు మహిళలు ఏమి చేయాలి?
ఊబకాయం అతిపెద్ద ప్రమాద కారకం. కాబట్టి స్త్రీలు శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. పండ్లు, కూరగాయలు ,తృణధాన్యాలు అధికంగా ఉండే మంచి సమతుల్య ఆహారం తీసుకోవాలి. చక్కెరను తక్కువగా తీసుకోవాలి. ఇంకా మద్యం, ధూమపానం , ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తోపాటు, కుటుంబ చరిత్ర ఉంటే జన్యు పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం.
నఫీసా అలీ
ప్రముఖ గోల్ఫర్ , అర్జున్ అవార్డీ కల్నల్ సోధిని పెళ్లాడిన నఫీసాకు కుమార్తెలు అర్మానా , పియా,కుమారుడు అజిత్ ముగ్గురు సంతానం ఉన్నారు. 1979లో నఫీసా అలీ శశికపూర్ సరసన ‘జునూన్’ అనే బాలీవుడ్ చిత్రంలో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 2005లో చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియాకు చైర్ పర్సన్‌గా వ్యవహరించారు. సినీ రంగంతోనే కాకుండా రాజకీయ రంగంతోనూ నఫీసాకు పరిచయం ఉంది. 2009లో సమాజ్ వాదీ టికెట్‌పై పోటీ చేశారు.
నఫీసా అలీ అనేక రంగాలలో విజయాలు సాధించారు. 1972 నుండి 1974 వరకు జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్. 1976లోఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్నారు. మిస్ ఇంటర్నేషనల్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి. 2వ రన్నరప్‌గా నిలిచారు. 1979లో అలీ కలకత్తా జింఖానాలో జాకీగా కూడా పనిచేశారు.