breaking news
lord durga
-
Dussehra 2025 అమ్మవారి ప్రసాదాలు, రెసిపీలు
దుర్గామాత పూజలకు అన్నీ సిద్ధం అనుకునేలోపు నైవేద్యాల తయారీ ఎలా– అనే ఆందోళన తలెత్తడమూ సహజం... ఏమేం కావాలి, ఎలా రెడీ చేసుకోవాలో ముందే తెలుసుకుని, ఆచరణలో పెడితే అమ్మవారికి రుచిగా... శుచిగా నైవేద్యాలను సులువుగా సిద్ధం చేసుకోవచ్చు. టిప్ ఆఫ్ ది డేలో భాగంగా ఆ వివరాలు ఈ వారం వంటిల్లులో..పరమాన్నం కావలసినవి: పెసరపప్పు - 1/2 కప్పు; బియ్యం -3/4 కప్పు; పాలు -కప్పు; నీళ్లు - 4 కప్పులు; బెల్లం తరుగు- కప్పు; యాలకుల పొడి-అర టీ స్పూన్; నెయ్యి - 3 టేబుల్‌స్పూన్లు; జీడిపప్పు-పది పలుకులు; కిస్మిస్ – గుప్పెడు.తయారీ: ∙పప్పును దోరగా వేయించుకోవాలి ∙బియ్యం, పప్పు కలిసి కడగాలి. కుకర్‌లో కడిగిన బియ్యం, పప్పు, నీళ్లు కలిపి 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించి, దించాలి. మందపాటి గిన్నెలో బెల్లం తరుగు వేసి వేడిచేయాలి. దీంతో 3–4 నిమిషాల్లో బెల్లం పాకం సిద్ధం అవుతుంది.కుకర్ విజిల్ వచ్చాక మూత తీసి, అన్నం మెత్తగా స్పూన్‌తో మెదుపుకోవాలి. పాలు పోసి కలపాలి ∙ఫిల్టర్ పెట్టి, బెల్లం సిరప్ వడకట్టి, మెత్తగా అయిన అన్నంలో కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని స్టౌపై పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. దీంట్లో యాలకుల పొడివేసి కలపాలి.విడిగా మరొక మూకుడులో నెయ్యి వేడి చేసి, దాంట్లో జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించాలి. నెయ్యిలో వేయించిన జీడిపప్పు మిశ్రమంలో కలిపి, గిన్నెలోకి తీసుకోవాలి.చదవండి: మళ్లీ కేన్సర్, స్టేజ్-4, ధైర్యంగా ఓడిస్తా : నటి పోస్ట్ వైరల్అల్లం గారెలుకావలసినవి: మినప్పప్పు- కప్పు; ఉప్పు - 1/3 టీ స్పూన్ (తగినంత); వంట సోడా- చిటికెడు; పచ్చిమిర్చి తరుగు – అర టీ స్పూన్; అల్లం తరుగు – టేబుల్ స్పూన్; కరివేపాకు - 2 రెమ్మలు; మిరియాల పొడి - పావు టీ స్పూన్; నూనె-వేయించడానికి తగినంత.తయారీ: ∙మినప్పప్పు కడిగి, 3–4 గంటలసేపు నానబెట్టాలి. నీళ్లు వడకట్టి, ఉప్పు వేసి, మెత్తగా రుబ్బుకోవాలి ∙రుబ్బిన పిండిలో పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, మిరియాల పొడి, కరివేపాకు తరుగు వేసి కలపాలి. స్టౌ పై కడాయి పెట్టి, గారెలు వేయించడానికి తగినంత నూనె పోసి, వేడి చేయాలి ∙వేళ్లకు నీళ్లు తగిలేలా తడి చేసుకొని, పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని, వేళ్లతోనే బాల్స్‌లా చేసుకోవాలి ∙నూనె రాసిన ΄్లాస్టిక్ షీట్‌పైన పిండి బాల్‌ను కొద్దిగా వేళ్లతో అదిమి, మధ్యలో హోల్ పెట్టాలి ∙తయారు చేసుకున్న దానిని కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా గోధుమ రంగు వచ్చే వరకు ఉంచి, బయటకు తీసి, ప్లేటులో పెట్టాలి. కదంబంకావలసినవి: బియ్యం-కప్పు; కందిపప్పు-అరకప్పు, చింతపండు నిమ్మ కాయంత; కూరగాయలు - బీరకాయ, సొరకాయ, గుమ్మడికాయ, బెండకాయ, దొండకాయ, గాజర్, బఠానీ.. మొదలైనవి – 150 గ్రాములు (చిన్న ముక్కలు); పసుపు- పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత; సాంబార్ పొడి – 2 టీ స్పూన్లు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – టీ స్పూన్; ఎండుమిర్చి – 2; ఇంగువ – చిటికెడు; నెయ్యి – బేటుల్ స్పూన్.తయారీ: కందిపప్పు బాగా ఉడికించి, మెత్తగా మెదిపి పక్కనుంచాలి. మరొక గిన్నెలో బియ్యం మెత్తగా ఉడికించి, వేరుగా ఉంచాలి ∙ఒక గిన్నెలో కూరగాయల ముక్కలు, చింతపండు రసం, పసుపు, ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి.ఉడికిన కూరగాయ ముక్కల్లో సాంబార్ పొడి వేసి బాగా కలపాలి ∙మెత్తగా చేసిన పప్పు, అన్నం ఉడుకుతున్న కూరగాయల మిశ్రమంలో వేసి కలపాలి ∙ఒక చిన్నపాన్లో నూనె వేసి వేడి చేసి, ఆవాలు, జిలకర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసిన తాలింపును వేసి కలపాలి. గిన్నెలోకి తీసిన తర్వాత చివరగా నెయ్యి వేయాలి. – నారాయణమ్మ, మీ థాట్ హోమ్ డిలైట్ -
Dussehra 2024 అమ్మవారికిష్టమైన ఘుమ ఘుమల చింతపండు, ఇంగువ పులిహోర
తెలుగువారికి పులిహోర లేనిదే ఏ పండుగ, వేడుక అయినా నిండుగా ఉండదు. అందులోనూ చింతపండుతో చేసి, ఇంగువ వాసనతో ఘుమఘుమలాడుతూ ఉంటే.. ఆహా అద్భుతం అంటూ ఆరగిస్తారు. ఇక దసరా నవరాత్రులలో అమ్మవారికి పులిహోర ఎంత ముఖ్యమైందో చెప్పాల్సిన పనిలేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, గుడిలో ప్రసాదమంత పవిత్రంగా, రుచికరంగా అద్భుతమైన పులిహోర తయారీ ఎలానో తెలుకుందాం పదండి!కావాల్సిన పదార్థాలు :బియ్యం పావుకేజీ, 100 గ్రా. చింతపండు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు,తాజాగా కరివేపాకు రెబ్బలు మూడు, నాలుగైదు పచ్చిమిరపకాయలు, ఆవాలు- రెండు టేబుల్ స్పూన్లు, అల్లం- చిన్నముక్క నాలుగు ఎండుమిర్చి , చిటికెడు ఇంగువ, కొద్దిగా బెల్లంపొడి, తాలింపు గింజలు, పల్లీలు లేదా జీడిపప్పుతయారీ ముందుగా బియ్యాన్ని(పాత బియ్యం అయితే బావుంటుంది) కడిగి, కాస్త పదునుగా అన్నాన్ని వండుకోవాలి. ఉడికేటపుడు కొద్దిగా ఆయిల్ వేస్తే మెత్తగా అయిపోదు. చింతపండు శుభ్రం చేసుకొని నీళ్లలో నానబెట్టుకోవాలి.అన్నం ఉడికిన తరువాత ఒక బేసిన్‌లోకి తీసుకొని వేడిగా ఉన్నపుడే రెండురెబ్బల కరివేపాకులు, పసుపు, ముందుగా నూరిపెట్టుకున్న ఆవాల ముద్ద కొద్దిగా ఉప్పు, నూనె వేసి కలిపుకోవాలి. మెతుకు నలిగి పోకుండా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి.నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు తీసుకోవాలి. ఇపుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసి చింతపండు పులుసుపోసి అది చిక్కగా అయ్యేంతవరకు ఉడిరకించుకోవాలి. ఇందులోనే చిటికెడు, పసుపు, ఉప్పు, నాలుగు పచ్చిమిరపాయలు చీల్చి వేసుకోవాలి. పులుసులో ఉడికి కారం లేకుండా తినడానికి బావుంటాయి. ఇందులోనే రవ్వంత బెల్లం కలిపి, స్టవ్ ఆఫ్ చేయాలి.ఈ పులుసును చల్లారిన అన్నంలో అన్నీ బాగా కలిసేలాగా జాగ్రత్తగా కలపాలి.ఇక చివరిగా కడాయిలో ఆయిల్ పోసి, ఆవాలు, ఎండు మిర్చి వేసి, తరువాత వేరు సెనగపప్పు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు బాగా వేయించాలి. ఆ తరువాత కాస్తంత ఇంగువ వేయాలి. పోపు వేగి కమ్మటి వాసన వస్తున్నపుడు స్టవ్ మీదినుంచి దింపేయాలి.దీన్ని పులుసు కలిపి ఉంచుకున్న అన్నంలో కలిపితే.. ఘుమ ఘుమలాడే పులిహోర రెడీ. అమ్మవారికి నైవేద్యం పెట్టినంక , ఇంట్లోని వారందరూ తింటే ఆ రుచే వేరు! -
Dussehra 2024 : అద్భుత దసరా వేడుక చూడాలంటే, కోరిక నెరవేరాలంటే!
దసరా వచ్చిందంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఆగమేఘాల మీద సొంతూర్లకు చేరిపోతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా వేడుక చేసుకుంటారు. ఏమూలన ఉన్నా భారతీయులు అత్యంత ఉత్సాహంగా చేసుకునే ప్రముఖమైన పండుగ దసరా. మనలోని శక్తిని, శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన శక్తిని జాగృత పరిచే, దైవ అనుగ్రహంతో, మంత్ర శక్తితో, నియమబద్ధమైన జీవితంతో జాగృత పరిచే ఒక వ్రతం ఈ నవరాత్ర వ్రతం. తొమ్మిది రోజులు, తొమ్మిది రూపాల్లో జగన్మాతను ఆరాధిస్తారు. దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దసరా ఉత్సవాలు అనగానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని బెజవాడ, వరంగల్‌తో పాటు కోల్‌కతా, మైసూరు, ఢిల్లీ, కులు ప్రాంతాలు గుర్తుకొస్తాయి. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవుల సందడి ఉండనే ఉంటుంది. అందుకే కోరిన కోర్కెలను నెరవేర్చే జగన్మాతను దర్శనంతో తరించే పుణ్యక్షేత్రాలను చూద్దాం.ఇంద్రకీలాద్రివిజయవాడలోని ఇంద్ర కీలాద్రిఫై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఉంటాయి. వివిధ రూపాల్లో అత్యంత మనోహరంగా అలంకరించే అమ్మవారిని దర్శించుకునేందుకు జనం క్యూ కడతారు. చివరి రోజు నిర్వహించే సంబరాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయంలో కూడా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతాయి. ఇంకా శ్రీశైలం, తిరుపతి లాంటి పుణ్య క్షేత్రాలు దసరా పదిరోజులూ ప్రత్యేక సందడి ఉంటుంది.బతుకమ్మతెలంగాణాలో పూల పండగు బతుకమ్మ సంబరాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి వరకు గౌరీమాతను ఆరాధిస్తారు. బతుకమ్మ ఆటపాటలతో ఊరూ వాడా మార్మోగిపోతాయి. గునుగు, తంగేడు, బంతి, గుమ్మడి ఇలా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి అందంగా ముస్తాబైన ఆడబిడ్డలు ఆడిపాడతారు. రోజొక్క తీరు తొమ్మిదిరోజుల పాటు గౌరమ్మకుమొక్కి చివరి రోజు గంగలో నిమజ్జనం చేస్తారు.కోల్‌కతా దుర్గాపూజపశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో దుర్గా పూజ వేడుకలతో శరన్నవరాత్రులను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. . అమ్మవారు స్వయంగా ఇలకు దిగివస్తుందని ఇక్కడి వారి నమ్మకం. అందుకే పుట్టింటికి వచ్చి ఆడబిడ్డలా అపురూపంగా భావిస్తారు.సిలిగురి, జల్పైగురి, బీర్భూమ్ , బంకురా వంటి ప్రసిద్ధ ప్రదేశాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపు చూడాలంటే రెండు కళ్లూ చాలవు. మైసూర్ దసరా ఊరేగింపుకర్ణాటక రాష్ట్రంలో నవరాత్రి వేడుకలను విజయ దశమితో కలిపి పది రోజుల పాటు నిర్వహిస్తారు. ముఖ్యంగా 500 ఏళ్ల చరిత్ర గల మైసూరు దసరా వేడుకలు చాలా ప్రత్యేకం. మైసూర్ ప్యాలెస్ నుంచి బన్నీ మంటపా వరకు నిర్వహించే ఈ ఊరేగింపు అద్భుతంగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా పర్యటకులు భారీ సంఖ్యలో తరలివస్తారు. దసరా వేడుకలు కేవలం అమ్మవారి పూజలు మాత్రమే కాదు, నవరాత్రుల్లో తొమ్మిదో రోజున ఈ రాచఖడ్గాన్ని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో కలిపి ఊరేగింపుగా తీసుకువచ్చి, పూజలు చేస్తారు.అహ్మదాబాద్దుర్గాపూజతో పాటు రాముడు, రావణుడిపై సంహరించిన సందర్భాన్ని పురస్కరించుకుని వైభవంగా దసరా నిర్వహిస్తారు. ప్రధానంగా లక్ష్మీ విలాస్ ప్యాలెస్ , నవ్లాఖీ మైదానంలో వేడుకులను ప్రధానంగా చెప్పుకోవచ్చు. దాండియా నృత్యాలు, సాంస్కతిక కార్యక్రమాలు ఘనంగా ఉంటాయి ముగింపు రోజు భారీ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడం ఇక్కడి ప్రత్యేకత.ఢిల్లీ, వారణాసిదేశ రాజధాని నగరం ఢిల్లీలోని రాంలీలా మైదాన్, ఎర్రకోట , సుభాష్ మైదాన్ వంటి ప్రదేశాల్లో దసరా వేడుకలు కన్నులపండువగా ఉంటాయి. రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఢిల్లీ, వారణాసి నగరాల్లో దుర్గాదేవిని ఆరాధిస్తారు. రాంలీలా మైదానంలో రావణుడి బొమ్మను దహనం చేస్తారు. వారణాసి నగరంలో చిన్నారులంతా పౌరాణిక పాత్రల వేషధారణలో అలరిస్తారు.వైష్ణో దేవి ఆలయ ఉత్సవాలుజమ్మూ కశ్మీర్ కత్రాలో ఉన్న వైష్ణో దేవి ఆలయంలో శరన్నవరాత్రులను చూసి తరించాల్సిందే. విద్యుద్దీప కాంతులతో సంబరాలు అంబరాన్నంటు తాయి. ఇక్కడ తొమ్మిదిరోజుల పాటు జగన్మాత ఆరాధనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంగ ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. హిమాచల్ ప్రదేశ్: హిమాచల్ ప్రదేశ్ కులు పట్టణంలో అట్టహాసంగా జరుగుతాయి దసరా వేడుకలు. అయితే ఇక్కడ వేడుస దసరా రోజు మొదలై ఏడు రోజుల పాటూ సాగుతుంది. రాజస్తాన్ : రాజస్థాన్‌లో రాజభవనంలో మొదలై, రాజకుటుంబ సభ్యులు జాతరగా మైదానానికి ఊరేగింపుగా తరలివస్తారు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి బొమ్మలు దహనం చేసి బాణసంచా పేల్చుతారు. బస్తర్ దసరా: ఛత్తీస్ గఢ్ లో నిర్వహించే దసరానే ఉత్సవాలనే బస్తర్ దసరాగా ప్రసిద్ధి చెందింది. బస్తర్‌లోని గిరిజన ప్రాంత రక్షణ దేవత దంతేశ్వరి దేవిని ఆరాధిస్తారు. ఈ ప్రాంతంలో రథాల ఉరేగింపు చూసి తీరాల్సిందే.దేవభూమి, రఘునాధుని రథయాత్రహిమాచల్ ప్రదేశ్‌లో కులు దసరా వేడుకల గురించి తెలుసుకోవాలి. ఈ సంవత్సరం,అంతర్జాతీయ కులు దసరా అక్టోబర్ 13 నుండి 19 వరకుజరుగుతుంది. 7 రోజుల పండుగలో రథయాత్ర ప్రత్యేకం. మహాకుంభ్ పేరుతో నిర్వహించే రఘునాథుని రథయాత్ర వేలాది మంది భక్తులు తరలివస్తారు స్థానిక జానపద నృత్యాలతో పాటు వివిధ దేశాల సంస్కృతిని కూడా ప్రదర్శించేలా కార్యక్రమంలో ప్రతి సంవత్సరంలాగే అంతర్జాతీయ నృత్యోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దాదాపు 365 స్థానిక దేవతలు, దేవతలు కులులో నివసిస్తున్నారని భూమిని దేవభూమి అని పిలుస్తారు. -
దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రి అమ్మవారు
-
దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రి అమ్మవారు
సాక్షి, విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రులలో భాగంగా ఎనిమిదో రోజున అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాగా, దుర్గాదేవిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే కొండపైకి చేరుకున్నారు. దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినందుకు ప్రతీకగా అమ్మను ఈ అవతారంలో అలంకరిస్తారు. ఎనిమిది చేతులతో, ఎనిమిది రకాలైన ఆయుధాలను ధరించి, శత్రువులను సంహరించే స్వరూపంతో అమ్మవారి రూపం కన్నులపండువ కలిగిస్తోంది. మలయప్పస్వామిగా తిరుపతి వెంకన్న తిరుమల : తిరుమలలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. తిరుమల మాడ వీధుల్లో శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంలో ఊరేగుతున్నారు. స్వామి రథసారథిగా సూర్యుడు ఆదిత్యుని రూపంలో సారథ్యం వహిస్తున్నాడు. తిరుమల గిరులన గోవింద నామస్మరణతో ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం చంద్రప్రభ వాహనం మీద స్వామి రావటంతో, దివారాత్రాల కు తానే అధినేతనని ప్రకటించినట్లు భక్తులు భావిస్తారు. చంద్రప్రభ వాహనం మీద వచ్చే స్వామి, చంద్రప్రభలకు ప్రతీకలైన తెలుపు వస్త్రాలు, తెల్లని పుష్పాలు, మాలలు ధరించటం విశేషం . -
ఘనంగా దేవీ నిమజ్జనం
మహబూబాబాద్: పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కొలువుదీరిన దుర్గాదేవి అమ్మవార్ల నిమజ్జనం సందర్భంగా బుధవారం రాత్రి అమ్మవార్ల ఊరేగింపులు ఆయా ఉత్సవకమిటీల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. వాసవి సేవా ట్రస్ట్ మహబూబాబాద్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో దేవీశరన్నవరాత్సోవాల సందర్భంగా పూజలందుకున్న దుర్గామాతను భద్రాచలంలోని గోదావరినదిలో గురువారం ఉదయం నిమజ్జనం చేశారు. అనంతరం భక్తులు సీతారామచంద్రస్వామివారి దేవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహణాధికారి ఒబిలిశెట్టి రామకృష్ణ, కొత్త సోమన్న, సోమ శ్రీనివాస్, కందిమల్ల జగత్, నర్సింహస్వామి, కల్పన, మౌనిక, ఉమారాణి, రమాదేవి, అఖిల్, సురేష్, ఒబిలిశెట్టి రవికుమార్, గోపురాము, నాగమల్ల నరేష్, మారెపల్లి కౌశిక్, శివనాథుల శ్రీనివాస్, వెలిశాల భద్రీనాథ్ పాల్గొన్నారు.