ఇంటిని కూల్‌గా ఉంచడంలో ఆవుపేడ సహాయపడుతుందా..? | DU Professor Paints College Walls With Cow Dung To Keep Classroom Cool | Sakshi
Sakshi News home page

Eco Friendly: ఇంటిని కూల్‌గా ఉంచడంలో ఆవుపేడ సహాయపడుతుందా..?

Apr 25 2025 9:59 AM | Updated on Apr 25 2025 1:15 PM

DU Professor Paints College Walls With Cow Dung To Keep Classroom Cool

వేసవిలో ఇల్లు చల్లగా ఉండడానికి ఆవు పేడ ఉపయోగపడుతుందా? కాస్త వెనక్కి వెళితే....‘అవును’ అనే జవాబు వినిపిస్తుంది. ఒకప్పుడు పల్లెల్లో ఇంట్లో నేల, వాకిళ్లను పేడతో అలికేవారు. గోడలకు పూసేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే అప్పట్లో ఆవు పేడతో అలకడం అనేది ఎకో–ఫ్రెండ్లీ అల్టర్నేటివ్‌. ఆవుపేడ పూసిన గృహాలు వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటాయి. 

ఇది మన దేశ వైవిధ్య వాతావరణానికి సరిపోయే పద్ధతి. ఈత సంప్రదాయ పద్ధతి మళ్లీ పునర్దర్శనం ఇస్తోంది. ఢిల్లీ యూనివర్శిటీలో లక్ష్మీబాయి కాలేజి క్లాస్‌రూమ్‌ గోడకు ప్రిన్సిపాల్‌ డా.ప్రత్యూష వత్సల ఆవుపేడను పూస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.  మాజీ ప్రొఫెసర్, పర్యావరణ ప్రేమికులు డా.శివసుదర్శన్‌ మాలిక్‌ ఇళ్లను చల్లబర్చడానికి ఆవు పేడను ఉపయోగించే పురాతన భారతీయ విధానాన్ని పునరుద్ధరిస్తున్నారు.

ఆవుపేడ, బంకమట్టి, వేప ఆకులు, జిప్సం... 
ఇలాంటి వాటితో ‘వేద ప్లాస్టర్‌’ను సృష్టించారు మాలిక్‌. సిమెంట్‌ ఆధారిత ప్లాస్టర్‌ మాదిరిగా ఇది వేడిని గ్రహించదు.ఇళ్లలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. స్థానికంగా లభించే పదార్థాలు, ఆవుపేడతో ‘గోక్రెట్‌ బ్రిక్స్‌’ తయారు చేశారు మాలిక్‌. ‘ఈ ఇటుకలు వేడి ప్రవేశాన్ని 70 శాతం తగ్గించడానికి రూపొందించాం’ అంటున్నారు మాలిక్‌. పురాతన జ్ఞానం, సివిల్‌ ఇంజనీరింగ్‌ను మిళితం చేసి వాతావరణ మార్పులకు పరిష్కార మార్గాలు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు డా.శివసుదర్శన్‌ మాలిక్‌. 

Advertisement
 
Advertisement
Advertisement