షేరెంటింగ్‌ ముప్పు...పేరెంట్స్‌ పారాహుషార్‌ | Do you know Sharenting May be worst effect on your kids | Sakshi
Sakshi News home page

Sharenting షేరెంటింగ్‌ ముప్పు...పేరెంట్స్‌ పారాహుషార్‌

Aug 15 2025 11:52 AM | Updated on Aug 15 2025 12:28 PM

Do you know Sharenting May be worst effect on your kids

చిన్నారులను సోషల్‌ మీడియాకు ఎక్కిస్తున్న పేరెంట్స్‌

ఫొటోల షేరింగ్‌తో పిల్లలకు పొంచి ఉన్న ప్రమాదం

వారి గోప్యతను కాపాడటం తల్లిదండ్రుల బాధ్యత

సోషల్‌ మీడియా రాక ముందు, పిల్లల గారాలు ఇంటి గడప దాటేవి కావు. మహా అయితే స్నేహితులకు, ఇరుగు పొరుగువారికి, బంధువులకు.. పిల్లల ఘనకార్యాల గురించి చెప్పుకొని మురిసిపోయేవారు తల్లిదండ్రులు. పుట్టినరోజు వేడుకల వంటివి చేసినప్పుడు ఆ ఫొటోలు ఉన్న ఆల్బమ్‌ను ఇంటికి వచ్చిన వారికి చూపించేవారు. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఇలానే ఉండేది. కానీ ఇప్పుడు ఆ మురిపాలు ఖండాలు దాటుతున్నాయి! పిల్లల ఫొటోలను ఆన్‌లైన్‌లో పంచుకోవాలనే సంతోషం సహజమే అయినప్పటికీ, అందువల్ల రాబోయే ప్రమాదాల గురించి కూడా తల్లిదండ్రులు తెలుసుకుని ఉండాలి.ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్, స్నాప్‌ చాట్‌  వంటి విస్తృతి కలిగిన సోషల్‌ మీడియా వేదికలు అందుబాటులోకి వచ్చాక.. పిల్లలకు సంబంధించిన ప్రతి సంతోషాన్ని తల్లిదండ్రులు ప్రపంచంతో షేర్‌ చేసుకుంటున్నారు. అయితే అలా షేర్‌ చేయటం ఆ చిన్నారుల గోప్యతకు భంగం కలుగుతుందని ఆన్‌లైన్‌లో కొన్ని సంఘటనలు జరిగే వరకు తల్లిదండ్రులు గ్రహించ లేకపోతున్నారు. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

మార్ఫింగ్‌తో మహా ప్రమాదం
పిల్లల ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయటా న్ని ‘షేరెంటింగ్‌’ అంటున్నారు. దీనివల్ల పిల్లల గురించిన పూర్తి సమాచారం ఇంటర్నెట్‌లోకి వెళ్లిపోతుంది. కొందరు తల్లిదండ్రులు పిల్లల ఫొటోలపై ఎమోజీలు పెట్టి.. ముఖం కనిపించలేదు, ఇక సేఫ్‌ అనుకుంటున్నారు. అంతకంటే మూర్ఖత్వం మరోటి లేదు. ఇది ఏఐ యుగం అని మరిచిపోతే ఎలా? వారి ఫొటోలను మార్ఫింగ్‌ చేసేవాళ్లు, వారి వివ రాలను తమ స్వార్థానికి ఉపయోగించుకునే వాళ్లు ఉంటారు. పిల్లలపై ఆన్‌లైన్‌ వేధింపులూ జరగొచ్చు. తమకసలు సంబంధమే లేకుండా పిల్లలు నలుగురు నోళ్లలోనూ నానుతారు. దీనికంతటికీ కారణం తల్లిదండ్రుల అత్యుత్సాహమే.

అన్నీ చెప్పేసుకుంటే ముప్పు
పిల్లల ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే ముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సైబర్‌ క్రైమ్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ పిల్లల ప్రైవసీని కాపాడటం తల్లిదండ్రుల బాధ్యతేనని సోషల్‌ మీడియా ధోరణుల అధ్యయన నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. పిల్లల వివరాలన్నీ బయటికి వెళ్లిపోతే, ఏ వైపు నుంచైనా హాని, లేదా నష్టం సంభవించవచ్చని చెబుతున్నారు.

దొంగచేతికి తాళం ఇచ్చినట్లే!

పిల్లల ఫొటోలు.. ముఖ్యంగా వారి పేర్లు, పుట్టిన తేదీలు లేదా వారి లొకేషన్‌ను బహిర్గతం చేసే వివరాలతో ఉన్న పోస్టులను సైబర్‌ నేరస్థులు ఊహించని విధంగా వాడుకునే ప్రమాదం ఉంటుంది. తల్లిదండ్రులు షేర్‌ చేసిన పోస్టుల ఆధారంగా దొంగిలించిన సమాచారాన్ని తప్పుడు బ్యాంకు ఖాతాలను తెరవడానికి, అప్పుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి, లేదా ఈ పిల్లల్ని వేరే పిల్లలుగా నమ్మించి ఎవరినైనా మోసం చేయటానికి వాడుకో వచ్చు. ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి.

పేరెంట్స్‌.. పారాహుషార్‌
కడుపున పుట్టిన పిల్లలే అయినా వారి సమ్మతి లేకుండా వారి ఫొటోలను, వీడియోలను తల్లిదండ్రులు షేర్‌ చేయటానికి లేదు. ఒకవేళ పిల్లలు తెలియక సమ్మతించినా పెద్దలు ఆలోచించాలి. పిల్లల గోప్యతకు గౌరవం ఇవ్వాలి. 
పిల్లలు పెద్దయ్యాక, తమ తల్లిదండ్రులు షేర్‌ చేసిన తమ చిన్ననాటి ఫొటోల గురించి తెలిసి ఇబ్బంది పడవచ్చు. బాల్యంలోని ఫొటోలను స్నేహితులు చూసి.. లావుగా ఉన్నారనో, నల్లగా ఉన్నారనో వ్యాఖ్యలు చేయవచ్చు. అవి వారిని చాలా బాధిస్తాయి. ఎప్పటివో ఫొటోలు సోషల్‌ మీడియా సముద్రంలో పడి.. ఇప్పుడు సమస్యల సుడిగుండాలు సృష్టిస్తాయి.

భవిష్యత్తుపై ప్రభావం : కాలేజ్‌ అడ్మిషన్లు, ఉద్యోగ దరఖాస్తుల సమయంలో వారి భవిష్యత్‌ అవకాశాలను ఏ రూపంలోనైనా అవి ప్రభావితం చేయవచ్చు. మామూలు ఫొటోకు కథనం అల్లి, ఇంటర్నెట్‌లో తిప్పేవారు ఉంటారు.  చదువు, ఉద్యోగాలలోనే కాదు, పెళ్లి సంబంధాల విషయంలోనూ అవాంతరాలు రావచ్చు. (Independence day ఫ్యాషన్‌ క్లిక్‌.. మువ్వన్నెల వస్త్రాలు)

వేటాడే కళ్లకు చిక్కినట్లే! పిల్లలు స్నానం చేస్తున్నప్పటి ఫొటోలు, బట్టలు మార్చుకుంటున్నప్పటి ఫొటోలు కూడా కొన్ని సార్లు షేర్‌ అవుతుంటాయి. సైబర్‌ క్రిమినల్స్‌లోని వేటగాళ్ల కంట్లో ఆ ఫొ టోలు పడితే.. ఇక వాటిని వాళ్లు అసభ్య కరమైన వెబ్‌సైట్‌లకు షేర్‌ చేసే ప్రమాదం ఉంటుంది.

ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతో పిల్లల ఫొటోలను చూడలేని విధంగా మా ర్చి, నకిలీ ప్రొఫై ల్‌ను సృష్టించి అన్‌లైన్‌లో మోసపూరి తమైన లావా దేవీలను కొన సాగించే వారికి కూడా కొదవ లేదు. 

వేధింపులు – బెదిరింపులు!

ఆన్‌ లైన్‌లో : షేర్‌ చేసిన ఫొటోలను ఎవరు ఎలా దుర్వినియోగం చేస్తారో చెప్ప లేం. మార్ఫింగ్‌ చేయవచ్చు. మరెవరికైనా షేర్‌ చేయవచ్చు. ఏడిపించటానికి, బెదిరించ టానికి, వేధించటానికి ఆ వివరాలు తోడ్పడ వచ్చు.
అమాయకంగా కనిపించే పిల్లల ఫొటోలపై అసభ్యకరమైన కామెంట్లు  చేసేవా రుంటారు. కొందరు మీమ్స్‌ కూడా సృష్టించి వైరల్‌ చేస్తుంటారు. ఆ సంగతి అటు తిరిగి ఇటు తిరిగి ఈ పిల్లల్ని చేరిందంటే.. వారు ఆ దారుణాలను తల్లిదండ్రులకు చెప్పటానికి భయపడి, లోలోపలే మానసిక వ్యథను అనుభవిస్తారు. ఇది పిల్లలకు కాకుండా తల్లిదండ్రులకు తెలిసినా వారిదీ ఇదే పరిస్థితి. పోస్ట్‌లోని వివరాలను బట్టి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసుకుని బ్లాక్‌మెయిల్‌ చేసేవారూ ఉంటారు. 

ఇదీ చదవండి: జన్మాంతర సాఫల్యం అంటే ఎంటో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement