ఫ్యాషన్‌ క్లిక్‌.. ట్రై లుక్‌ : మువ్వన్నెల వస్త్రాలు | Independence day 2025 special themed designer dresses | Sakshi
Sakshi News home page

Independence day ఫ్యాషన్‌ క్లిక్‌.. మువ్వన్నెల వస్త్రాలు

Aug 15 2025 10:28 AM | Updated on Aug 15 2025 11:38 AM

Independence day 2025 special themed designer dresses

నిండైన అలంకరణతో దేశభక్తి చాటుతూ 

ప్రత్యేక సందర్భానికి అనుగుణంగా సిటిజనులు 

వస్త్రధారణ మేళవింపులో దుస్తులు, యాక్సెసరీస్‌  

వైవిధ్యభరిత ప్రయోగాలతో స్టైలిస్టుల ఫ్రీడమ్‌ లుక్స్‌  

కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల వస్త్రధారణలో భాగం కావడం సాధారణమే. అయితే ఈ మూడూ ఒకే డ్రెస్సింగ్‌లో మేళవింపుగా చూడాలంటే అది ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సాధ్యం. భారత జాతీయ జెండాను ప్రకాశింపజేసే త్రివర్ణాలను రంగరించి ఫ్యాషన్‌ ఔత్సాహికులు వస్త్రధారణ కాంతులీనేలా చేయడం ఇప్పుడు నగరంలో సర్వసాధారణంగా మారింది. ఆయా సందర్భాలు, సంఘటలకు అనుగుణంగా వస్త్రధారణలో మార్పులు ప్రస్పుటంగా కనిపించేలా అదరగొట్టే లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ వస్త్రధారణలో దుస్తులతోపాటు వివిధ రకాల యాక్సెసరీస్‌ అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.   – సాక్షి, సిటీబ్యూరో 

భారతీయ జెండా రంగులను – కాషాయం (ధైర్యం), తెలుపు (శాంతి) ఆకుపచ్చ (సంపద/ శ్రేయస్సు) దుస్తుల్లో చేర్చడం ఆనవాయితీగా మారింది. ఈ సందర్భంగా మహిళలు మూడు రంగుల్లో సొగసైన చీరలు, సల్వార్‌ కమీజ్‌ సెట్స్‌ లేదా కుర్తాలను ఎంచుకుంటున్నారు. అలాగే కాషాయం దుపట్టా, ఆకుపచ్చ గాజులతో తెల్లటి కుర్తాలను జత చేయడం లేదా పూర్తి త్రివర్ణాలు కలగలిసిన చీర ధరించడం కూడా ట్రెండ్‌ అవుతోంది. ‘మిగిలిన రోజుల్లో ఎన్ని ఫ్యాషన్స్‌ ఫాలో అయినా, ప్రత్యేక సందర్భాల్లో ట్రై కలర్స్‌ మన డ్రెస్సింగ్‌లో మేళవించడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తాం. ఈ వస్త్రధారణ మన ఫ్యాషన్‌ సెన్స్‌ చాటి చెప్పడానికి కాదు.. మనం భారతీయులం అని సగర్వంగా చెప్పుకోడానికి కదా’ అంటున్నారు నగరానికి చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌ కాచిగూడ నివాసి గౌరీ జోషి. ఇదే అభిప్రాయన్ని పూర్తిగా బలపరుస్తున్నారు నగర మహిళ సుమన్‌ కృష్ణ. ‘ఇది ఫ్యాషన్‌ షో కాదు.. మన అస్తిత్వ ప్రదర్శన’ అంటారామె. 

ఖాదీ.. హైదరాబాదీ.. 
పురుషులు కుర్తాలు, నెహ్రూ జాకెట్లు లేదా జాతీయవాద స్పర్శతో కూడిన సాధారణ టీ షర్ట్స్‌ కూడా ఇండిపెండెన్స్‌ లుక్‌లో భాగం చేస్తున్నారు. ఖాదీ అనేది కేవలం ఒక ఫ్యాబ్రిక్‌ మాత్రమే కాదు.  ఇది నాటి స్వాతంత్య్ర ఉద్యమంలో భాగం. అందుకే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖాదీ లేదా భారతీయ చేనేత వ్రస్తాలను కూడా అనేక మంది ధరిస్తున్నారు. తద్వారా భారతదేశ స్వాతంత్య్ర పోరాట మూలాలను స్మరించుకోవడంతో పాటు స్థానిక చేనేత కళాకారులకు మద్దతు అందించినట్టుగా భావిస్తున్నారు. అలాగే ఈ ట్రెండ్స్‌లో లినెన్‌ కాటన్, చందేరి ఖాదీ మిశ్రమాలు కూడా స్టైలిష్‌గా ప్రదర్శిస్తున్నారు. ‘జాతీయత ప్రతిబింబించే వస్త్రధారణ ఎంచుకున్నప్పుడు నా డ్రెస్సింగ్‌లో ఖాదీ తప్పనిసరిగా ఉండాల్సిందే’ అని చెప్పారు నగరానికి చెందిన ఈవెంట్‌ మేనేజర్‌ రాజ్‌ కిషోర్‌.  

స్వేచ్ఛా స్ఫూర్తిని తెలిపేలా..  : స్వేచ్ఛా స్ఫూర్తిని వ్యక్తీకరించడానికి ఫ్యాషన్‌ ఒక శక్తిమంతమైన మార్గం అంటున్నారు నగరానికి చెందిన హామ్‌స్టెక్‌ కాలేజ్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ ఎడ్యుకేషన్‌కు చెందిన ఫ్యాషన్‌ డిజైనింగ్‌ ఫ్యాకల్టీ. వారు అందిస్తున్న విశేషాలివి.. 

  • త్రివర్ణాలు (కుంకుమ, తెలుపు, లేదా ఆకుపచ్చ) కలిగన కుర్తాలను ఎంచుకుని, దానికి నప్పేలా లేదా కాంట్రాస్ట్‌గా ఉండే పైజామా జత చేయాలి. వీటికి అనుగుణమైన షేడ్‌లో దుపట్టా జోడించడం ఫ్రీడమ్‌ లుక్‌కి మెరుపునిస్తుంది.

  • స్వేచ్ఛను సగర్వంగా వేడుకగా జరుపుకోవడంలో ఆత్మవిశ్వాసం కనిపించాలి. అధికారిక సమావేశాలకు, సంప్రదాయ దుస్తులు, చీర లేదా కుర్తా, పైజామా వంటివి సరైన ఎంపిక. అయితే సాధారణ సమావేశాలకు, మరింత ఆధునిక శైలితో ప్రయోగాలు చేయవచ్చు. 

  • త్రివర్ణంలో మెరిసే గాజుల నుంచి స్కార్ఫ్‌లు, హెడ్‌ బ్యాండ్స్, రిస్ట్‌బ్యాండ్స్‌ వరకూ విభిన్న రకాల యాక్సెసరీస్‌ కూడా ఫ్రీడమ్‌ ఫ్లేవర్‌ జోడించడానికి సులభమైన మార్గం. 

  • సాధారణ ట్రై కలర్స్‌లో మెరిసే హెయిర్‌ క్లిప్‌తో కూడా ఇండిపెండెన్స్‌ డే లుక్‌ ప్రతిబింబించవచ్చు. 

  • స్ఫటికంలా మెరిసే తెల్లటి టాప్‌కి జీన్స్, జాకెట్‌ లేదా వేరే డ్రెస్‌ ఏదైనా స్పిరిట్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌ ప్రస్ఫుటించేలా క్లాసిక్‌ డెనిమ్‌ దుస్తులు ధరించి, వాటికి ట్రై కలర్‌ యాక్సెసరీస్‌ జోడిస్తే అందంగా తళుక్కుమనేలా కనిపిస్తారు. ఇది ఓ రకంగా ఫ్యూజన్‌Œ స్వేచ్ఛను కనబరుస్తుంది. 

  • ధోతి–చీర సంప్రదాయ ట్రెండ్‌ను మిళితం చేస్తుంది. ఇది ఫ్యాషన్‌–ఫార్వర్డ్‌ సౌకర్యవంతమైన విధంగా జరుపుకోడానికి అనువైన ఎంపికగా చేస్తుంది. 

  • హామ్‌ స్టెక్‌ కాలేజ్‌ ఆఫ్‌ డిజైన్‌  

ఇయర్‌ రింగ్స్‌ టు.. లెగ్గింగ్స్‌.. చెవిపోగుల నుంచి ట్రైకలర్స్‌తో ఎంబ్రాయిడరీ చేసిన జుతా (ఓ రకమైన పాదరక్షలు)ల వరకూ, యాక్సెసరీస్‌ కూడా ఫ్రీడమ్‌ స్ఫూర్తిని చాటేలా వినియోగిస్తున్నారు. అలాగే బ్యాగులు, దుపట్టాలు మాసు్కలు సైతం త్రివర్ణ శోభితంగా మారుతున్నాయి. పాఠశాలలు లేదా కళాశాలల్లోని అబ్బాయిలు అమ్మాయిలు త్రివర్ణాల థీమ్‌తో టీ షర్ట్స్, స్నీకర్స్‌ ఎంచుకుంటున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా త్రివర్ణాల థీమ్‌లతో కూడిన ఫ్యామిలీ కాంబో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ‘ప్రౌడ్‌ ఇండియన్‌’ అనే క్యాప్షన్‌ రాసున్న కస్టమైజ్డ్‌ టీ షర్ట్స్‌ స్కూల్స్‌లో విరివిగా కనిపిస్తున్నాయి. పర్యావరణ స్పృహతో మేళవించిన ఫ్యాషన్‌ అనుసరణీయంగా మారింది.  ఆర్గానిక్‌ కాటన్, రీసైకిల్‌ చేసిన దుస్తులు కూడా వినియోగిస్తు న్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement