
అథర్వ వేదానికి అనుబంధమైనది కృష్ణోపనిషత్తు. ఈ రెండు శ్లోకాలు అందులోనివే:
అన్యోన్య విగ్రహం ధార్యం తవాఙ్గస్పర్శనాదిహ / శశ్వత్స్పర్శాయితాస్మాకం గృహ్ణీమోవతారాన్వయమ్.
రుద్రాదీనాం వచః శ్రుత్వా ప్రోవాచ భగవాన్స్వయమ్ /అఙ్గసఙ్గం కరిష్యామి భవద్వాక్యం కరోమ్యహమ్.
సర్వాంగ సుందరుడు, సచ్చిదానంద స్వరూపుడు, మహావిష్ణు అవతారము అయిన శ్రీరామచంద్రుడిని చూసి వనవాసులైన మునిజనం (ఆయన సౌందర్యానికి) ఆశ్చర్యచకితులైనారు. ఆ మునులు శ్రీరాముడితో ‘ఈ భూమిపై జన్మించిన విష్ణు స్వరూపుడివైన నీ ఆలింగన సుఖాన్ని మేమందరం కోరుకుంటున్నాము’ అన్నారు. వారి మాటలకు శ్రీరాముడు ‘నా మరో అవతారమైన శ్రీకృష్ణావతారంలో మీరందరూ గోపికలై జన్మించి నా ఆలింగన సౌఖ్యాన్నీ, అతి సన్నిహిత సామీప్యాన్నీ అనుభవించి ఆనందిస్తారు’ అని బదులిచ్చాడు. ‘అలాగా స్వామీ! అయితే మమ్ములను మా మరుజన్మలో గోపికలుగాను, గోపబాలురుగాను జన్మింపజేయండి. మీ సాన్నిధ్యాన్ని, మీ స్పర్శ సుఖాన్ని పొందే స్థితిలో మాకు గోపికలుగానూ, గోపబాలురుగానూ రూపాలు ధారణ చేయడం సమ్మతమే!’ అని ఆ మునిగణం ఆనందంతో అంగీకారం తెలిపారు. రుద్రాది దేవతలు, మునులు స్వయంగా చేసిన ఈ స్నేహమయ ప్రార్థనను విన్న ఆదిపురుషుడైన భగవానుడు ‘మీ గాఢమైన కోరికను నేను తప్పక మన్నించి నెరవేరుస్తాను!’ అన్నాడు – అని పై శ్లోకాల భావం. పరమ పురుషుడు, భగవానుడు అయిన శ్రీరాముడి ఈ మాటలను విన్న దేవ మునిగణాలు ఆనందంతో ‘మేము కృతార్థులమైనాము స్వామీ!’ అన్నారు.
రామావతారంలో ఏకపత్నీవ్రతుడు అయిన కారణంగా శ్రీరాముడికి మునిజనం కోరికను ఆ జన్మలో తీర్చే అవకాశం లేకపోయిందన్నది విదితం. ఒక జన్మలో చేసిన పుణ్యాలకు ఫలితాన్ని మలి జన్మలో పొందడాన్ని ‘జన్మాంతర సాఫల్యం’ అంటారు. రామావతారంలో మునిజనం కృష్ణావతారంలో గోపికలై జన్మించడం ద్వారా భగవంతునితో అత్యంత సన్నిహితమైన సాంగత్యం పొంది అత్యుత్తమమైన జన్మాంతర సాఫల్యాన్ని పొందారు.
– భట్టు వెంకటరావు