చేనేత కార్మికుల కష్టాలు, సమస్యలను దగ్గరగా చూసి, క్షేత్రస్థాయిలో వాటిని అధ్యయనం చేసి వెండితెరపైన ‘మల్లేశం’ సినిమా రూపంలో వాస్తవాన్ని చూపారు దర్శకులు రాజ్ రాచకొండ. పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం నిజ జీవితాన్ని కళ్ళకు కట్టారు. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా... ఆ విశేషాలను ఇలా మన ముందుంచారు...
→ ‘మల్లేశం’ సినిమా చేయడానికి స్ఫూర్తి ఏమిటి?
పోచంపల్లి, నల్గొండలోని కొన్నిప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి చేనేత కార్మికుల వైపు నా దృష్టి మళ్లింది. ఆప్రాంతంలోని చేనేత కార్మికుల పరిస్థితి ఎంతో బాధాకరం. వారంతా ఎంతోప్రాచీనమైన కళలో అత్యంత నైపుణ్యం గల దిట్టలు. అయినప్పటికీ పేదరికంలోనే జీవిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు రోజుకు ఎనిమిది నుంచి పది గంటల పాటు చేతులను పైకెత్తి ‘ఆసు’ ప్రక్రియ చేయాల్సి రావడం మొదటిసారి చూసినప్పుడు ఆ దృశ్యం నన్ను ఎంతో కలచివేసింది. ఆర్థికంగా గౌరవప్రదమైన జీవితం లేకపోవడంతో తరతరాలుగా చేనేతపై ఆధారపడిన కుటుంబాలు ఇప్పుడు మగ్గాన్ని వదిలేస్తున్నాయి.
→ చింతకింది మల్లేశం గురించి చెప్పండి?
చేనేతరంగానికి సంబంధించి ఆయన చేసిన ఆవిష్కరణ గురించి తొలిసారి విన్నప్పుడు నాకు ఇది భారతీయ సినిమా ద్వారా చాలా అరుదుగా చెప్పే కథ అనిపించింది. ఏడో తరగతి వరకు మాత్రమే చదివిన ఒక వ్యక్తి తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి దాన్ని తొలగించాలనే సంకల్పంతో దాదాపు పదేళ్లు శ్రమించి ఒక యంత్రాన్ని కనిపెట్టాడు. ఒక కుమారుడు తన తల్లి బాధను చూసి దాన్ని అలాగే వదిలేయకుండా పరిష్కారం కోసం పోరాడడం అనే భావోద్వేగమే నన్ను ఈ కథవైపు ఆకర్షించింది.
→ ఈ సినిమా కోసం ఎలాంటి రీసెర్చ్ చేశారు? క్షేత్రస్థాయిలో ఎవరెవరితో మాట్లాడారు?
ఈ సినిమా కోసం రెండేళ్లపాటు విస్తృతంగా పరిశోధన చేశాను. పోచంపల్లి, రేవణపల్లి, కొయ్యలగూడెం, పరిసర చేనేత గ్రామాల్లో ఎక్కువ సమయం గడిపాను. నిజ జీవిత మల్లేశంతో గంటల తరబడి మాట్లాడి ఆయన ఆవిష్కరణ మాత్రమే కాదు, ఆయన భావోద్వేగ ప్రయాణం, సందేహాలు, ఎదుర్కొన్న అవమానాలు, ముందుకు నడిపించిన ప్రేమ గురించి తెలుసుకు న్నాను.
ఆయన కనిపెట్టినా ’ఆసు’ యంత్రాన్ని ఉపయోగించిన మహిళా చేనేత కార్మికులతో మాట్లాడాను. వారి ముఖాల్లో, వారి భాషలో ఉపశమనం ఎంతో స్పష్టంగా కనిపించింది. అలాగే మాస్టర్ వీవర్లు, సహకార సంఘాల సభ్యులు, వస్త్ర శాఖ అధికారులతో మాట్లాడి వ్యవస్థాపరమైన సమస్యలను అర్థం చేసుకున్నాను. ముఖ్యంగా మల్లేశం తల్లి నరసమ్మ ఈ కథలోని భావోద్వేగానికి రూపం ఇవ్వడంలో ఎంతో ప్రభావం చూపించారు.
→ షూటింగ్ అంతా రియల్ లొకేషన్స్లో చేశారు కదా! అక్కడ చేనేత కార్మికులను నేరుగా చూసి ఉంటారు. వారి సమస్యల గురించి మీతో ఏమైనా పంచుకున్నారా?
ప్రీ-ప్రొడక్షన్ మొత్తం రేవణపల్లిలోనే జరిగింది. నిజమైనప్రాంతాల్లో చిత్రీకరణ చేయడం మాకు చాలా అవసరం. అక్కడ నన్నెంతో ఆలోచింపజేసిన విషయం ఏమిటంటే, చేనేత కార్మికులు ముందుగా వేతనాల గురించి లేదా ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడలేదు. వారి అసలు బాధ తమ గుర్తింపు, ఆత్మగౌరవం గురించి. ‘మేము నేసిన చీరలు పెద్ద నగరాలకు, ధనవంతుల దగ్గరకు వెళ్తాయి.
కానీ మా పిల్లలు తమ తండ్రి చేనేత కార్మికుడని చెప్పడానికి సిగ్గుపడుతున్నారు’ అని వారు చెప్పేవారు. ఉత్పత్తికి ఉన్న విలువ, దాన్ని తయారు చేసిన వ్యక్తికి దక్కని గౌరవం మధ్య ఉన్న ఈ అంతరాన్ని సినిమాలో చూపించాలని ప్రయత్నించాను. అలాగే మల్లేశం కనిపెట్టిన ఆసు యంత్రం వల్ల మహిళల ఆరోగ్యంలో నిజంగానే మార్పు వచ్చిందని చాలామంది చేనేత కార్మికులు చె΄్పారు.
→ చేనేత రంగానికి ఏం చేస్తే ఆ రంగం నిలదొక్కుకుంటుంది? ఒక క్రియేటివ్ డైరెక్టర్‌గా మీరేమైనా సూచనలు చేస్తారా?
చేనేత ప్రపంచాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా కొన్ని విషయాలు స్పష్టంగా అనిపించాయి. మొదటిగా.. చేనేత కార్మికుడి గుర్తింపునకు గౌరవం తీసుకురావాలి. ఒక వినియోగదారుడు పోచంపల్లి ఇక్కత్ లేదా ఏదైనా చేనేత చీర కొనుగోలు చేసినప్పుడు, దాన్ని తయారు చేసిన కుటుంబం పేరు, గ్రామం గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉండాలి.
అలాంటి కథనాలు ఉత్పత్తికి మరింత విలువను తీసుకురావడమే కాక వినియోగదారులతో భావోద్వేగ అనుబంధాన్ని కూడా పెంచుతాయి. రెండవది.. మల్లేశం రూపొందించిన ‘ఆసు’ యంత్రం వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించాలి. కళాత్మకతకు భంగం కలగకుండా శారీరక శ్రమను తగ్గించడం సంప్రదాయానికి వ్యతిరేకం కాదు. మూడవది.. యువత చేనేతను పేదరికానికి ప్రతీకగా కాకుండా అవకాశాలున్న వృత్తిగా చూడాలి. అందుకు మనం మరింతగా చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి ధరించడం అవసరం.
→ మల్లేశం అనే వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని సినిమా చేశారు కదా! అలాంటి మల్లేశాలు నిజజీవితంలో ఇంకా ఉన్నారా?
కచ్చితంగా ఉన్నారు. ఈ విషయం గురించి నాకు ఎంతో బలమైన నమ్మకం ఉంది. భారతదేశంలోని గ్రామాల్లో అసాధారణమైన తెలివితేటలతో గొప్ప సమస్యలకు పరిష్కారాలు కనుగొంటున్న ఎంతోమంది ఉన్నారు. కానీ వారికి మీడియా గుర్తింపు ఉండదు, నిధులు అందవు, ప్రశంసలు దక్కవు. మల్లేశం కూడా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అవార్డు వచ్చేవరకు పెద్దగా ఎవరికీ తెలియని వ్యక్తే. చేనేత కార్మికులు, రైతులు, గిరిజన కళాకారులు, మొదటి తరానికి చెందిన వ్యాపారవేత్తలు తమ సమాజాల్లో నిశ్శబ్దంగా జీవితాలను మార్చుతున్నారు. అలాంటి వారిని గుర్తించి, ప్రపంచానికి పరిచయం చేయడం సినిమా దర్శకులు, జర్నలిస్టులు, కథకుల బాధ్యత.
→ గతంలో ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్‌బెనగల్ పోచంపల్లి కార్మికుల మీద తీసిన ‘సుస్మాన్ ’కు దేశవ్యాప్త స్పందన వచ్చింది కదా! మీ చిత్రం దానికి ఏ రకంగా భిన్నమైనది.
‘సుస్మాన్’ ఒక మైలురాయి లాంటి చిత్రం. శ్యామ్ బెనగల్ ఒక దిగ్గజ దర్శకుడు. ఆ చిత్రంతో పోల్చలేం. ’సుస్మాన్’ ప్రధానంగా చేనేత కార్మికుల సామూహిక బాధను, వ్యవస్థాపరమైన దోపిడీని ప్రతిబింబించింది. అది ఒక సామాజిక వాస్తవిక చిత్రణ. కానీ ‘మల్లేశం’ ఒక వ్యక్తి బాధకు ఇచ్చిన వ్యక్తిగత స్పందన గురించి. అది నిరసన కాదు, నిరాశ కాదు. తల్లిపై ప్రేమతో పుట్టిన ఆవిష్కరణ కథ. చివరికి ఇది ఒక తల్లి–కొడుకుల అనుబంధం గురించి చెప్పే సినిమా. చేనేత సంక్షోభం ఇందులో నేపథ్యం మాత్రమే, అసలు కథ మనుషుల మధ్య ఉన్న బంధం. అలాగే ‘మల్లేశం’ తెలంగాణలోని పోచంపల్లి సంస్కృతి, భాష, యాసలతో ముడిపడిన తెలుగు సినిమా. ఆ స్థానికతే దీనికి విశ్వవ్యాప్తమైన అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతున్నాను.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి


