కుటుంబ నిర్వహణలో అసమానతలు
కుటుంబ నిర్వహణ భారమే కాదు.. కుటుంబ నియంత్రణ భారం కూడా మహిళలే మోయాల్సి వస్తోందని తాజా గణాంకాలు రుజువు చేస్తున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, భారతదేశంలో ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటున్న మహిళలు 36.5 శాతం మంది ఉండగా, వాసెక్టమీ పద్ధతిని ఎంచుకుంటున్న పురుషులు కేవలం 0.5 శాతం మాత్రమే. శాస్త్రీయత లేని అపోహలు, లోతుగా పాతుకుపోయిన పురుషాధిక్య ధోరణులు కుటుంబ నియంత్రణ వ్యవస్థలో లింగ అసమానతలకు కారణంగా నిలుస్తున్నాయి. మహిళలనే బాధితులుగా నిలుపుతున్నాయి.
దేశంలో కుటుంబ నియంత్రణ సేవల వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతున్నప్పటికీ, ఆ బాధ్యత భారం మాత్రం ఇంకా మహిళల పైనే సాగుతోంది. అందుకు సాక్ష్యమే ఈ నివేదికలు. మహిళలకు సంబంధించిన ట్యూబెక్టమీ ఆపరేషన్ చాలా క్లిష్టమైనదయినప్పటికీ, దేశంలో 36.5% మంది మహిళలు దీనిని చేయించుకుంటున్నారు. కానీ ఎంతో సులువైన, సురక్షితమైన వాసెక్టమీ చేయించుకునే పురుషుల శాతం కేవలం 0.5% మాత్రమే ఉంది. అంటే కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో స్త్రీ, పురుషుల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.
శాస్త్రీయత లేని అపోహలు...
కుటుంబ నియంత్రణ భారమంతా మహిళలపైనే పడటానికి పురుషుల్లో ఉన్న అవగాహనా లోపం, లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందనే సామాజిక, మానసిక భయాలే ప్రధాన కారణమని సర్వేలు చెబుతున్నాయి. లైంగిక విజ్ఞానం పెరిగినప్పటికీ ఇప్పటికీ చాలా మంది పురుషులు వాసెక్టమీని లైంగిక సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయే ప్రక్రియగానే భావిస్తున్నారు. వాసెక్టమీ అనేది కేవలం శుక్రకణాలను తీసుకెళ్లే నాళాలను మూసివేసే ఒక చిన్న ప్రక్రియ మాత్రమే. దీనివల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తికి గానీ, వారి శృంగార సామర్థ్యానికి గానీ, శారీరక శ్రమ చేసే శక్తికి గానీ ఎలాంటి నష్టం వాటిల్లదు. ఈ ఆపరేషన్ చేయించుకుంటే శరీరం బలహీనపడిపోతుందని భావించడం వల్ల, ముఖ్యంగా రోజువారీ కూలీలు, కష్టపడి పనిచేసే కార్మికులు తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఈ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు.
మహిళలకే పరిమితం...
దేశంలో దశాబ్దాలుగా సాగుతున్న కుటుంబ నియంత్రణ ప్రచారాలు, ఆరోగ్య పథకాలు కూడా ఈ బాధ్యతను మహిళల పైనే నెట్టేలా రూపుదిద్దుకున్నాయి. ప్రభుత్వ కుటుంబ నియంత్రణ ప్రచారాలన్నీ కూడా ఎక్కువగా మహిళలనే లక్ష్యంగా చేసుకుని ఉన్నాయి. ముఖ్యంగా గర్భిణులు, తల్లుల చుట్టూనే తిరుగుతున్నాయి. అలాగే మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో, ప్రసవాల కోసం నిరంతరం ఆసుపత్రులను సందర్శిస్తుంటారు. ఆ సందర్భాల్లో వైద్యులకు, గర్భిణులకు మధ్య శాశ్వత కుటుంబ నియంత్రణపై జరిగే చర్చలు సైతం కుటుంబ నియంత్రణ అనేది కేవలం మహిళల బాధ్యత అనే భావనను బలపరిచాయి.
కమ్యూనికేషన్ గ్యాప్...
గతంలో దేశంలో జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల తాలూకు చేదు జ్ఞాపకాలు, భయాలు ఇప్పటికీ పురుషుల్లో ఒక రకమైన అపనమ్మకాన్ని కలిగిస్తున్నాయి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ లోపం కూడా ఇందుకు ఒక కారణం. పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న కుటుంబాలలో భార్యాభర్తల మధ్య కుటుంబ నియంత్రణపై సరైన చర్చలు జరగడం లేదు. ఈ కమ్యూనికేషన్ లోపం కారణంగా, మహిళలు తమ భర్తలకు తెలియకుండా రహస్యంగా గర్భనిరోధక మాత్రలు, కాపర్–టి వంటి పద్ధతులను వాడుతున్నారు. గతంలో 15% గా ఉన్న ఈ రహస్య వినియోగం ఇప్పుడు 27% కి పెరగడం గమనార్హం.
మార్పు దిశగా...
కుటుంబ నియంత్రణ అనేది ఇద్దరు భాగస్వాములకు సమాన బాధ్యత అయినప్పటికీ, ఈ భారాన్ని మహిళలే మోయాల్సి రావడం వల్ల వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది. సమాజంలో ఉన్న ఈ భారీ లింగ వ్యత్యాసాన్ని తొలగించాలంటే కేవలం ప్రభుత్వ పథకాలు మాత్రమే సరిపోవని, పురుషుల ఆలోచనా విధానంలోనూ మార్పు రావాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వైద్యులు కుటుంబ నియంత్రణపై దంపతులిద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించాలి. వాసెక్టమీ సురక్షితమైనదనే అవగాహన కల్పించాలి. ఇప్పటికే వాసెక్టమీ చేయించుకుని ఆరోగ్యంగా ఉన్న పురుషులను, పురుష ఆరోగ్య కార్యకర్తలను బ్రాండ్ అంబాసిడర్లుగా మార్చి, ఇతరులలో ఉన్న సామాజిక భయాలను పోగొట్టాలి. ముఖ్యంగా కుటుంబ నియంత్రణ అనేది కేవలం మహిళలకు సంబంధించిన విషయమనే భావనని సమాజం నుంచి తొలగించినపుడు మార్పు సాధ్యమవుతుంది.


